AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rain Alert: తరుముకొస్తున్న పెను తుఫాన్.. ఇక నాన్‌స్టాప్ వర్షాలే వర్షాలు.. ఈ ప్రాంతాల్లో కుండపోత..

వాతావరణ శాఖ తుపాన్ అలర్ట్ జారీ చేసింది.. తుఫాన్ ప్రభావంతో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనావేసింది.. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటన విడుదల చేసింది. ఐఎండి సూచనల ప్రకారం.. నైరుతి బంగాళాఖాతంలోని వాయుగుండం ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ గడిచిన 6 గంటల్లో గంటకు 12 కిలోమీటర్ల వేగంతో తీవ్ర వాయుగుండంగా బలపడింది.

Rain Alert: తరుముకొస్తున్న పెను తుఫాన్.. ఇక నాన్‌స్టాప్ వర్షాలే వర్షాలు.. ఈ ప్రాంతాల్లో కుండపోత..
Rain Alert
Shaik Madar Saheb
|

Updated on: Nov 26, 2024 | 7:07 PM

Share

వాతావరణ శాఖ తుపాన్ అలర్ట్ జారీ చేసింది.. తుఫాన్ ప్రభావంతో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనావేసింది.. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటన విడుదల చేసింది. ఐఎండి సూచనల ప్రకారం.. నైరుతి బంగాళాఖాతంలోని వాయుగుండం ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ గడిచిన 6 గంటల్లో గంటకు 12 కిలోమీటర్ల వేగంతో తీవ్ర వాయుగుండంగా బలపడిందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. ఇది ప్రస్తుతానికి ట్రింకోమలీకి ఆగ్నేయంగా 280 కిమీ, నాగపట్నానికి దక్షిణ-ఆగ్నేయంగా 570 కి.మీ, పుదుచ్చేరికి దక్షిణ-ఆగ్నేయంగా 680 కి.మీ మరియు చెన్నైకి దక్షిణ-ఆగ్నేయంగా 770 కి.మీ దూరంలో కేంద్రీకృతమైందన్నారు. ఇది ఉత్తర-వాయువ్య దిశగా కొనసాగి రేపు (నవంబర్ 27న) తుపానుగా బలపడే అవకాశం ఉందని, ఆ తదుపరి 2 రోజులలో ఉత్తర-వాయువ్య దిశగా కదులుతూ శ్రీలంక తీరాన్ని దాటి తమిళనాడు తీరం వైపు వెళ్ళేందుకు అవకాశం ఉందన్నారు.

దీని ప్రభావంతో బుధవారం (27వ తేది) కోస్తాంధ్ర, రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో భారీవర్షాలు అలాగే గురు, శుక్ర, శని వారాల్లో (28-30తేదీ వరకు) కోస్తాంధ్ర, రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు, మిగిలినచోట్ల విస్తృతంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందన్నారు.

మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్ళరాదని సూచించారు. వేటకు వెళ్ళిన మత్స్యకారులు వెంటనే తిరిగి రావాలన్నారు. దక్షిణకోస్తా తీరం వెంబడి రేపు సాయంత్రం నుండి గంటకు 50-70కిమీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయన్నారు.

భారీ వర్షాల నేపధ్యంలో వరి కోతలు, ఇతర వ్యవసాయ పనుల్లో రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రైతులు పంట పొలాల్లో నిలిచే అదనపు నీటిని బయటకు పోయేలా ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. పండించిన ధాన్యాన్ని సురక్షిత ప్రదేశాలలో ఉంచాలని, ఉద్యానవన పంట మొక్కలు/చెట్లు పడిపోకుండా నిలబడేందుకు కర్రలు/బాదులతో సపోర్ట్ అందించాలని కోరారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.

రానున్న నాలుగు రోజులు వాతావరణం క్రింద విధంగా ఉండే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ వివరించారు.

నవంబర్ 27, బుధవారం : నెల్లూరు, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్నిప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

నవంబర్ 28, గురువారం: కాకినాడ, కోనసీమ, కృష్ణా, నెల్లూరు, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్నిప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, గుంటూరు, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లోని కొన్నిప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

నవంబర్ 29, శుక్రవారం : నెల్లూరు, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్నిప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లోని కొన్నిప్రాంతాల్లో మోస్తారు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, కర్నూలు, నంద్యాల మరియు అనంతపురం జిల్లాల్లోని కొన్నిప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

నవంబర్ 30,శనివారం : నెల్లూరు, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్నిప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లోని కొన్నిప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఎన్టీఆర్, కర్నూలు, నంద్యాల జిల్లాల్లోని కొన్నిప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us