AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Adimulapu Suresh: నియోజకవర్గం మారిన ఆయనకు.. అదే సెంటిమెంట్ కలిసి వస్తుందా..?

పోటీ చేసిన ప్రతిసారీ ఆయన నియోజకవర్గం మారుస్తారట.. అలా మార్చిన ప్రతిసారీ విజయం సాధిస్తారట.. ఈసారి కూడా నియోజకవర్గం మార్చిన ఆయనకు ఇప్పుడు కూడా అదే సెంటిమెంట్ కలిసి వస్తుందా..? లేక స్థానిక పరిస్థితులు బ్రేక్ వేస్తాయా..? ప్రస్తుతం ఆయన పోటీ చేస్తున్న స్థానంలో పార్టీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీ అభ్యర్దులు గెలిచిందే లేదు.

Adimulapu Suresh: నియోజకవర్గం మారిన ఆయనకు.. అదే సెంటిమెంట్ కలిసి వస్తుందా..?
Adimulapu Suresh
Fairoz Baig
| Edited By: |

Updated on: Apr 08, 2024 | 8:57 PM

Share

పోటీ చేసిన ప్రతిసారీ ఆయన నియోజకవర్గం మారుస్తారట.. అలా మార్చిన ప్రతిసారీ విజయం సాధిస్తారట.. ఈసారి కూడా నియోజకవర్గం మార్చిన ఆయనకు ఇప్పుడు కూడా అదే సెంటిమెంట్ కలిసి వస్తుందా..? లేక స్థానిక పరిస్థితులు బ్రేక్ వేస్తాయా..? ప్రస్తుతం ఆయన పోటీ చేస్తున్న స్థానంలో పార్టీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీ అభ్యర్దులు గెలిచిందే లేదు. మరీ ఈయన అక్కడ చరిత్ర తిరగరాస్తారా..? తడబడతారా..? అన్నదీ ఏపీ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. ఇంతకీ ఎవరా నేత..?

ప్రకాశంజిల్లా యర్రగొండపాలెం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ మున్సిపల్‌ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ ఎన్నికల్లో పోటీ చేసిన ప్రతిసారి తాను పోటీ చేసే స్థానాన్ని మారుస్తూ వస్తున్నారు. అలా స్థానాన్ని మార్చి మార్చి పోటీ చేసిన ప్రతిసారి విజయం సాధించారు. ఈసారి కూడా రానున్న ఎన్నికల్లో తన సిట్టింగ్‌ స్థానాన్ని కాదని మరో స్థానం నుంచి ఆదిమూలపు సురేష్‌ పోటీ చేస్తున్నారు. తొలిసారి 2009లో యర్రగొండపాలెం నుంచి పోటీ చేసి కాంగ్రెస్‌ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనంతరం స్థానం మార్చి 2014లో సంతనూతలపాడు నుంచి వైసీపీ టికెట్‌పై పోటీ చేసి గెలుపొందారు. 2019లో కూడా ఇదే వరస.. సంతనూతలపాడు సిట్టింగ్ స్థానం వదిలి తిరిగి యర్రగొండపాలెంనుంచి వైసీపీ టికెట్‌పై పోటీ చేసి గెలుపొందారు.

ఇక 2024 ఎన్నికల్లో కూడా ఇదే ఫార్ములాను అనుసరిస్తున్నారు సురేష్. ఈసారి కూడా తన సిట్టింగ్‌ స్థానమైన యర్రగొండపాలెం నుంచి కాకుండా కొండపి నియోజకవర్గానికి బదిలీపై వచ్చి పోటీ చేస్తు్న్నారు. ఇక్కడ నుంచి వైసీపీ టికెట్‌పై పోటీ చేస్తున్నారు. తాను అసెంబ్లీ స్థానాలను మార్చి పోటీ చేసిన మూడుసార్లు ఆదిమూలపు సురేష్‌ గెలుపొందారు. ఈసారి కూడా కొండపి నుంచి గెలుపొందుతానని ధీమాతో ఉన్నారు.

ప్రకాశంజిల్లా కొండపి నియోజకవర్గం మొదటి నుంచి వైపీపీకి కొరకరాని కొయ్యగానే ఉంది. వైసీపీ ఆవిర్భావం తరువాత ఇక్కడ పోటీ చేసిన రెండు సార్లు ఆ పార్టీ అభ్యర్దులు ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో ఇక్కడ రెండోసారి పార్టీ ఓడిపోయిన తరువాత కొన్నాళ్లు ఇన్‌చార్జిగా ఉన్న మాదాసి వెంకయ్య స్థానంలో వరికూటి అశోక్‌బాబును నియమించారు. ఆయనకు కూడా స్వంత పార్టీ నేతలనుంచే వ్యతిరేకత వ్యక్తం కావడంతో నియోజకవర్గాల మార్పులు, చేర్పుల కారణంగా అశోక్‌బాబును బాపట్ల జిల్లా వేమూరుకు పంపించి, కొండపిలో మంత్రి ఆదిమూలపు సురేష్‌ను రీప్లేస్‌ చేశారు.

కొండపి నియోజకవర్గంలో 2014, 2019 ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ అభ్యర్ధులు వరుస పరాజయాల పాలయ్యారు. టీడీపీ ఆవిర్భావం నుంచి ఇక్కడ కాంగ్రెస్‌ 4 సార్లు, టీడీపీ 4 సార్లు విజయం సాధించాయి. వైసీపీ ఆవిర్భావం నుంచి రెండు సార్లు పోటీ చేస్తే ఆ రెండు సార్లు ఓటమి చవిచూడాల్సి వచ్చింది. 2009లో ఈ నియోజకవర్గం ఎస్‌సీ రిజర్వ్‌‌గా మారింది. ఈ నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 2,34,675 మంది ఓటర్లు ఉన్నారు. సామాజిక వర్గాల వారీగా చూసుకుంటే ఇక్క కమ్మ ఓటర్లు అధికంగా ఉన్నారు. అత్యధికంగా 43 వేలు ఉంటే, మాల సామాజికవర్గానికి చెందిన ఓటర్లు 38 వేలు ఉన్నారు. ఆ తరువాత స్థానంలో మాదిగ సామాజిక వర్గం ఓట్లు 29 వేలు ఉన్నారు. అలాగే రెడ్డి సామాజికవర్గానికి చెందిన 25 వేల మంది ఓటర్లు, అలాగే యాదవ 16 వేలు, బలిజ 3 వేలు, ముస్లింలు 3 వేలు, ఆర్యవైశ్యలు 3వేలు ఉంటే మిగిలిన వారు బీసీ సామాజికవర్గాల్లోని వివిధ కులాలకు చెందిన ఓటర్లు ఉన్నారు.

సురేష్‌ సెంటిమెంట్ పనిచేస్తుందా..?

ఆదిమూలపు సురేష్‌ పోటీ చేసిన ప్రతిసారీ అసెంబ్లీ స్థానం మారుస్తున్నారు… ఈసారి కూడా నాలుగోసారి పోటీ చేస్తున్న కొండపి స్థానం కూడా ఇలా మార్చిందే. అయితే కొండపి స్థానంలో ఈసారి ఆదిమూలపు సురేష్‌ గెలుపు కోసం చాలా కష్టపడాల్సి ఉందట. కొండపి నుంచి గత రెండు పర్యాయాలు పోటీ చేసిన వైసీపీ ఓటమి పాలయ్యింది. ఇలాంటి స్థానం నుంచి ఈసారి పోటీచేస్తున్న వైసీపీ అభ్యర్ధి ఆదిమూలపు సురేష్‌కు ఈసారి పోటీ కత్తిమీద సాములా మారనుందట. టీడీపీకి కంచుకోటగా ఉన్న కొండపి కోటలో పాగా వేయాలంటే వైసీపీకి అంత సులువేమీకాదట. అయితే వైసీపీ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పధకాలతో పాటు ఓటమి ఎరుగని నేతగా ఉన్న తాను కొండపిలో టీడీపీ కోటను బద్దలు చేయడం ఖాయమంటున్నారు ఆదిమూలపు సురేష్‌. అంతేకాకుండా ఎలాగూ తన సీటు మార్పు సెంటిమెంట్‌ ఇక్కడ కూడా వర్కవుట్‌ అవుతుందంటున్నారట. మరి కొండపి ప్రజలు ఏమంటారో వేచి చూడాల్సిందే.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…