టాటా, మహీంద్రాకు పోటీగా Hyundai కొత్త EV.. ఎలక్ట్రిక్ మార్కెట్‌లో సంచలనమేనా
భారత ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్లో పోటీ రోజురోజుకూ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రముఖ కార్ల తయారీ సంస్థ Hyundai Motor India తన ఎలక్ట్రిక్ వాహనాల విభాగాన్ని మరింత విస్తరించేందుకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా భారత మార్కెట్ కోసం ప్రత్యేకంగా ఓ కొత్త కాంపాక్ట్ ఎలక్ట్రిక్ SUVని అభివృద్ధి చేస్తోంది. ప్రస్తుతం HE1i అనే కోడ్‌నేమ్‌తో రూపొందుతున్న ఈ కారుకు Ioniq P అనే పేరు పెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. అక్టోబర్ 29న జరిగిన Q3 ఆర్థిక ఫలితాల సమావేశంలో కంపెనీ యాజమాన్యం ఈ పేరును ప్రస్తావించింది. అయితే Ioniq P పేరును హ్యుందాయ్ ఇంకా అధికారికంగా ఖరారు చేయలేదు.

బేయాన్ మోడల్ తర్వాత భారత మార్కెట్లో కొత్త ఎలక్ట్రిక్ SUVని పరిచయం చేయాలని కంపెనీ భావిస్తోంది. ఈ కారు 2027 జనవరిలో అధికారికంగా ఆవిష్కరణకు వచ్చే అవకాశం ఉంది. రెండు బ్యాటరీ ఆప్షన్లు, ఆధునిక ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, లెవెల్ 2 అసిస్టెడ్ డ్రైవింగ్ టెక్నాలజీ వంటి ఫీచర్లు ఇందులో ఉండనున్నట్లు సమాచారం. సరసమైన ధరలో ఎలక్ట్రిక్ SUVని అందించడం ద్వారా టాటా, మహీంద్రా వంటి సంస్థలకు గట్టి పోటీ ఇవ్వాలని హ్యుందాయ్ లక్ష్యంగా పెట్టుకుంది.
లేటెస్ట్ టెక్నాలజీ
Hyundai Ioniq P ఎలక్ట్రిక్ SUVని E-GMP (K) ప్లాట్‌ఫామ్‌పై రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే ప్లాట్‌ఫామ్‌ను అంతర్జాతీయ మార్కెట్లో అందుబాటులో ఉన్న Hyundai Inster EVలో కూడా ఉపయోగిస్తున్నారు. ఈ కొత్త కారులో స్టాండర్డ్ రేంజ్, లాంగ్ రేంజ్ అనే రెండు బ్యాటరీ ఆప్షన్లు ఉండే అవకాశం ఉంది. అయితే బ్యాటరీ సామర్థ్యం, పూర్తి ఛార్జింగ్‌పై ప్రయాణించే దూరం వంటి వివరాలను కంపెనీ ఇంకా వెల్లడించలేదు.
ప్రస్తుతం Inster EVలో 42kWh, 49kWh బ్యాటరీ ఆప్షన్లు ఉన్నాయి. ఇవి గరిష్ఠంగా 355 కిలోమీటర్ల వరకు ప్రయాణించే రేంజ్‌ను అందిస్తాయి. ఇదే తరహా బ్యాటరీ ఆప్షన్లు Ioniq Pలోనూ ఉండవచ్చని అంచనా. టెక్నాలజీ విషయానికి వస్తే ఇందులో నెక్స్ట్ జనరేషన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో పాటు Hyundai Pleos Connect సిస్టమ్‌ను అందించే అవకాశం ఉంది. అంతేకాకుండా లెవెల్ 2 అసిస్టెడ్ డ్రైవింగ్ టెక్నాలజీ ద్వారా డ్రైవింగ్ సమయంలో సౌకర్యం, భద్రతను మెరుగుపరచనున్నారు.
టాటా, మహీంద్రాతో పోటీ
Hyundai Ioniq P ఎలక్ట్రిక్ SUVని తమిళనాడులోని శ్రీపెరుంబుదూర్ తయారీ ప్లాంట్‌లో ఉత్పత్తి చేయనున్నారు. ప్రారంభ దశలో దిగుమతి చేసుకున్న బ్యాటరీ సెల్స్‌ను ఉపయోగించే అవకాశం ఉంది. భవిష్యత్తులో Exide Industriesతో భాగస్వామ్యం ద్వారా భారత్‌లో తయారైన బ్యాటరీ సెల్స్‌ను వినియోగించాలని హ్యుందాయ్ భావిస్తోంది. దీనివల్ల ఉత్పత్తి ఖర్చులు తగ్గడంతో పాటు దిగుమతులపై ఆధారపడటం కూడా తగ్గుతుంది.
భారత మార్కెట్లోకి వచ్చిన తర్వాత ఈ SUVకి Tata Nexon EV, Mahindra XUV 3XO EV, Kia Syros EV వంటి మోడళ్ల నుంచి పోటీ ఎదురుకానుంది. అయితే దీని ధర, బ్యాటరీ సామర్థ్యం, పూర్తి ఫీచర్ల వివరాలు ఇంకా వెల్లడికావాల్సి ఉంది. 2027లో ఈ కొత్త ఎలక్ట్రిక్ SUV విడుదలైతే భారత EV మార్కెట్లో హ్యుందాయ్‌కు మరింత బలమైన స్థానం లభించే అవకాశం ఉంది.
