Vijayawada: విజయవాడ మెట్రో రైలు కల సాకారానికి తొలి అడుగు..
మెట్రో రైలు.. విజయవాడ వాసుల కల. రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచీ.. దీనిపై ఊరిస్తూనే ఉన్నారు. గతంలో అదిగో.. ఇదిగో అంటూ ప్రకటనలు ఇచ్చారు. అయితే ఇప్పుడు.. మెట్రో కల సాకారానికి తొలి అడుగు పడింది. విజయవాడ మెట్రో భూసేకరణకు ఇటీవలే సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో నగరంతో పాటు శివార్లలో ఎక్కడెక్కడ మెట్రో స్టేషన్లు రాబోతున్నాయి. ఎంత భూమి అవసరమనే అంచనాలను తయారు చేసే పనిలో బిజీ అయ్యారు.

ఏపీ వాసుల మెట్రో కల నెరవేర్చేందుకు కూటమి ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా కృష్ణా జిల్లా గన్నవరం సమీపంలోని కేసరపల్లి దగ్గర మెట్రో కోచ్ డిపోను ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అక్కడి నుంచి స్టార్ట్ అయి విజయవాడలోని పీఎన్బీఎస్ వరకూ ఒక కారిడార్ వస్తుంది. ఈ 26 కిలోమీటర్ల మార్గం విజయవాడ మెట్రో మొదటి దశలో ఎంతో కీలకమైనది. గన్నవరం నుంచి గూడవల్లి, నిడమానూరు, ప్రసాదంపాడు, రామవరప్పాడు చౌరస్తా వరకు నేషనల్ హైవే మీదుగా ఇది వస్తుంది. అక్కడ నుంచి ఏలూరు రోడ్డులోకి మలుపు తిరిగి గుణదల, మాచవరండౌన్, బీసెంట్ రోడ్డు, రైల్వేస్టేషన్ మీదుగా పీఎన్బీఎస్ వరకు మెట్రో రైలు వస్తుంది. ఇక రెండో కారిడార్ పెనమలూరు వరకు వెళ్తుంది. ఇది పీఎన్బీఎస్ నుంచి ప్రారంభమవుతుంది. 12.5 కిలో మీటర్ల ఈ రూట్ బందరు రోడ్డు మీదుగా విజయవాడలోని కీలకమైన ఆటోనగర్, బెంజ్ సర్కిల్, ఇందిరాగాంధీ స్టేడియం లాంటి రద్దీ ప్రాంతాలను కలుపుతుంది.
తొలిదశలో ఏర్పాటు కానున్న 34 మెట్రో స్టేషన్లు, కోచిపో కోసం 91 ఎకరాల వరకూ భూసేకరణ చేయాల్సి ఉంది. దీనిలో విజయవాడలో 30 ఎకరాల వరకూ సేకరించేందుకు ఇప్పటికే విధివిధానాలు సిద్ధం చేశారు. రెవెన్యూ వార్డు, సర్వే నంబర్లతో సహా విజయవాడలోని కీలకమైన ప్రాంతాల్లో ఎంత భూసేకరణ చేయాలో అధికారులు గుర్తించారు. రద్దీ ప్రాంతాల్లో భూసేకరణకు ఎటువంటి ఇబ్బంది లేకుండా, తక్కువ విస్తీర్ణంలోనే మెట్రో స్టేషన్లను నిర్మించేందుకు ప్రతిపాదనలు రెడీ చేశారు. విజయవాడ పరిధిలోని 8, 9, 10, 11, 16 రెవెన్యూ వార్డుల్లోని 31కి పైగా సర్వే నంబర్ల పరిధిలో భూసేకరణ చేయాల్సి ఉంది.
కృష్ణా జిల్లా పరిధిలో గ్రామీణ ప్రాంతాలు కావడంతో భూసేకరణకు పెద్దగా ఇబ్బందులు ఉండకపోవచ్చు. విజయవాడ దాటిన తర్వాత ఒకవైపు గన్నవరం, మరోవైపు పెనమలూరు వరకూ కృష్ణా జిల్లాలో భూసేకరణ చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. మొదటి దశలో కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల పరిధిలో మొత్తం 34 స్టేషన్లు రానున్నాయి. ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లా పరిధిలోని విజయవాడలో 20 మెట్రో స్టేషన్లు, కృష్ణాలో ఒకవైపు గన్నవరం, మరోవైపు పెనమలూరు వరకు 14 స్టేషన్లు రాబోతున్నాయి. విజయవాడలోని పీఎన్బీఎస్ వద్ద కలిసేలా రెండు రూట్లలో 38.40 కిలో మీటర్ల మెట్రో లైన్ వేయనున్నారు. మొత్తంగా విజయవాడ నగర వాసుల మెట్రో కల సాకారం అయ్యేలా పనులు వేగంగా జరుగుతున్నాయి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
