Raghuveera Reddy: పుడమి నుంచి ఉబికి వస్తోన్న పాతాళ గంగ.. పీసీసీ మాజీ అధ్యక్షుడి పొలంలో అద్భుత దృశ్యం..
కరవు సీమలో కురిసిన భారీ వర్షాలతో అన్నదాతల మోముల్లో ఆనందాలు వెల్లివిరుస్తున్నాయి. గతంలో గుప్పెడు నీరు కోసం వెయ్యి అడుగుల బోరు వేసినా కనిపించని పాతాళగంగమ్మ ఇప్పుడు తనంతట తానే పుడమి నుంచి ఉబికి పైకి వస్తుండడంతో
కరవు సీమలో కురిసిన భారీ వర్షాలతో అన్నదాతల మోముల్లో ఆనందాలు వెల్లివిరుస్తున్నాయి. గతంలో గుప్పెడు నీరు కోసం వెయ్యి అడుగుల బోరు వేసినా కనిపించని పాతాళగంగమ్మ ఇప్పుడు తనంతట తానే పుడమి నుంచి ఉబికి పైకి వస్తుండడంతో రైతులు సంబరపడిపోతున్నారు . ఎలాంటి మోటార్ సహాయం లేకుండానే బోర్ల నుంచి ఉబికి వస్తున్న నీటిని చూసి ఇది కలయా లేక నిజమా..అని తేల్చుకోలేకపోతున్నారు. అనంతపురంకు చెందిన పీసీసీ మాజీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి సొంత పొలంలోనూ ఇలాంటి అద్భుతం సాక్షాత్కారమైంది. అనంతపురం జిల్లా మడకశిర మండలం నీలకంఠపురంలోని రఘువీరారెడ్డి పొలంలో బోరు బావి నుంచి ఉబికివస్తోన్న నీటిని చూసి చుట్టుపక్కల రైతులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ‘గతంలో 900 అడుగుల లోతులో బోరు వేసినా.. చుక్కనీరు లభించలేదు.. కానీ నేడు అదే బోరు బావిలో ఎలాంటి మోటార్ అమర్చకుండానే నీళ్లు పైకి వస్తున్నాయి’ అంటూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.
కరవు సీమగా పేరొందిన రాయలసీమలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు భూగర్భ జలాలు బాగా మెరుగుపడ్డాయి. ఇందులో భాగంగానే రఘువీరారెడ్డి పొలంలోనూ నీరు ఉబికివచ్చింది. ఈ సందర్భంగా తన జీవితంలో ఎప్పుడూ ఇలాంటి అద్భుతం చూడలేదంటున్నారీ మాజీ మంత్రి. ప్రజా ప్రతినిధిగా ఉన్నప్పుడు మడకశిర పంచాయతీలో తాగునీటి కోసం ఎన్నో బోర్లు వేయించానని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. తాజా వర్షాలతో మరో ఐదేళ్ల పాటు భూగర్భ జలాలకు ఢోకా లేదంటూ రఘువీరా హర్షం వ్యక్తం చేస్తున్నారు. మడకశిర మండలంలోని చాలా ప్రాంతాల్లో ఇలాంటి అద్భుత సంఘటనలే కనిపిస్తున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మంత్రిగా పనిచేసిన రఘువీరా రెడ్డి రాష్ట్ర విభజన అనంతరం కూడా ఏపీ పీసీసీ అధ్యక్షుడిగా సేవలందించారు. వివాద రహితుడు, సౌమ్యుడిగా ఆయనకు పేరుంది. గత కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటోన్న ఆయన వ్యవసాయం చేస్తూ..సాధారణ జీవితం గడుపుతున్నారు.a
(లక్ష్మీకాంత్, అనంతపురం జిల్లా, టీవీ9)
Also Read: