Andhra Pradesh: లోన్ యాప్ వాళ్లు బెదిరిస్తే ఈ నంబర్‌కు కాల్ చెయ్యండి.. ఏపీ హోం శాఖ అలెర్ట్
ఇచ్చిన డబ్బుకు 4,5 రెట్లు ఎక్కువ వసూలు చేస్తున్నారా..? మార్పింగ్ ఫోటోలతో మిమ్మల్ని బద్నాం చేస్తున్నారా..? మనో వేదనకు గురి కాకండి. ఈ నంబర్‌కు కంప్లైంట్ చేయండి. పోలీస్ శాఖ రంగంలోకి దిగుతుంది.
ఇటీవలికాలంగా ఆన్ లైన్‌లో చేసిన అప్పులు.. ఉరితాళ్లలా మారుతున్నాయి. అవసరం కోసం చేసిన రుణం.. చివరికి కన్నవారి, కట్టుకున్నవారి నుంచి శాశ్వతంగా దూరం చేస్తుంది. లోన్‌యాప్ నిర్వాహకుల వేధింపులు భరించలేక బలవన్మరణాలకు పాల్పడుతుండడం కలకలం రేపుతోంది. దీనిపై రియాక్టయిన ఏపీ సర్కార్.. లోన్ యాప్స్ అరాచకాలకు అడ్డుకట్ట వేసేందుకు నడుం బిగించింది.
ఇనిస్టెంట్ లోన్ యాప్స్ ఆగడాలు రోజురోజుకు మితిమీరిపోతున్న సంగతి తెలిసిందే. రక్తం తాగే రాక్షసుల్లా వీళ్లు.. బాధితులను వేధిస్తున్నారు. వీరి బెదిరింపులు, వేధింపులు కారణంగా ఎంతోమంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు. మార్ఫింగ్ ఫోటోలతో వేధింపులకు పాల్పడుతూ మానసికంగా దెబ్బ తీస్తున్నారు. దీంతో అవమానం భరించలేక చాలామంది ఉరితాళ్లను ఆశ్రయిస్తున్నారు. కొన్నిసార్లు చనిపోయినవారి బంధువులను కూడా వేధింపులకు గురి చేస్తున్న ఘటనలు వెలుగుచూశాయి. ఈ క్రమంలో లోన్ యాప్స్ అరాచకాలపై ఏపీ సర్కార్ ఫోకస్ పెట్టింది. ఇకపై వారి తోలు తీసేందుకు రెడీ అయ్యింది. బెదిరింపు కాల్స్‌పై ఫిర్యాదుల కోసం కాల్ సెంటర్ ఏర్పాటు చేసింది. 1930 కాల్ సెంటర్ ఫోన్ చేసి.. బాధితులు కంప్లైంట్ చేయవచ్చని తెలిపింది. కాల్ సెంటర్‌ను సంప్రదిస్తే వెంటనే స్పందిస్తామని వెల్లడించింది.
ఈ క్రమంలోనే రాష్ట్రంలోని పౌరులకు కీలక సూచనల చేసింది హోం శాఖ. ఆకర్షించే లోన్ మెసేజ్‌ల లింక్‌లు ఓపెన్ చేయొద్దని సూచించింది. ఫోన్లలోని -కాంటాక్ట్, అడ్రస్, లొకేషన్ల పర్మిషన్లు ఇవ్వొద్దని సూచించింది. అదిరే ఆఫర్స్ అంటూ ట్రాప్ చేసే ప్రయత్నం చేస్తారని.. అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించింది. విలువైన జీవితాలను ఇలాంటి విషయాల కోసం బలి చేసుకోవద్దని కోరింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి