AP Politics: ఉత్తరాంధ్ర కేంద్రంగా వేడెక్కిన ఏపీ రాజకీయం.. భవిష్యత్ కార్యాచరణపై ప్రధాన పార్టీల దృష్టి
ఏపీలో విశాఖ వేదికగా రాజీయ వేడి మొదలైంది. అన్ని పనులు ఉత్తరాంధ్ర కేంద్రంగానే కొనసాగిస్తున్నాయి ప్రధాన రాజకీయ పార్టీలు. పోటాపోటీగా కార్యక్రమాలు నిర్వహించి ఉత్తరాంధ్ర వాసులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి ప్రధాన రాజకీయ పార్టీలు. టీడీపీ చేపట్టిన యువగళం పాదయాత్ర ముగింపు గ్రాండ్‌గా ఉండేలా తెలుగు తమ్ముళ్లు ప్లాన్ చేస్తుంటే.. దానికి కౌంటర్ పాలిటిక్స్ మొదలుపెట్టింది అధికార పార్టీ.
ఏపీలో విశాఖ వేదికగా రాజీయ వేడి మొదలైంది. అన్ని పనులు ఉత్తరాంధ్ర కేంద్రంగానే కొనసాగిస్తున్నాయి ప్రధాన రాజకీయ పార్టీలు. పోటాపోటీగా కార్యక్రమాలు నిర్వహించి ఉత్తరాంధ్ర వాసులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి ప్రధాన రాజకీయ పార్టీలు. టీడీపీ చేపట్టిన యువగళం పాదయాత్ర ముగింపు గ్రాండ్‌గా ఉండేలా తెలుగు తమ్ముళ్లు ప్లాన్ చేస్తుంటే.. దానికి కౌంటర్ పాలిటిక్స్ మొదలుపెట్టింది అధికార పార్టీ. ఎన్నికలకు సమయం దగ్గరపడే కొద్దీ ఉత్తరాంధ్ర వేదికగా జరుగుతున్న రాజకీయం రోజురోజుకీ ఆసక్తికరంగా మారుతోంది. పరిపాలనా రాజధానిని వైసీపీ ప్రభుత్వం ప్రతిపాదించిన దగ్గర నుంచి విశాఖ సెంట్రిక్‌గా ఏపీలో రాజకీయాలు ఊపందుకున్నాయి. సీఎం కార్యాలయం తరలింపు ఆలస్యం అవుతున్నప్పటికీ విశాఖే కాబోయే తరాలకి రాబోయే రాజధాని అంటూ అధికార పార్టీ చేస్తున్న ప్రచారం నేపథ్యంలో రాజకీయంగా విశాఖకి ప్రాధాన్యత పెరిగింది. లేటెస్ట్‌గా అన్ని రాజకీయ పార్టీలు ఉత్తరాంధ్రలో మొహరించాయి.
టీడీపీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యువగళం పాదయాత్ర ముగింపు దశకు చేరుకుంది. ఆ ముగింపు సభను విశాఖ, విజయనగరం జిల్లా సరిహద్దులో నిర్వహించాలని ప్లాన్ చేస్తోంది. ఈ నెల 20న ఆ ముగింపు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని ఏర్పాట్లు ప్రారంభించింది సైకిల్ పార్టీ. ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసి మరీ జనాల్ని తరలించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ కార్యక్రమానికి టీడీపీ, జనసేన అధినేతలైన చంద్రబాబు, పవన్ కల్యాణ్‌తో పాటు పలువురు కీలక నేతలను రప్పించే ప్రయత్నాల్లో ఉంది టీడీపీ. దీంతో ఉత్తరాంధ్రతో పాటు విశాఖలో రాజకీయ హడావిడి మొదలైంది.
ప్రజల్లోకి ఇలా వెళ్లనున్న వైసీపీ
20వ తేదీన భారీ కార్యక్రమానికి టీడీపీ, జనసేన ప్లాన్ చేస్తుంటే.. అంతకన్నా ముందే జనాల్లోకి వెళ్లే ప్రయత్నం చేస్తోంది వైసీపీ. తమ హయాంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు చూపించే ప్రయత్నం చేస్తోంది వైవీ సుబ్బారెడ్డి నేతృత్వంలోని వైసీపీ బృందం. దీనికోసం ఒక మూడు రోజుల పాటు షెడ్యూల్‌ని కూడా రూపొందించుకున్నారు. అందులో భాగంగా ఇవాళ భోగాపురం విమానాశ్రయాన్ని వైసీపీ కమిటీ సందర్శించబోతోంది. ఇప్పటికే భోగాపురం ఎయిర్‌పోర్ట్ నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. దీనివల్ల ఏపీ రూపు రేఖలు మారిపోనున్నాయన్నది వైసీపీ చెప్తున్న మాట. ఈ ఎయిర్‌పోర్ట్ పూర్తైతే అభివృద్ధిలో ఉత్తరాంధ్ర దూసుకుపోతుందనే ప్రచారం చేస్తోంది వైసీపీ.
అలాగే రెండో రోజు విజయనగరం జిల్లాలో నిర్మిస్తున్న మెడికల్ కళాశాల భవనాల నిర్మాణాలను పరిశీలించి మారుమూల జిల్లా కేంద్రాలకు కూడా మెడికల్ కాలేజ్‌ని తీసుకొచ్చే ఘనత జగన్‌దే అని చెప్పే ప్రయత్నం చేయబోతున్నారు. ఇక సోమవారం శ్రీకాకుళం జిల్లాలోని మూలపాడు పోర్ట్ నిర్మాణ పనులను పరిశీలించనున్నారు. ఆ పోర్ట్ ప్రారంభమైతే జరిగే లాభాలు ఆ ప్రాంత రూపురేఖలు ఎలా మారబోతున్నాయంటూ చెప్పే ప్రయత్నాన్ని అధికార పార్టీ చేయబోతోంది.
ఇటీవలే ఉద్దానంలో స్వజల ధార పేరుతో ప్రారంభమైన తాగునీటి పథకం, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, రీసెర్చ్ సెంటర్‌ను ప్రభుత్వం ప్రారంభించింది. వాటి ద్వారా ఈ ప్రాంత ప్రజల ఇబ్బందులకి శాశ్వత పరిష్కారం చూపించామని చెప్తోంది వైసీపీ. అలాగే ఉత్తరాంధ్రతో పాటు విశాఖ అభివృద్ధి కోసం ఇప్పుటి వరకు చేసిన పనులు, చేయబోయే ప్రణాళికల్ని వివరించబోతున్నారు వైసీపీ నేతలు.
తాజాగా విశాఖ లైట్ మెట్రో నిర్మాణానికి కేబినెట్ ఆమోదించింది. అనకాపల్లి నుంచి భోగాపురం వరకు 76.5 కిలోమీటర్ల మేర వివిధ దశల్లో మెట్రో నిర్మాణాన్ని పూర్తి చేసే విధంగా తయారు చేసిన డీపీఆర్‌కి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనిని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లి ఉత్తరాంధ్రలో ప్రతి రచ్చబండ దగ్గర వైసీపీ గురించే చర్చించుకునేలా చేయాలని వైసీపీ ప్లాన్ చేస్తోంది. ఇలా అన్ని రాజకీయాలు ఇప్పుడు ఉత్తరాంధ్ర మీదే ఫోకస్ పెట్టాయి. రాబోయే ఎన్నికల్లో ఇక్కడి ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ఇప్పటి నుంచే ఎవరి ప్రయత్నాల్లో వాళ్లు ఉన్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..