AP Politics: ఏపీలో ముంచుకొస్తున్న ఎన్నికలు.. జనం నాడి తెలియక కన్ఫ్యూజన్‌లో పార్టీలు..!
ప్రజలు తమ వైపే ఉన్నారని అధికార, విపక్షాలు ఎవరి వాదన వారు చెప్తుంటే అసలు ప్రజలు ఎవరికి పట్టం కడతారనే దానిపై ఇంకా పూర్తి స్పష్టత రావడం లేదు. ఎవరి సర్వేలు వారు చేయించుకుంటున్నారు. ప్రయివేట్ సంస్థల ద్వారా,పార్టీలోని వ్యక్తుల ద్వారా కూడా అన్ని పార్టీలు క్షేత్ర స్థాయి పరిస్థితులపై నివేదికలు తెప్పించుకుంటున్నాయి.
ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికలకు ఇంకా ఐదు నెలలు సమయం ఉండగానే రాజకీయ వేడి ఊపందుకుంది. అన్ని పార్టీలు ఎవరికి వారు ఎన్నికలకు సమాయత్తమవుతున్నారు. ఆయా పార్టీల అధ్యక్షులు కీలక నిర్నయాలు తీసుకుంటూ నాయకులకు, కేడర్ కు దిశా నిర్ధేశం చేస్తున్నారు. సెప్టెంబర్ 9 వ తేదీన అరెస్టు అయ్యే నాటి వరకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు పలు కార్యక్రమాలతో జనం బాట పట్టారు. ఇక ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా యువగళం పేరుతో ప్రజల్లోనే ఉండేవారు. మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా వారాహి విజయయాత్రలతో గత జూన్ నుంచి ప్రజల్లోకి వెళ్తున్నారు. అటు అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తమ నేతలను ఏడాదిన్నర ముందు నుంచే ప్రజల్లో ఉండేలా కార్యక్రమాలు రూపొందించుకుని ముందుకు వెళ్తోంది. ఎన్నికలు ఏ సమయంలో జరిగినా తాము సిద్దమే అంటూ అన్ని పార్టీలు ఎన్నికల సమరోత్సాహాన్ని ప్రదర్శించాయి.
ప్రజలు తమ వైపే ఉన్నారని అధికార, విపక్షాలు ఎవరి వాదన వారు చెప్తుంటే అసలు ప్రజలు ఎవరికి పట్టం కడతారనే దానిపై ఇంకా పూర్తి స్పష్టత రావడం లేదు. ఎవరి సర్వేలు వారు చేయించుకుంటున్నారు. ప్రయివేట్ సంస్థల ద్వారా,పార్టీలోని వ్యక్తుల ద్వారా కూడా అన్ని పార్టీలు క్షేత్ర స్థాయి పరిస్థితులపై నివేదికలు తెప్పించుకుంటున్నాయి. ఇక అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా కూడా అన్ని పార్టీలు అభ్యర్ధుల గురించి అభిప్రాయాలు ఇప్పటికే సేకరించాయి. ఇలా ఎన్నికలకు పూర్తి సన్నద్దమవుతూ గెలుపుపై లెక్కలు వేసుకుంటున్నారు. ఆయా పార్టీల సభలకు జనం భారీగా తరలివస్తుండటంతో ఎవరికి వారే తమ గెలుపు ఖాయమంటూ ధీమా వ్యక్తంచేస్తున్నారు. దీంతో ఇప్పుడు సభలకు జనాలు భారీగా వస్తే గెలిచేసినట్లేనా? అన్న చర్చ రాజకీయ వర్గాల్లో మొదలయ్యింది.
ఏపీలో రాజకీయ సభలకు వెల్లువెత్తుతున్న జనం
రాష్ట్రంలో ఆ పార్టీ ఈ పార్టీ అని తేడా లేకుండా అన్ని పార్టీల సభలకు జనం భారీగా తరలివస్తున్నారు. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో పాటు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీల సభలకూ అనూహ్య స్పందన వస్తుంది. జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ వారాహి విజయయాత్రలకు భారీ స్థాయిలో జనం వస్తున్నారు. పార్టీ కార్యకర్తలతో పాటు సాధారణ జనం కూడా స్వచ్చందంగా తరలి వస్తున్నారంటూ జనసేన నాయకులు చెప్పుకొస్తున్నారు. పవన్ కళ్యాణ్ పట్ల, జనసేన పట్ల ప్రజల్లో ఆదరణ బాగా పెరిగిందనడానికి ఇది సంకేతమని ధీమా వ్యక్తంచేస్తున్నారు. దీంతో అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా తమ విజయావకాశాలను లెక్కలు వేసుకుంటున్నారు. ఇక తెలుగుదేశం పార్టీ కూడా చంద్రబాబు అరెస్ట్ కు ముందు, చంద్రబాబు విడుదల సమయంలో వచ్చిన జన స్పందనతో కొత్త అంచనాలు వేసుకుంటుంది. చంద్రబాబు అరెస్ట్ కు ముందు జరిగిన రోడ్ షోలు,బహిరంగ సభలకు భారీగా జనం తరలివచ్చేవారు…ప్రజల్లో ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకతతోనే జనం భారీగా తరలివస్తున్నారని…ఇది టీడీపీ విజయానికి సంకేతం అంటూ చెప్పుకొచ్చారు. మరోవైపు చంద్రబాబు రాజమండ్రి జైలు నుంచి విడుదలై విజయవాడకు తిరిగి వచ్చే సమయంలో జాతీయరహదారిలో చాలాచోట్ల అర్ధరాత్రి సమయంలో కూడా ప్రజలు వేచిఉండటాన్ని మరింత అనుకూలంగా మలుచుకుంది తెలుగుదేశం పార్టీ. చంద్రబాబు నాయుడి అరెస్టుతో ప్రజల్లో సానుభూతి బాగా పెరిగిందని, దీని ప్రభావం వచ్చే ఎన్నికల్లో స్పష్టంగా కనిపిస్తుందని ఆ పార్టీ నేతలు లెక్కలు వేసుకుంటున్నారు. ఇక వైఎస్సార్ సీపీ కూడా ఇదే ఫార్ములాను తనకూ వర్తించుకుని.. విజయంపై ధీమా వ్యక్తంచేస్తోంది. సామాజిక సాధికార బస్సు యాత్రలతో ఒక్కో నియోజకవర్గంలో జరుగుతున్న బహిరంగ సభలకు జనం పోటెత్తుతున్నారని, కేవలం బీసీ,ఎస్సీ,ఎస్టీ,మైనారిటీలే పాల్గొంటున్నప్పటికీ ఇంత పెద్ద ఎత్తున జనం తరలిరావడం వైసీపీ మరోసారి అధికారంలోకి వస్తుందనటానికి సంకేతాలని ఆ పార్టీ నేతలు చెప్పుకొంటున్నారు. ఇలా మూడు ప్రధాన పార్టీలు ఎలాంటి కార్యక్రమం నిర్వహించినా పెద్ద ఎత్తున జనం వస్తుండటంతో అసలు ఏం జరుగుతుందో అర్ధం కాని పరిస్థితి వస్తుంది. మొత్తానికి రాజకీయ పార్టీలను జనం పూర్తిగా కన్ఫ్యూజన్‌లోకి నెట్టేస్తున్నారు.
జనాన్ని చూసి కొత్త లెక్కలు వేసుకుంటున్న పార్టీలు
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన…ఇలా ఏ పార్టీ అయినా సభలు,సమావేశాలు నిర్వహించుకునేటప్పుడు భారీగా కేడర్ తో పాటు జనం కూడా హాజరయ్యేలా చూసుకుంటుంది. జనం హాజరును బట్టి అక్కడ స్థానికంగా ఉన్న బలాబలాలను బేరీజు వేసుకుంటాయి పార్టీలు. ఓ రకంగా సభలకు వచ్చే జనం సంఖ్య.. ఆ పార్టీ లీడర్స్, క్యాడర్స్‌లో నైతిక బలాన్ని పెంచుతుంది. అందుకే ఏ బహిరంగ సభ జరిగినా జనసమీకరణకు రాజకీయ పార్టీలు కూడా అధిక ప్రాధాన్యత ఇస్తాయి. ఇలా జనసమీకరణలో కొంతమంది స్వచ్చందంగా వస్తే మరికొంతమందిని ఏదోవిధంగా తరలించేందుకు స్థానిక నేతలు చర్యలు తీసుకుంటారు. అయితే నిజంగా ఆయా పార్టీల మీద అభిమానం ఉన్న జనాలు మాత్రం ఇతర పార్టీల కార్యక్రమాలకు దూరంగా ఉంటారు. కానీ ప్రస్తుతం రాష్ట్రంలో అన్ని పార్టీల సభలకు, ఇతర కార్యక్రమాలకు పెద్ద ఎత్తున జనం వస్తుండటంతో.. జనం నాడి పట్టుకోలేక పార్టీలు కన్ఫ్యూజ్ అవుతున్నాయట. క్షేత్రస్థాయిలో ఏ పార్టీకి ఎంత బలం ఉందో తెలుసుకోలేని పరిస్థితి కూడా వస్తుందట. దీంతో ఒకటికి రెండుసార్లు స్థానిక పరిస్థితులు, బలాబలాలపై నివేదికలు తెచ్చుకునే పనిలో పడ్డాయట పార్టీలు. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే ఎన్నికల్లో ఓటరు నాడి ఎటువైపు ఉంటుందనేది కూడా ఊహించలేని పరిస్థితి ఏర్పడింది.
మరిన్ని ఏపీ వార్తలు చదవండి..