Srikakulam: ‘మౌనికా నీవు లేని ఈ లోకంలో నేనెలా ఉండగలను’.. భార్య మరణం తట్టుకోలేక ఆర్మీ జవాన్..
మరికొద్ది రోజుల్లో పండంటి బిడ్డకు జన్మనిస్తుందనుకున్న భార్య.. అనారోగ్య సమస్యలతో అకస్మాత్తుగా కన్నుమూసింది. దీంతో అతడి గుండె చెరువయ్యింది. భార్య ఇక లేదన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోయాడు. ఆమె లేకుండా తాను బతకలేనని డిసైడయ్యాడు.

అతడు ఆర్మీ జవాన్. దేశ రక్షణ బాధ్యతలను అంత:కరణ శుద్ధితో నిర్వర్తిస్తున్నాడు. గత ఏడాదికి అతడికి పెళ్లి అయ్యింది. పెద్దలు కుదర్చిన సంబంధం. తన గ్రామానికి చెందిన అమ్మాయే. ఆ దంపతులను చూసి ఈడు, జోడు ఎంత బాగుందో అనేవారు జనాలు. కలకలం పిల్లాపాపలతో చల్లగా ఉండాలని ధీవించేవారు. డ్యూటీలో భాగంగా వేరే రాష్ట్రంలో ఉన్నప్పటికీ.. తల్లిదండ్రులు, భార్య యోగక్షేమాలు ఎప్పుటికప్పుడు తెలుసుకునేవాడు అతడు. ఆ దంపతుల అన్యోనత చూసి ఆ విధికి కన్ను కుట్టిందో ఏమో.. ఇద్దర్నీ బలి తీసుకుంది. అనారోగ్యంతో భార్య మరణించగా.. ఆమె లేని ఎడబాటును తట్టుకోలేక భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ హృదయ విదారక ఘటన శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలంలో జరిగింది.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఆమదాలవలస మండలం ఈసర్లపేట గ్రామానికి చెందిన 27 ఏళ్ల మంగరాజు రాజబాబు.. 2016లో భారత సైన్యంలో చేరాడు. గత ఏడాది ఫిబ్రవరిలో అతడికి అదే గ్రామానికి చెందిన మౌనికతో పెళ్లి జరిగింది. కాగా రాజబాబు ప్రజంట్ హర్యానాలో విధులు నిర్వర్తిస్తున్నాడు. మౌనిక ఏడు నెలల ప్రెగ్నెంట్. ఆమెకు ఇటీవల హెల్త్ ఇష్యూస్ రావడంతో రాజబాబు తండ్రి సత్యనారాయణ.. విశాఖపట్నంలోని ఆర్మీ ఆసుపత్రిలో చేర్చించాడు. విషయం తెలిసిన వెంటనే సెలవుపై ఇంటికి వచ్చాడు రాజబాబు. భార్యను బతికించుకునేందుకు మానవ ప్రయత్నాలు అన్నీ చేశాడు. కానీ విధి కరుణించలేదు. పరిస్థితి విషమించడంతో 16వ తేదీన మౌనిక మృతి చెందింది.
భార్య మరణంతో తీవ్ర మనోవేదనకు గురైన రాజబాబు.. సరిగ్గా భోజనం కూడా చేయకపోవడంతో.. అనారోగ్యానికి గురయ్యాడు. ఈనెల 19న ఆసుపత్రిలో చూయించుకుని వస్తానని ఇంట్లో చెప్పి బయలుదేరాడు. ఆమదాలవలసలో ట్రైన్ ఎక్కి పొందూరులో దిగాడు. తాను పొందూరులో ఉన్నానని, అక్కడే చనిపోతున్నానని ఫ్రెండ్స్‌కు సందేశం పంపడంతో వెంటనే వారు ఆందోళన చెంది విషయాన్ని పొందూరు పోలీసులకు సమాచారమిచ్చారు. మిత్రులు, బంధువులు బుధవారం ఉదయాన్నే పొందూరులోని రైల్వే ట్రాక్స్‌పై వెతికారు. చివరకు 11 గంటల సమయంలో కొంచాడ సమీపంలోని తోటలో ఓ యువకుడు మృతి చెందినట్లు సమాచారం రావడంతో.. అక్కడి వెళ్లి చూడగా చెట్టుకు వేలాడుతూ కనిపించాడు. దీంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోధించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం..