AP Weather: ఏపీకి మరో టెన్షన్.. వరద ముప్పు నుంచి తేరుకోకమునుపే మరో అల్పపీడన గండం
ఏపీకి మరో ఉపద్రవం పొంచి ఉంది. కొద్ది రోజులుగా దక్షిణాంధ్రప్రదేశ్‌ను వరుస తుఫాన్‌లు చుట్టుముడుతున్నాయి. ఇప్పటికే భారీ వరదలతో రాయలసీమ జిల్లాలు కకావికలమయ్యాయి.
ఏపీకి మరో ఉపద్రవం పొంచి ఉంది. కొద్ది రోజులుగా దక్షిణాంధ్రప్రదేశ్‌ను వరుస తుఫాన్‌లు చుట్టుముడుతున్నాయి. ఇప్పటికే భారీ వరదలతో రాయలసీమ జిల్లాలు కకావికలమయ్యాయి. ముఖ్యంగా రైతాంగం తీవ్రంగా నష్టపోయింది. ప్రభుత్వ, ప్రైవేలు ఆస్తులు ధ్వసం అయ్యాయి. ఇప్పటికీ అనేక గ్రామాలు వరద ముంపులోనే మగ్గుతున్నాయి. ఈ నేపథ్యంలో బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడిందని వాతావరణ శాఖ హెచ్చరికలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. రాయలసీమ జిల్లాలు వరద ముప్పు నుంచి తేరుకోకమునుపే అల్పపీడనం రూపంలో మరో గండం వెంటాడుతోంది. ఈనెల 29నాటికి దక్షిణ అండమాన్ వద్ద బంగాళాఖాతంలో ఈ అల్పపీడనం ఏర్పడొచ్చని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. ఆ తరువాత 48 గంటల్లో ఇది మరింత బలపడి పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణించొచ్చని అంచనా వేస్తున్నారు. దీని ప్రభావంతో ఉత్తర కోస్తాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు.. ఒకటి, రెండు చోట్ల ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశముంది.
దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి వర్షాలతోపాటు ఒకటి, రెండు చోట్ల భారీ వర్షాలు కురవొచ్చని అంచనా వేస్తున్నారు అధికారులు. 28న రాష్ట్రమంతటా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని, దక్షిణ కోస్తాలో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడొచ్చని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అంచనా వేసింది. బంగాళాఖాతంలో కొమరిన్ ప్రాంతం, శ్రీలంక తీరం మీదుగా ఉపరితల ఆవర్తనం ఏర్పడి ఉందని, దీని ప్రభావంతో దక్షిణాదిలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని ఐఎండీ ప్రకటించింది. ఈ నెల 29 వరకు తమిళనాడు, పుదుచ్చేరిలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ నెల 28, 29 తేదీల్లో ఏపీ దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లోనూ, యానాంలోనూ భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వివరించింది. అనంతపురం, చిత్తూరు, కడప, నెల్లూరులో హై అలెర్ట్ ప్రకటించారు అధికారులు. ఇప్పటికే తిరుపతి చుట్టుపక్కల ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పేరూరు చెరువులోకి భారీగా వరద వచ్చి చేరుతోంది. ముందు జాగ్రత్త చర్యగా వరదను తిరుపతిలోకి రాకుండా మట్టికట్ట ఏర్పాటు చేసి.. జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పాతకాల్వ నుంచి స్వర్ణముఖిలోకి నీళ్లు మళ్లిస్తున్నారు. సహాయక చర్యల కోసం.. NDRF, SDRF టీమ్స్ రెడీగా ఉన్నాయి.
Also Read: ‘ఛత్రపతి’ సూరీడు ఇప్పుడెలా ఉన్నాడో తెలుసా..? మీరు అస్సలు గుర్తుపట్టలేరు