Andhra Pradesh: కొత్త జిల్లాల ఏర్పాటుకు వేగంగా సన్నాహాలు చేస్తోన్న జగన్ సర్కారు.. ఉగాది రోజు నుంచే పాలన.. పూర్తి వివరాలివే..
AP New Districts: కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు ఏపీ ప్రభుత్వం(Andhra Pradesh Govt) సన్నాహాలు చేస్తోంది.
AP New Districts: కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు ఏపీ ప్రభుత్వం(Andhra Pradesh Govt) సన్నాహాలు చేస్తోంది. మార్చి 3 వరకు కొత్త జిల్లాల (New Districts) ఏర్పాటుపై ప్రజల నుంచి సలహాలు, సూచనలు, అభ్యంతరాలను స్వీకరించనున్నారు. వీటిని పరిశీలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఓ ప్రత్యేక కమిటీని కూడా ఏర్పాటు చేసింది. కాగా మార్చి 4 నుంచి 10 వరకూ కమిటీ అధికారులు జిల్లాల పునర్విభజనపై అభ్యంతరాలను పరిశీలించనున్నారు. అనంతరం మార్చి 11 నుంచి 14 వరకు సీఎస్ ఆధ్వర్యంలోని ప్రత్యేక కమిటీ కూడా ఈ అభ్యంతరాలను పరిశీలించనుంది. ఆపై మార్చి17న తుది నోటిఫికేషన్ జారీ చేసి.. మరుసటి రోజు (మార్చి 18న) గెజిట్ నోటిషికేషన్ జారీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. మార్చి 23 నుంచి 25 వరకూ ఆయా జిల్లాల కలెక్టర్లు జిల్లాల ఏర్పాటుపై గెజిట్ నోటిఫికేషన్లను జారీ చేసేలా జగన్ సర్కారు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
ఉగాది రోజు నుంచే ..
కాగా కొత్త జిల్లాల ఏర్పాటుపై అభ్యంతరాల పరిశీలనకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీలో ప్లానింగ్ సెక్రటరీ, సీసీఎల్ఏ సెక్రటరీ, జిల్లాల కలెక్టర్లు ఉన్నారు. ప్రజల అభ్యంతరాలు, సూచనలను ఈ కమిటీ అధ్యయనం చేయనుంది. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని ప్రజల నుంచి వచ్చే విజ్ఞప్తులపై కమిటీ నిర్ణయం తీసుకోనుంది. కమిటీ సిఫార్సులు ఆధారంగా కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రాథమిక నోటిఫికేషన్‌లో మార్పులు,చేర్పులపై సీఎస్ కమిటీ తుది నిర్ణయం తీసుకోనుంది. కాగా ఉగాది రోజు (ఏప్రిల్2) నుంచే కొత్త జిల్లాల్లో కార్యకలాపాలు ప్రారంభించాలని ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. కాగా కొత్త జిల్లాల్లో ప్రభుత్వ కార్యాలయాల కోసం భవనాల గుర్తింపు పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.
.