AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Araku: ముచ్చటగా ముళ్లపీటలపై.. స్నేహానికి ప్రతీకగా నిలిచే ఈ ట్రైబల్ ఫెస్టివల్ గురించి తెలుసా..

అరకులోయ ఏజెన్సీ.. బలి ఉత్సవం పండుగ శోభతో కళకళలాడుతోంది. 12 రోజుల పండుగ ఏజెన్సీలోనే ఓ ప్రత్యేకం. ఈ పండక్కి మరో విశేషం ఉంది. అదేంటంటే.. కేవలం ఒక్క పంచాయతీ పరిధిలోనే జరుగుతుంది. ఈ ఫెస్టివల్‌లో మహిళలకే ప్రాధాన్యం. నిష్టతో ముళ్ళ పిటలపై కూర్చోవడం ఈ పండగ ప్రత్యేకత. స్నేహానికి ప్రతికగా నిలిచే ఆదివాసి అరుదైన బలి పండుగ విశేషాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

Araku: ముచ్చటగా ముళ్లపీటలపై.. స్నేహానికి ప్రతీకగా నిలిచే ఈ ట్రైబల్ ఫెస్టివల్ గురించి తెలుసా..
Araku Valley's Bali Utsavam
Maqdood Husain Khaja
| Edited By: |

Updated on: Sep 06, 2025 | 4:55 PM

Share

ఆదివాసీల ఆచార వ్యవహారాలు కాస్త భిన్నంగా ఉంటాయి. పండగైనా, పబ్బమైనా ఓ ప్రత్యేకత సంతరించుకుంటుంది. వేర్వేరు ప్రాంతాల్లో వారి సంస్కృతులకు అనుగుణంగా ప్రతియేట పండుగలు నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ప్రధానంగా అరకులోయ ఏజెన్సీలో నిర్వహించే బలి ఉత్సవం దేశంలోనే ఓ ప్రత్యేకత. ఎందుకంటే.. ఇది కేవలం ఒక పంచాయతీ మాత్రమే పండుగ పరిమితం. అది కూడా 12 రోజులపాటు అక్కడ పండుగ నిర్వహిస్తూ ఉంటారు.

ఏజెన్సీలో ఒక్కచోటే ఆ పండుగ..

స్నేహానికి ప్రత్యేకగా నిలిచే ఈ పండుగ బ్రిటిష్ కాలంలోనే మొదలైందట. అప్పట్లో ముఠాదార వ్యవస్థ ఏజెన్సీలో ఉండేది. అరకులోయ మండలంలోని సుంకరమెట్ట, కొత్త భల్లుగూడ, మాడగడ పంచాయతీలను కలుపుతూ మాడగడ ముఠాగా. ఆ కాలంలో అక్కడ బలి ఉత్సవం నిర్వహించేవారు. 12 రోజులపాటు జరిగే ఈ ఉత్సవంకు ఆదివాసీల భాషలో బలి పొరోబ్ అని కూడా అంటారు. పండుగ నిర్వహించే ఏడాది ఆగస్టు 25న మొదలై సెప్టెంబర్ 5వ తేదీతో ముగుస్తుంది. విశేషమేంటంటే ఈ ఉత్సవాన్ని మూడేళ్లు వరుసగా నిర్వహిస్తే.. ఆ తర్వాత మూడేళ్లు పండుగ నిర్వహించరు.

మహిళలకు ఇది ప్రత్యేక పండుగ..

ఈ ఉత్సవాలు ప్రారంభం నుంచి ముగించే వరకు ఒక ప్రత్యేకత ఉంటుంది. మొదటిరోజు ఊర్లో ఒక ఇంటి వద్ద రాట నిలబెట్టి అక్కడ పూజలు చేయడం ఆనవాయితీ. రాట నిలబెట్టినప్పటి నుంచి ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ఈ పూజలను మహిళా పూజారులు నిర్వహించడం ఆనవాయితీ. వారిని మహిళాయినులు అని పిలుస్తారు. మేళతాళాలతో 12 తెగలకు చెందిన 12 మంది అక్కాచెల్లెళ్లు అంటే.. తోటి కోడళ్ళు.. అంతా కలిసి మేళ తాళాలతో బయలుదేరుతారు. ఊరికి సమీపంలో పవిత్ర గెడ్డగా భావించే గెడ్డకు వెళ్లి అక్కడ ఇసుక తీసుకుని సేకరిస్తారు. దాన్ని తీసుకొచ్చి ఒక పొలంలా ఇసుకను పరుస్తారు. ఈ క్రమంలో గ్రామానికి చెందిన తలయారి గోధుమ విత్తనాలను సేకరించి తన ఇంటి వద్ద ఉంచుతారు. ఆ విత్తనాల కోసం 12 మంది అక్క చెల్లెలు అక్కడికి వస్తారు. ఆ మహిళలకు నూతన వస్త్రాలు బహువరించి వాళ్ళ కాళ్లకు మొక్కి సేకరించిన గోధుమ విత్తనాలను అందజేస్తాడు. ఆ విత్తనాలను ఇసుకతో ఏర్పాటు చేసిన పొలంలో నాటుతారు ఆ అక్క చెల్లెళ్లు.

పూజలు చేస్తూ.. ముళ్ళ పీటలపై..

ప్రతిరోజు అక్కడ పూజలు నిర్వహిస్తారు. ఈ క్రమంలో ఆరు రోజుల్లో నాటిన విత్తనాలు మొలకెత్తిన సమయంలో గ్రామంలో ఉన్న ఒక మగ పూజారిపై భీమదేవుడు ఆవహిస్తాడని నమ్మకం. ఆ దేవుడు ఆవహించిన పూజరికి గ్రామస్తులు పొలాలు కాయలు నైవేద్యంగా సమర్పిస్తారు. ఇదే సమయంలో పదునైన ముళ్ళతో పీట చేస్తారు. దానిపై నిష్టగా ఉపవాసం చేసిన వారంతా కూర్చుంటారు. నిష్టతో ఈ కార్యక్రమం చేస్తే ఎవరికి ఎటువంటి హాని జరగదు అన్నది గిరిజనుల నమ్మకం.

పుష్పాలతో స్నేహితులుగా..

ఇలా 12 రోజులపాటు ప్రతిరోజు ఊర్లోనే ఇసుక పొలం వేసిన గుడి దగ్గరకు చేరి ఆటపాటలతో ఆనందంగా గడుపుతారు. ఇసుకలో వేసిన విత్తనాలు నుంచి మొలకెత్తిన మొక్కలు 12 రోజులోగా పూలు వస్తాయి. ఆ పూలనే బలి పుష్పాలుగా పరిగణిస్తారు ఆదివాసీలు. ఆ పుష్పలను ఎవరికైతే ఆ మహిళలు అందిస్తారో అప్పటినుంచి వారిని స్నేహితులుగా భావిస్తారు. వీటిని ఒకరి చెవిలో మరొకరు పెట్టి నాటి నుంచి స్నేహితులుగా గుర్తింపు పొందుతారు. వేర్వేరు కుటుంబాల్లోని సభ్యులను స్నేహితులగా గౌరవించడం ఈ పండుగ ప్రధాన ఉద్దేశమని అంటున్నారు మాడగడ గిరిజనులు.

ఇక చివరి రోజున పండుకో కోసం తీసుకొచ్చిన ఇసుకను తిరిగి పవిత్ర వాగులో కలుపుతారు. దీంతో ఉత్సవం ముగుస్తుంది. ఇలా సాంప్రదాయబద్ధంగా స్నేహాన్ని కోరుకునే వారు తరతరాలుగా ఈ స్నేహభావాన్ని కొనసాగించాల్సి ఉంటుంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి