అయ్య బాబోయ్.. గోల్డ్, వెండి కాదు.. ఒక్క నెలలోనే “ఎర్ర బంగారం” ధరలు ఢమాల్..
బంగారం, వెండి ధరలు గత 8 నెలలుగా ఢమాల్ అంటూ పడిపోతున్నాయి. వీటి మార్కెట్లలో భారీ ఎత్తుపల్లాలు కనిపిస్తున్నాయి. అయితే వీటితో పాటు మరో లోహం ధర కూడా పడిపోతుంది. పసిడికి పోటీగా ఎర్ర బంగారంగా అందరూ భావించే కాపర్ ధరలు కూడా దిగొస్తున్నాయి. వీటి వల్ల సామాన్యులకు ఊరట కలగనుందని నిపుణులు చెబుతున్నారు.

బంగారం, వెండి ధరలతో పాటు ఎర్ర బంగారంగా భావించే రాగి ధరలు కూడా కుప్పకూలుతున్నాయి. అన్ని రకాల లోహాల ధరలు క్రమక్రమంగా దిగొస్తున్నాయి. గతంలో బంగారం, వెండి ధరలు రికార్డ్ స్థాయికి చేరుకోవడంతో చాలామంది రాగివైపు చూశారు. ఇప్పుడు పసిడి ధరలు డౌన్ అవ్వుతుండటంతో కాపర్ ధరలు కూడా నేలచూపులు చూస్తున్నాయి. ప్రస్తుతం గ్లోబల్ మార్కెట్లలో రాగి ధరలు ఏకంగా 7 నెలల కనిష్ట స్థాయికి చేరుకున్నాయి. చాలా వస్తువుల తయారీలో కాపర్ అనేది వినియోగిస్తున్నారు. ఇప్పుడు వీటి ధరలు తగ్గడం సామాన్యులు కూడా కలిసొచ్చే అంశంగా మారింది. పలు గృహోపకరణాల ధరలు దిగొచ్చే ఛాన్సుంది.
మరింత పడిపోనున్న రాగి ధరలు..!
అంతర్జాతీయంగా కాపర్ ధరలు క్రాష్ అవ్వుతుండటంతో దేశీయంగానూ ఇదే బాటలో నడుస్తున్నాయి. భారత్‌లో గత నెల రోజుల్లో వీటి ధరలు ఏకంగా 15 శాతం మేర పడిపోయాయి. అంతర్జాతీయ మార్కెట్లో గత నెల రోజుల్లో 13 శాతం మేర రాగి ధరలు పడిపోయి ఏడు నెల కనిష్టానికి దిగజారాయి. భారతదేశ మల్టీ కమోడిటీ ఎక్సేంజ్‌లో కాపర్ ధరలు సుమారు 15 శాతం తగ్గగా.. గురువారం 1 శాతం తగ్గి కిలోకు రూ.1192 వద్ద ముగిశాయి. ఇక లండన్ మెటల్ ఎక్సైంజ్ విషయానికొస్తే.. మూడు నెలల రాగి ప్యూచర్స్ ఒక్కరోజులోనే 4.6 శాతం తగ్గి 12,471 డాలర్లకు చేరుకున్నాయి. అమెరికా డాలర్ బలపడుతుండటంతో ఇతర దేశాల కొనుగోలుదారులకు వస్తువులు ఖరీదుగా మారుతున్నాయి. అలాగే ప్రపంచంలో అత్యధిక రాగిని వినియోస్తున్న చైనా నుంచి కూడా డిమాండ్ తగ్గిపోయింది.
సామాన్యులకు పండుగే..
రాగిని విద్యుత్, ఎలక్ట్రానిక్ పరికరాల్లో ఎక్కువగా ఉపయోగిస్తారు. ఏసీ, ఫ్రిడ్జ్, వాషింగ్ మెషిన్, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాల్లో దీనిని బాగా వినియోగిస్తారు. రాగి ధరలు పడిపోవడంతో ఇప్పుడు గృహోపకరణాల ధరలు తగ్గే అవకాశముంది. ఏసీ, ఫ్రిడ్జ్, వాషింగ్ మెషీన్, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలన్నీ తగ్గే ఛాన్సులు కనిపిస్తున్నాయి. రాగి ధరలు ఇలా పతనం దిశగా వెళ్తే ఈ వస్తువులన్నీ సామాన్యులకు చౌకగా లభించనున్నాయని చెప్పవచ్చు. ఏసీలోని కంపెసర్, మోటార్, వైరింగ్, కాయిల్‌లో కాపర్ విరివిగా ఉపయోగిస్తారు. అలాగే ఫ్రిడ్జ్ కంప్రెసర్, మోటార్, ఎలక్ట్రికల్ సర్క్యూట్లలో, వాషింగ్ మెషిన్ మోటార్, వైరింగ్‌లో వినియోగిస్తారు. రాగి ధరలు తగ్గడంతో వాటి తయారీకి అయ్యే ఖర్చు కూడా పడిపోతుంది. ఈ కారణంతో వాటి ధరలను కంపెనీలు తగ్గించే అవకాశం లేకపోలేదని నిపుణులు చెబుతున్నారు. 2026లో ఏసీ, ఫ్రిడ్జ్ ధరలు భారీగా పెరిగాయి. ఏసీ, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులకు కొత్త స్టార్ రేటింగ్ నిబంధనల కారణంగా ధరలు ఈ ఏడాదిలో మూడుసార్లు పెరిగాయి. ఎల్జీ కంపెనీ ఏసీ ధరలను జనవరిలో 7 నుంచి 9 శాతం మేర పెంచగా.. అక్టోబర్‌లో 5 నుంచి 7 శాతం మేర పంచింది. డైకిన్, బ్లూస్టార్, వోల్టాస్ కంపెనీలు కూడా ఏసీ ధరలు పెంచేశాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), డేటా సెంటర్లు, ఎలక్ట్రానిక్ రంగంలో పెట్టుబడులపై అనిశ్చితి నెలకొంది. ఒకవేళ వీటిల్లో పెట్టుబడులు పెరిగితే రాగి ధరలు పెరగవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.
