AP Politics: వచ్చే ఎన్నికల్లో సత్తెనపల్లి వైసీపీ టిక్కెట్ మంత్రి అంబటికి కాదా..? రాజకీయ కాకరేపుతున్న కన్నా కామెంట్స్..
సత్తెనపల్లి నుండి వైసిపి అభ్యర్థిగా గెలిచి ప్రస్తుతం మంత్రిగా ఉన్న అంబటి రాంబాబుని ఢీ కొట్టేందుకు కన్నా లక్ష్మీనారాయణ సిద్ధమయ్యారు. అయితే కన్నాకు ఇంఛార్జి పదవి ఇవ్వడంపై కోడెల శివరాం అసంతృప్తి వ్యక్తం చేశారు. మరోవైపు అంబటి కూడా తనను ఓడించడానికి వస్తాదులు వస్తున్నారంటే ఆసక్తికర కామెంట్స్ చేశారు. కన్నా లక్ష్మీనారాయణ సత్తెనపల్లి నుంచి బరిలో నిలవనున్నారని పరోక్షంగా ఆయనపై అంబటి ఈ వ్యాఖ్యలు చేశారు.
Sattenapalli Politics: సత్తెనపల్లి నియోజకవర్గ రాజకీయాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే హాట్ టాపిక్‌గా మారాయి. సుదీర్ఘ కాలం కాంగ్రెస్ లో ఉండి రాష్ట్ర విభజన తర్వాత బిజెపిలో చేరి రాష్ట్ర అధ్యక్ష పదవిని సైతం చేపట్టిన కన్నా లక్ష్మీనారాయణ.. అనూహ్యంగా ఇటీవల తెలుగుదేశం పార్టీలో చేరారు. టిడిపిలో చేరడమే కాకుండా గతంలో తాను నాలుగు సార్లు పోటీ చేసి గెలిచిన పెదకూరపాడు, ఒకసారి గెలిచిన గుంటూరు వెస్ట్ నియోజకవర్గాలను కాదనుకుని సత్తెనపల్లిని ఎంచుకున్నారు. వచ్చే ఎన్నికల్లో టిడిపి అభ్యర్థిగా సత్తెనపల్లి నుండి బరిలోకి దిగేందుకు సన్నద్ధమవుతున్నారు.
సత్తెనపల్లి నుండి వైసిపి అభ్యర్థిగా గెలిచి ప్రస్తుతం మంత్రిగా ఉన్న అంబటి రాంబాబుని ఢీ కొట్టేందుకు కన్నా లక్ష్మీనారాయణ సిద్ధమయ్యారు. అయితే కన్నాకు ఇంఛార్జి పదవి ఇవ్వడంపై కోడెల శివరాం అసంతృప్తి వ్యక్తం చేశారు. మరోవైపు అంబటి కూడా తనను ఓడించడానికి వస్తాదులు వస్తున్నారంటే ఆసక్తికర కామెంట్స్ చేశారు. కన్నా లక్ష్మీనారాయణ సత్తెనపల్లి నుంచి బరిలో నిలవనున్నారని పరోక్షంగా ఆయనపై అంబటి ఈ వ్యాఖ్యలు చేశారు.
మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యలపై మాజీ మంత్రి కన్నా ధీటుగానే స్పందించారు. సత్తెనపల్లిలో మొదటిసారి కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం కన్నా ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో అంబటిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ముందు అంబటి వచ్చే ఎన్నికల్లో సత్తెనపల్లి టికెట్ తెచ్చుకో అంటూ సవాల్ విసిరారు. వచ్చే ఎన్నికల్లో సత్తెనపల్లి టికెట్ వస్తుందని గుండె మీద చేయి వేసుకొని చెప్పగలవా? అంబటి అని ప్రశ్నించారు. మంత్రిగా నీకే టికెట్ తెచ్చుకోలేని గతిలో ఉన్నావని ఎద్దేవా చేశారు. నీకు చంద్రబాబును విమర్శించే అర్హత లేదన్నారు.
కన్నా చేసిన ఈ వ్యాఖ్యలు సత్తెనపల్లి నియోజకవర్గంలో కలకలం రేపుతున్నాయి. గతంలో వచ్చే ఎన్నికల్లో అంబటి పోటీ చేయరన్న ప్రచారం జరిగింది. మరోవైపు వైసిపిలోని కొంతమంది నాయకులు స్థానిక నాయకత్వ సమస్యను తెరపైకి తెచ్చారు. వచ్చే ఎన్నికల్లో స్థానికులకే టికెట్ ఇవ్వాలని వైసిపి నేత చిట్టా విజయభాస్కరరెడ్డి డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపధ్యంలోనే కన్నా వ్యాఖ్యలు అలజడి సృష్టించాయి. స్థానికేతర అంశం తెరమీదకు రావడం అంబటికి కాస్త ఇబ్బందికరంగా మారింది. అయితే వచ్చే ఎన్నికల్లో నాదే టికెట్ అని అంబటి ధీమా వ్యక్తంచేస్తున్నారు. తనకు జన్మనిచ్చింది రేపల్లే అయినా చచ్చిపోయేది మాత్రం సత్తెనపల్లి గడ్డపైనే అంటూ అంబటి అంటున్నారు. దీంతో వచ్చే ఎన్నికలు రసవత్తరంగా ఉంటాయని స్థానికులు అంటున్నారు.
ప్రజావ్యతిరేకత దృష్ట్యా వచ్చే ఎన్నికల్లో అంబటికి సత్తెనపల్లి టిక్కెట్ దక్కకపోవచ్చని గత కొంతకాలంగా రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో కన్నా లక్ష్మీ నారాయణ చేసిన కామెంట్స్ రాజకీయ కాకరేపుతున్నాయి. మరి అంబటికి టిక్కెట్ విషయంలో వైసీపీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే.
రిపోర్టర్: టి నాగరాజు, టివి9 తెలుగు, గుంటూరు
మరిన్ని ఏపీ వార్తలు చదవండి..