AP TDP : కొత్త వివాదం కోసమే ఏపీ సర్కార్ రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్ట్ తీసుకొచ్చింది : బోండా ఉమ
కొత్త వివాదం కోసమే వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారు రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్ట్ తీసుకువచ్చిందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమ..
Bonda Uma – VMC : కొత్త వివాదం కోసమే వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారు రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్ట్ తీసుకువచ్చిందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమ ఆరోపించారు. చట్టాలను అతిక్రమించకుండా వెళితే రెండు రాష్ట్రాల మధ్య నీటి వివాదం వచ్చేది కాదన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబుకి బాధ్యతలు ఇస్తే జలవివాదం రాకుండా చూస్తారని ఆయన చెప్పుకొచ్చారు. నిన్న విజయవాడ విఎంసి(విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్)లో ప్రతిపక్ష సభ్యుల గొంతు నొక్కి ప్రజాస్వామ్యాన్ని ఖునీ చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 198, 199 అమలులోకి వస్తే దాని ప్రభావం ఆంధ్రప్రదేశ్ ప్రజలపై పడనుందని ఉమ చెప్పారు. భవిష్యత్‌లో ఇంటి పన్ను, చెత్త పన్ను కట్టాలంటే సొంత నివాసాలు అమ్ముకుని టాక్స్ లు కట్టవలసిన పరిస్థితి ఏర్పడుతుందని ఆయన జోస్యం చెప్పారు. జగన్ ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన జీవోలను వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. బెజవాడలో ఒక మంత్రి, ఒక ఎమ్మెల్యే, మేయర్ ని డమ్మీ చేశారని ఆయన ఎద్దేవా చేశారు.
విజయవాడ మున్సిపల్ కౌన్సిల్ లో ఏక పక్షంగా వ్యవహరిస్తే టీడీపీ కార్పొరేటర్లు రాజీనామాలకు సిద్ధమని ప్రకటించిన బోండా ఉమ.. జగన్, కేసీఆర్ కూర్చుని మాట్లాడితే జల వివాదం పరిష్కారం అవుతుందన్నారు. ఎగువ రాష్ట్రం ఇష్టం వచ్చినట్లు ప్రాజెక్టులు కడితే కింద రాష్ట్రానికి నీరు ఎలా వస్తుందంటూ బోండా ప్రశ్నించారు.