Andhra Pradesh: శివరాత్రి వేళ భక్తులకు ఏపీఎస్ఆర్టీసీ శుభవార్త.. 101 శైవ క్షేత్రాలకు..
మహాశివరాత్రి పర్వదినాన భక్తులకు శుభవార్త చెప్పింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ. శివరాత్రికి 3,800 ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు ప్రకటించింది ఆర్టీసీ. శైవ క్షేత్రాల వద్ద అన్ని సౌకర్యాలతో..
మహాశివరాత్రి పర్వదినాన భక్తులకు శుభవార్త చెప్పింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ. శివరాత్రికి 3,800 ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు ప్రకటించింది ఆర్టీసీ. శైవ క్షేత్రాల వద్ద అన్ని సౌకర్యాలతో తాత్కాలిక బస్సు స్టేషన్లను ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో ఉన్న 101 శైవ క్షేత్రాలకు 25 లక్షల మంది భక్తులు వస్తారని ఆర్టీసీ అంచనా వేసింది. ఘాట్ రోడ్డులలో నైపుణ్యం కలిగిన డ్రైవర్లతో బస్సులను నడిపించనున్నారు.
భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే కోటప్పకొండకు 675 బస్సులు, శ్రీశైలంకు 650 బస్సులు, పొలతలకు 200 బస్సులు, పట్టిసీమకు 100 బస్సులు ఏర్పాటు చేయనున్నట్లు ఆర్టీసీ ప్రకటించింది. అంతేకాదు.. ప్రయాణికుల రద్దీని బట్టి అదనపు ట్రిప్పులు, బస్సులను సిద్ధం చేసింది ఆర్టీసీ. బస్సు ప్రయాణాలపై ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులతో పర్యవేక్షిస్తుంది ఆర్టీసీ యాజమాన్యం. కాగా, సాధారణ ఛార్జీలతోనే శివరాత్రి స్పెషల్ బస్సులు నడుస్తాయని ఆర్టీసీ స్పష్టం చేసింది.
ఆలయాల వద్ద ఏర్పాట్లు..
ఇదిలాఉంటే.. శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శైవ క్షేత్రాల వద్ద భారీ ఏర్పాట్లు చేస్తున్నారు దేవాదాయ శాఖ అధికారులు. శివాలయాలకు భక్తులు భారీగా పోటెత్తే అవకాశం ఉండటంతో పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఆలయాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా క్యూలైన్లు, ఇతర సదుపాయాలు ఆలయాల వద్ద కల్పించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..