Andhra Pradesh: ఏపీ రాజకీయాలపై బీజేపీ నేత జీవీఎల్ హాట్ కామెంట్స్.. ఆ పార్టీలపై ప్రజల్లో సానుకూలత లేదన్న ఎంపీ
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై బీజేపీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో పార్టీని బలోపేతం చేయడంపై దృష్టిసారించామన్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్ తోనే..

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై బీజేపీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహరావు (GVL Narasimha Rao) సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో పార్టీని బలోపేతం చేయడంపై దృష్టిసారించామన్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్ తోనే అభివృద్ధి సాధ్యమని.. ఇదే నినాదంతో ప్రజల్లోకి వెళ్లామని చెప్పారు. రాష్ట్రంలో వైసీపీకి ప్రత్యామ్నాయం బీజేపీ (BJP) మాత్రమేనని తెలిపారు. విశాఖపట్టనంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జనసేన పార్టీతో ఇప్పటికే తమ పొత్తు కొనసాగుతోందన్నారు. క్షేత్ర స్థాయిలో పార్టీ బలాన్ని పెంచుకోవడానికి ఇరు పార్టీలు కృషిచేస్తున్నాయన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, వచ్చే ఎన్నికల్లో తప్పకుండా ఏపీ ప్రజలు మార్పుకోరుకుంటారని అన్నారు. ఆమార్పు బీజేపీ, జనసేన కూటమి అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీపై రాష్ట్ర ప్రజల్లో సానుకూలత లేదన్నారు. ఇప్పటివరకు టిడిపితో పొత్తుపై ఎటువంటి సంప్రదింపులు జరగలేదని, నిర్ణయం కూడా తీసుకోలేదన్నారు. కొంతమంది అలాంటి ప్రచారం చేస్తే అవి పూర్తిగా అవాస్తవమన్నారు. కుటుంబ పార్టీలకు ప్రజల్లో ఆదరణ తగ్గుతుందని, కేవలం సంక్షేమ, అభివృద్ధి ప్రభుత్వాన్నే ప్రజలు కోరుకుంటారన్నారు. కేంద్రంలో, రాష్ట్రంలో ఒకే ప్రభుత్వం ఉంటే అభివృద్ధి వేగంగా జరుగుతుందని, ఇదే అంశాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్తామని జీవీఎల్ నరసింహరావు తెలిపారు.
తక్కువ ఓట్లు ఉన్న అనేక రాష్ట్రాల్లో బీజేపీ వేగంగా పుంజుకుని అధికారంలోకి వచ్చిన ఉదాహరణలు ఉన్నాయని జీవీఎల్ నరసింహరావు గుర్తుచేశారు. అదే విధంగా అనూహ్యంగా తక్కువ టైంలోనే రాష్ట్రంలో బీజేపీ బలాన్ని పెంచుకుంటుందన్నారు. ప్రభుత్వ వ్యతిరేకత ఓట్లను చీలనీయకుండా బీజేపీ, జనసేన కూటమికి పడేలా తాము పూర్తి కార్యాచరణతో ముందుకెళ్తామన్నారు. అసలు ఎమ్మెల్యే సీట్లు లేని పశ్చిమబెంగాల్లో రెండో స్థానానికి చేరుకుని, బలపడ్డామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని స్పష్టం చేశారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్(ANDHRA PRADESH) లో టీడీపీకి సానుకూల వాతావరణం ఉందని , రాబోయే ఎన్నికల్లో విజయావకాశాలు ఎక్కువుగా ఉన్నాయని ఇటీవల కొన్ని సర్వేలు వెల్లడించిన విషయం తెలిసిందే. ఈక్రమంలో టీడీపీపై ప్రజల్లో ఎటువంటి సానుకూతల లేదని జీవీఎల్ నరసింహరావు వ్యాఖ్యనించడం గమనర్హం.




మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం చూడండి..