AP Inter Exams: మే 5 నుంచి షెడ్యూల్ ప్రకారమే ఇంటర్ పరీక్షలు: మంత్రి ఆదిమూలపు సురేష్
షెడ్యూల్ ప్రకారమే ఇంటర్ పరీక్షలు జరుగుతాయని ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ స్పష్టం చేశారు. మే 5 నుంచి షెడ్యూల్ ప్రకారం ఇంటర్ పరీక్షల నిర్వహణ ఉంటుందని చెప్పారు.
షెడ్యూల్ ప్రకారమే ఇంటర్ పరీక్షలు జరుగుతాయని ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ స్పష్టం చేశారు. మే 5 నుంచి షెడ్యూల్ ప్రకారం ఇంటర్ పరీక్షల నిర్వహణ ఉంటుందని చెప్పారు. అన్ని జిల్లాల్లో అధికారులు కొవిడ్ పై జాగ్రత్తలు తీసుకొని పరీక్షలకు సిద్ధం కావాలని సూచించారు. ఇంటర్మీడియట్ పరీక్షలు అనివార్యం అని గుర్తించాలన్నారు. మే 5 నుంచి 23 వరకు జరిగే పరీక్షలు కోవిడ్ జాగ్రత్తలు తీసుకుంటూ పూర్తి చేస్తామని మంత్రి సురేష్ స్పష్టం చేశారు. ఎగ్జామ్స్ పకడ్బందీ నిర్వహణకు, ఎటువంటి మాల్ ప్రాక్టీస్ జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నామని మంత్రి తెలిపారు. ముఖ్యంగా కోవిడ్ మార్గదర్శకాలను కట్టుదిట్టంగా అమలు చేసేలా ప్రతీ పరీక్షా కేంద్రం వద్ద కోవిడ్ ప్రొటోకాల్ ఆఫీసర్‌ను నియమించినట్లు వివరించారు. పరీక్షలు జరిగే తేదీల్లో ఉదయం 6.30 గంటల నుంచి బస్సులు నడిపేలా చర్యలు తీసుకోవాలని అన్ని జిల్లాల ఆర్టీసీ అధికారులకు కలెక్టర్ల నుంచి ఆదేశాలు అందాయి .
కృష్ణా జిల్లాలో పరీక్షల నిర్వహణపై కలెక్టర్ ఇంతియాజ్ రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఇంటర్మీడియెట్ మే 2021 పరీక్షల నిర్వహణపై కలెక్టర్ అధ్యక్షతన కోఆర్డినేషన్ మీటింగ్ జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడిన కలెక్టర్ ఇంతియాజ్.. మే 5వ తేదీ నుంచి 23వ తేదీ వరకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఇంటర్ ఎగ్జామ్స్ నిర్వహించనున్నామని స్పష్టం చేశారు. దీనికి సంబంధించి జిల్లాలో మొత్తం 142 ఎగ్జామ్ సెంటర్స్ ఏర్పాటు చేశామన్నారు. వాటిలో విజయవాడ నగర పరిధిలో 77 సెంటర్స్ ఏర్పాటు చేయగా, జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో 65 సెంటర్లను ఏర్పాటు చేశామన్నారు. జిల్లాలో 1 లక్షా 12 వేల 154 మంది విద్యార్థులు ఇంటర్మీడియెట్ ఎగ్జామ్స్ రాయనున్నట్లు తెలిపారు.