Polavaram: అప్పటి వరకు పనులు జరగవు.. అధ్యయనం తర్వాతే ఏదైనా.. పోలవరంపై మంత్రి అంబటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్
పోలవరం (Polavaram) ప్రాజెక్టు విషయంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. డయాఫ్రం వాల్ ఎంతవరకు దెబ్బ తిన్నదనే విషయంపై అధ్యయనం ఎప్పటికి పూర్తవుతుందో...
పోలవరం (Polavaram) ప్రాజెక్టు విషయంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. డయాఫ్రం వాల్ ఎంతవరకు దెబ్బ తిన్నదనే విషయంపై అధ్యయనం ఎప్పటికి పూర్తవుతుందో తెలియదన్నారుర. ఆ నివేదిక వచ్చే వరకు ఎర్త్ కమ్ రాక్‌ఫిల్ డ్యామ్ పనులు జరగే అవకాశం లేదని తేల్చి చెప్పారు. డయాఫ్రం వాల్ దెబ్బతిందని తాము భావిస్తున్నామని, ఈ విషయంపై నేషనల్ హైడ్రో పవర్ కార్పొరేషన్ ద్వారా అధ్యయనం జరుగుతోందని పేర్కొన్నారు. అధ్యయనం తర్వాతే పూర్తి వివరాలు తెలుస్తాయని వివరించారు. దెబ్బతిందని తేలితే రిపేర్ చేయాలా? కొత్త డయాఫ్రం వాల్ కట్టాలా? అనే దానిపై నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. ఆ క్లారిటీ వచ్చే వరకు పోలవరంలో ఎర్త్ కమ్ రాక్‌ఫిల్ డ్యామ్ (Rock Fill Dam) పనులు జరిగవని స్పష్టం చేశారు. అంతే కాకుండా కాఫర్ డ్యాం కంటే డయాఫ్రం వాల్ కట్టడం ముమ్మాటికీ తప్పేనని, అవసరమైతే పీపీఏ, కేంద్రాన్ని, సీడబ్ల్యూసీని అడుగుతామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా దెబ్బతిన్న ప్రాజెక్టు గేట్లపై అధ్యయనం చేస్తున్నామని, గుండ్లకమ్మ ప్రాజెక్టు గేటు ఏర్పాటుకు టెండర్లు పిలిచినట్లు మంత్రి వివరించారు. కానీ ఈ లోపే గేటు కొట్టుకుపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
గుండ్లకమ్మ గేట్ దెబ్బ తినడంతో జలాశయంలోని నీళ్లు బయటకు పోయాయి. దాదాపు రెండు టీఎంసీల నీటిని విడుదల చేస్తే గానీ స్పాట్ లాక్‌లు ఏర్పాటు చేయలేం. ఐదారేళ్లుగా తుప్పు పట్టి ఈ రోజు ఇలా ధ్వంసమయ్యాయి. గత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే ఈ దుస్థితి తలెత్తింది. గుండ్లకమ్మ ప్రాజెక్ట్ కోసం గత ప్రభుత్వం రూ.5 కోట్లు ఖర్చు చేసింది. ఆ డబ్బును గెస్ట్ హౌస్ కోసం మాత్రమే ఖర్చు చేశారు. మరమ్మతుల కోసం ఖర్చు చేయలేదు. మరమ్మతులు పూర్తయ్యాక సాగర్ నుంచి నీటిని మళ్లించి గుండ్లకమ్మ జలాశయాన్ని నింపుతాం. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
– అంబటి రాంబాబు, ఆంధ్రప్రదేశ్ మంత్రి
కాగా.. ప్రకాశం జిల్లాలో ఉన్న గుండ్లకమ్మ ప్రాజెక్టుకు గతంలో ప్రవాహం పెరగడంతో మూడో గేటు కొట్టుకుపోయింది . రెండు రోజుల నుంచి ఈ గేటు మరమ్మతుకు గురికావడంతో దిగువకు నీరు వృథాగా పోతోంది. గేటు మరమ్మతులకు అధికారులు చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో ఈ దుస్థితి తలెత్తింది. స్టాప్ లాక్ ద్వారా నీటిని ఆపేందుకు ఇంజనీర్లు చేసిన ప్రయత్నం విఫలమైంది. దీంతో 13, 14, 15 గేట్లు ఎత్తి ప్రాజెక్టులో నీటి ఒత్తిడిని అధికారులు తగ్గించారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి..