AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పత్తి, మిరప కాదు.. ఇప్పుడు ఈ పంట వేస్తే రైతులకు కాసుల పంటే..

మార్కాపురం జిల్లా రైతు శ్రీనివాసులు, సాంప్రదాయ పంటలను వదిలి బూడిద గుమ్మడి సాగుతో లక్షల ఆదాయం పొందుతున్నారు. తక్కువ పెట్టుబడి, ఏడాది పొడవునా దిగుబడి, మార్కెట్‌లో స్థిరమైన డిమాండ్ వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని, ఆయన వ్యవసాయంలో విజయం సాధించారు. ఇది ఇతర రైతులకు ఆదర్శంగా నిలుస్తోంది.

పత్తి, మిరప కాదు.. ఇప్పుడు ఈ పంట వేస్తే రైతులకు కాసుల పంటే..
Ash Gourd Farming
Ram Naramaneni
|

Updated on: Jul 20, 2026 | 5:38 PM

Share

వ్యవసాయంలో లాభాలు లేవు, రైతులు బతకడం కష్టమని చాలా మంది అంటుంటారు. అయితే, పంటలను కాదు, ఆలోచనను మార్చుకుంటే వ్యవసాయం కూడా బంగారు బాట వేస్తుందని మార్కాపురం జిల్లాకు చెందిన రైతు శ్రీనివాసులు నిరూపిస్తున్నారు. తక్కువ పెట్టుబడి, ఏడాది పొడవునా ఆదాయం, మార్కెట్‌లో స్థిరమైన డిమాండ్ అనే మూడు కీలక అంశాలను దృష్టిలో పెట్టుకుని ఆయన బూడిద గుమ్మడి సాగును ఎంచుకుని లక్షల్లో ఆదాయం పొందుతున్నారు. మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలం నాగులవరం గ్రామానికి చెందిన రైతు శ్రీనివాసులు గతంలో పత్తి, మిరప వంటి సాంప్రదాయ పంటలను సాగు చేశారు. అయితే, ఏటా పెరుగుతున్న పెట్టుబడులు, ఆశించినంత దిగుబడి రాకపోవడం, వచ్చిన పంటకు గిట్టుబాటు ధర దక్కకపోవడంతో తీవ్ర నిరాశకు గురయ్యారు. దీంతో, తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం అందించే ప్రత్యామ్నాయ పంటల కోసం విస్తృతంగా అన్వేషించారు. మార్కెట్ అవసరాలను, పంటకు ఉన్న డిమాండ్‌ను అధ్యయనం చేసిన తర్వాత, బూడిద గుమ్మడి సాగును ఎంచుకున్నారు. శ్రీనివాసులు తీసుకున్న నిర్ణయం సత్ఫలితాలనిచ్చింది. బూడిద గుమ్మడికి మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉండటంతో పాటు ధర కూడా స్థిరంగా ఉండటంతో ఆయనకు లాభాలు రావడం ప్రారంభమైంది. అప్పటి నుంచి గత పదేళ్లుగా నిరంతరంగా బూడిద గుమ్మడినే సాగు చేస్తున్నారు.

ఇతర పంటల్లా ఏడాదికి రెండు లేదా మూడు సీజన్లకు పరిమితం కాకుండా, ఏడాది పొడవునా ఏదో ఒక పొలంలో గుమ్మడి దిగుబడి వచ్చేలా ప్రత్యేక ప్రణాళిక రూపొందించారు. విడతల వారీగా సాగు చేస్తూ, ప్రతి నెలా మార్కెట్‌కు సరుకును పంపేలా తన వ్యవసాయాన్ని తీర్చిదిద్దుకున్నారు. బూడిద గుమ్మడి సాగు పద్ధతుల గురించి రైతు శ్రీనివాసులు వివరించారు. మంగళగిరి నుంచి విత్తనాలను తెప్పించుకుంటారు. ఒక ఎకరానికి 50 కిలోల సూపర్ ఫాస్ఫేట్, 20 కిలోల నత్రజని, 20 కిలోల పొటాషియం కలిపి విత్తనంతో పాటు భూమిలో వేస్తారు. నీళ్లు పెట్టిన 7-8 రోజుల్లో మొలక వస్తుంది. బోదెలకు మధ్య 3 అడుగుల దూరం, ఒక్కొక్క పట్టెకు మధ్య 9 అడుగుల దూరం ఉండేలా చూసుకుంటారు. ఈ 3 అడుగుల దూరం నీరు కట్టడానికి, మందులు పిచికారీ చేయడానికి, మొక్కలను పర్యవేక్షించడానికి ఉపయోగపడుతుంది. 25-30 రోజుల్లో తీగ సాగడం ప్రారంభమవుతుంది. ఈ దశకు ముందు కలుపు నివారణ చేపట్టి, తీగను 9 అడుగుల గ్యాప్‌లో విస్తరించేలా సర్దుతారు. 40 రోజుల దశలో పూత ప్రారంభమవుతుంది. ఈ దశ నుండే జాగ్రత్తగా పర్యవేక్షించడం ముఖ్యం, లేకపోతే పండు ఈగ సోకే ప్రమాదం ఉంది. ఇది సోకినప్పుడు కాయ వంకర పోవడం, పుచ్చిపోవడం జరుగుతుంది. దీనిని నివారించడానికి 40వ రోజు నుండి యాంప్లిగో, బెండాల్, బైఫెన్త్రిన్ వంటి మందులను పిచికారీ చేస్తారు.

మార్కెటింగ్ విషయానికి వస్తే, విజయవాడ, హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాలకు తమ ఉత్పత్తులను పంపుతారు. 2.5 నుండి 4 కిలోల మధ్య బరువున్న గుమ్మడికాయలకు మంచి డిమాండ్ ఉంటుందని శ్రీనివాసులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో అమరావతి నాట్లు అనే రకానికి ఎక్కువ డిమాండ్ ఉంది. ఇవి ఎకరానికి 10 నుంచి 15 టన్నుల దిగుబడిని ఇస్తాయి, త్వరగా పాడవ్వవు. బెంగళూరు, చెన్నై వంటి మహానగరాల్లో సన్‌బ్రో, ఈస్ట్ వెస్ట్, మైకో వంటి రకాలు వాడతారు, ఇవి 15-20 టన్నుల దిగుబడిని ఇచ్చినప్పటికీ, త్వరగా పాడైపోవడం వల్ల వ్యాపారస్తులు అమరావతి నాట్లకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఒక ఎకరాకు దాదాపు లక్ష రూపాయల స్థూల ఆదాయం వస్తుందని, ఖర్చులు పోను 60 నుండి 70 వేల రూపాయల నికర లాభం మిగులుతుందని శ్రీనివాసులు స్పష్టం చేశారు. తక్కువ పెట్టుబడి, నిరంతర ఆదాయం, మార్కెట్‌లో స్థిరమైన డిమాండ్.. ఈ మూడు అంశాలే తన విజయానికి కారణమని ఆయన గర్వంగా చెబుతున్నారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా పంటను ఎంపిక చేసుకుంటే వ్యవసాయంలోనూ మంచి లాభాలు సాధించవచ్చని శ్రీనివాసులు తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.

ఎక్కడో ఎడారిలో పండే పంటను.. పల్నాడుకు తెచ్చిన రైతు.. సాగు వివరాలు మీ కోసం.. 

Follow Us