Brahmamgari Matam: మరో మలుపు తిరిగిన బ్రహ్మంగారి మఠం వివాదం.. మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన హైకోర్టు
బ్రహ్మంగారి మఠం వివాదం మరోమలుపు తిరిగింది. తీర్మానంలో టీటీడీ ఈవో సంతకం లేనందున తీర్మానం చెల్లదని ఏపీ హైకోర్టు తేల్చి చెప్పింది. ప్రభుత్వ ఆదేశాలు కూడా చెల్లవని ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
బ్రహ్మంగారి మఠం వివాదం మరో మలుపు తిరిగింది. కడప జిల్లా బ్రహ్మంగారి మఠం పీఠాధిపతి ఎంపిక వ్యవహారంపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. తాత్కాలిక పీఠాధిపతిగా ప్రత్యేకాధికారిని నియమిస్తూ ధార్మిక పరిషత్ చేసిన తీర్మానం నిబంధనలకు అనుగుణంగా లేదని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ వ్యవహారంలో నిబంధనలకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
బ్రహ్మంగారి మఠం పీఠాధిపతి హోదా తమకే దక్కాలంటూ దివంగత పీఠాధిపతి రెండో భార్య మారుతీ మహాలక్ష్మి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దేవాదాయశాఖ జోక్యం సహా మహాలక్ష్మమ్మ వాదనపై ఇరు వర్గాల వాదనలను ఉన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. ప్రత్యేకాధికారికి ఉత్తర్వులు ఇచ్చే అధికారం లేదని.. నిబంధనలకు విరుద్ధంగా జీవో జారీ చేశారని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. తీర్మానంలో టీటీడీ ఈవో సంతకం లేనందున తీర్మానం చెల్లదని ఏపీ హైకోర్టు తేల్చి చెప్పింది. ప్రభుత్వ ఆదేశాలు కూడా చెల్లవని ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
మరోవైపు నిబంధనలకు అనుగుణంగానే జీవో జారీ చేశామని ప్రభుత్వం తరఫు న్యాయవాది న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. ధార్మిక పరిషత్ ఇచ్చిన తీర్మానం ఆధారంగానే ప్రత్యేకాధికారి ఉత్తర్వులు ఇచ్చారని చెప్పారు. ఇరువురి వాదనలు విన్న న్యాయస్థానం.. నిబంధనలకు అనుగుణంగా చర్యలు చేపట్టాలంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.