AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tirumala: శ్రీవారి భక్తులకు బిగ్‌ అలర్ట్.. టికెట్ల బుకింగ్‌పై ఆ ప్రచారాలు నమ్మొద్దు!

తిరుమల శ్రీవారి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల ఆన్‌లైన్ బుకింగ్‌లో తీవ్ర పోటీ నెలకొంటున్న నేపథ్యంలో, తమ ఆన్‌లైన్ వ్యవస్థ అత్యంత పటిష్టంగా పనిచేస్తోందని టీటీడీ స్పష్టం చేసింది. బుకింగ్ వైఫల్యాలపై సోషల్ మీడియాలో జరుగుతున్న అసత్య ప్రచారాలను నమ్మవద్దని భక్తులకు విజ్ఞప్తి చేస్తూ, సాంకేతిక అంశాలపై నెలకొన్న సందేహాలకు సమగ్ర వివరణ ఇచ్చింది.

Tirumala: శ్రీవారి భక్తులకు బిగ్‌ అలర్ట్.. టికెట్ల బుకింగ్‌పై ఆ ప్రచారాలు నమ్మొద్దు!
Tirumala Darshan Tickets
Raju M P R
| Edited By: |

Updated on: Sep 26, 2026 | 7:33 PM

Share

తిరుమల శ్రీవారి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల ఆన్‌లైన్ బుకింగ్‌ విధానంపై టీటీడీ క్లారిటీ ఇచ్చింది. సోషల్ మీడియాలో జరిగే అసత్య ప్రచారాన్ని నమ్మి భక్తులు కంగారు పడొద్దని కోరింది. టికెట్లకు ఉన్న డిమాండ్, అందుబాటులో ఉన్న కోటాకు మధ్య భారీ వ్యత్యాసం ఉందని టీటీడీ వివరించింది. బుకింగ్ సమయంలో సుమారు 6 లక్షల మంది యూజర్లు ఒకేసారి ప్రయత్నిస్తున్నారు. ఒక్కో యూజర్ సగటున నలుగురు కుటుంబ సభ్యుల కోసం ప్రయత్నించినా.. సుమారు 24 లక్షల టికెట్లకు డిమాండ్ ఏర్పడుతోంది. కానీ, అందుబాటులో ఉండే కోటా కేవలం 2.69 లక్షల టికెట్లు మాత్రమే. అంటే అందుబాటులో ఉన్న కోటాతో పోలిస్తే డిమాండ్ దాదాపు 9 రెట్లు ఎక్కువగా ఉంటోంది. వేలాది మంది ఒకేసారి ఒకే స్లాట్ కోసం ప్రయత్నించడం వల్లే టికెట్లు అత్యంత తక్కువ సమయంలోనే అయిపోతున్నాయని పేర్కొంది.

అత్యాధునిక సాంకేతికత, స్పెషల్ వార్ రూమ్

అధిక సంఖ్యలో భక్తులు ఒకేసారి వచ్చే డిమాండ్‌ను తట్టుకునేలా గూగుల్ క్లౌడ్ ప్లాట్ ఫామ్, లోడ్ బ్యాలెన్సింగ్, ఆటో స్కేలింగ్, డిస్ట్రిబ్యూటర్ అప్లికేషన్ ఆర్కిటెక్చర్, హారిజంటల్ స్కేలింగ్ వంటి ఆధునిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నట్లు టీటీడీ తెలిపింది. టికెట్ల విడుదల సమయంలో ప్రత్యేకంగా ‘టెక్నికల్ వార్ రూమ్’ ఏర్పాటు చేసి అప్లికేషన్ పర్ఫార్మెన్స్, సెక్యూరిటీ, లావాదేవీలను నిరంతరం పర్యవేక్షిస్తున్నారని తెలిపింది. సమస్యలు తలెత్తితే వెంటనే పరిష్కరించేలా సాంకేతిక బృందాలు పనిచేస్తున్నాయని స్పష్టం చేసింది.

వర్చువల్ క్యూ, పేమెంట్ సమస్యలపై స్పష్టత

ఒకేసారి భారీ స్థాయిలో అభ్యర్థనలు వచ్చినప్పుడు సిస్టం క్రాష్ అవ్వకుండా స్థిరత్వాన్ని కాపాడేందుకే ‘వర్చువల్ క్యూ’ విధానాన్ని వాడుతున్నట్లు సంస్థ స్పష్టం చేసింది. ఇది అధిక ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించే సాంకేతిక విధానమే తప్ప, భక్తులకు టికెట్లు నిరాకరించేందుకు కాదని తెలిపింది.

అధిక డిమాండ్ వల్ల టికెట్లు వేగంగా పూర్తయినప్పుడు ఈ సందేశం వస్తుంది. దీన్ని సాంకేతిక వైఫల్యంగా భావించకూడదని కోరింది. అలాగే ఆన్‌లైన్ చెల్లింపులు కేవలం టీటీడీ అప్లికేషన్‌పైనే కాకుండా పేమెంట్ గేట్ వేస్, బ్యాంకింగ్, యూపీఐ నెట్‌వర్క్‌లపై ఆధారపడి ఉంటాయని.. లావాదేవీ విఫలమైనప్పుడు సమస్య ఎక్కడ తలెత్తిందో పరిశీలించాల్సి ఉంటుందని తెలిపింది.

ఇతర ఆలయాల్లో సాఫీగా బుకింగ్

శ్రీ పద్మావతి అమ్మవారు, శ్రీ కల్యాణ వెంకటేశ్వర స్వామి, శ్రీ గోవిందరాజ స్వామి ఆలయాల దర్శన, సేవా కోటాలను కూడా ఇదే ఆన్‌లైన్ విధానం ద్వారా విడుదల చేస్తున్నట్లు టీటీడీ గుర్తుచేసింది. అక్కడ ఒకేసారి ఏర్పడే డిమాండ్ తక్కువగా ఉండటంతో బుకింగ్ ప్రక్రియ ఎలాంటి ఆటంకాలు లేకుండా సాఫీగా కొనసాగుతోందని స్పష్టం చేసింది.

నిరంతర అప్‌గ్రేడేషన్

భక్తుల ఫీడ్ బ్యాక్ ఆధారంగా ఆన్‌లైన్ బుకింగ్, డేటా బేస్ పర్ఫార్మెన్స్, హై లోడ్ హ్యాండ్లింగ్, సెక్యూరిటీ, యాంటీ బోట్ మెకానిజం, పేమెంట్ ప్రాసెస్‌లలో నిరంతరం సాంకేతిక అభివృద్ధికి చర్యలు తీసుకుంటోంది. గత ట్రాఫిక్ ప్యాటర్న్స్ ఆధారంగా కెపాసిటీ ప్లానింగ్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ స్కేలింగ్‌ను సమీక్షిస్తోంది.

భారీ డిమాండ్ ఉన్న సమయంలో ప్రతి బుకింగ్ ప్రయత్నం విజయవంతం కావడం సాధ్యం కాదని, ఒక ప్రయత్నంలో టికెట్ లభించనంత మాత్రాన వ్యవస్థలో సాంకేతిక లోపం ఉందని భావించవద్దని టీటీడీ భక్తులను కోరింది. ఆన్‌లైన్ బుకింగ్ సేవలను పారదర్శకంగా, సురక్షితంగా అందించేందుకు నిరంతరం కృషి చేస్తున్నట్లు టీటీడీ స్పష్టం చేసింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us