AP Free Sand Policy: ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. నేటి నుంచి ఉచితంగా ఇసుక! ఆన్‌లైన్‌లో బుకింగ్ వివరాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఉచిత ఇసుక విధానం ఈ రోజు (సోమవారం) నుంచి అమలులోకి రానుంది. ఇందుకు సంబంధించిన వివరాలను గనుల శాఖ వెబ్‌సైట్‌లో అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇసుక అక్రమ తవ్వకాలకు స్వస్తి పలకాలనే ఉద్దేశ్యంతో ఉచిత ఇసుక పాలసీని తీసుకొచ్చినట్లు గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపిన సంగతి విధితమే. నేడు ఉచిత ఇసుక ప్రారంభ నేపథ్యంలో సీనరేజ్, ఇసుక తవ్వకాలు, రవాణా ఖర్చులు వంటి..
అమరావతి, జులై 8: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఉచిత ఇసుక విధానం ఈ రోజు (సోమవారం) నుంచి అమలులోకి రానుంది. ఇందుకు సంబంధించిన వివరాలను గనుల శాఖ వెబ్‌సైట్‌లో అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇసుక అక్రమ తవ్వకాలకు స్వస్తి పలకాలనే ఉద్దేశ్యంతో ఉచిత ఇసుక పాలసీని తీసుకొచ్చినట్లు గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపిన సంగతి విధితమే. నేడు ఉచిత ఇసుక ప్రారంభ నేపథ్యంలో సీనరేజ్, ఇసుక తవ్వకాలు, రవాణా ఖర్చులు వంటి నామమాత్ర రుసుములను ఆన్‌లైన్ విధానంలో స్వీకరించనున్నట్లు అధికారులు తెలిపారు. గత ప్రభుత్వం ఇసుకను విక్రయించి, నగదు రూపంలో చెల్లింపులు తీసుకోవడం వల్ల పెద్దయెత్తున అక్రమాలకు పాల్పడిందని, అందుకే తమ ప్రభుత్వం అక్రమాలకు తావివ్వకుండా కేవలం ఆన్‌లైన్‌లోనే రుసుములు స్వీకరిస్తున్నట్లు చంద్రబాబు సర్కార్ వెల్లడించింది.
కాగా ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం ఉచిత ఇసుక విధానం అమలు చేయాలని నిర్ణయించింది. ఎలాంటి నగదు లావాదేవీలు లేకుండా పూర్తిగా డిజిటల్ చెల్లింపులు మాత్రమే స్వీకరించేలా కార్యచరణ రూపొందించారు. రాష్ట్ర వ్యాప్తంగా మొదట 20 జిల్లాల్లో ఇసుక డంపులున్న నిల్వ కేంద్రాలలో సోమవారం నుంచి ఉచిత ఇసుక విధానం అమలు చేయనున్నారు. అయితే పార్వతీపురం మన్యం, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, అనంతపురం జిల్లాల్లో మాత్రం కొన్ని రోజుల తర్వాత ఈ విధానం అమలులోకి తీసుకురానున్నారు. డిజిటల్ చెల్లింపుల స్వీకరణ కోసం ఇప్పటికే 16 జిల్లాల్లో బ్యాంకు ఖాతాలు ఓపెన్ చేశారు. వీటన్నింటికి జులై 8న ఆయా బ్యాంకులు క్యూఆర్ కోడ్ మంజూరు చేయనున్నాయి.
రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఇసుక నిల్వ కేంద్రాలున్నాయనే సమాచారం ఎప్పటికప్పుడు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నారు. అలాగే వాటిలో ఎంతమేర ఇసుక అందుబాటులో ఉందనే సమాచారం కూడా అధికారులు అప్‌డేట్ చేస్తుంటారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలను రాష్ట్ర గనుల శాఖ ఆదివారం నుంచే అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. అలాగే విక్రయాలు మొదలైనప్పటి నుంచి ఏ రోజుకారోజు జరిగిన ఇసుక విక్రయాల వివరాలతోపాటు, మిగిలిన ఇసుక నిల్వల సమాచారాన్ని కూడా ఎప్పటికప్పుడు వెబ్‌సైట్‌లో అప్‌డేట్ చేసేలా ఏర్పాట్లు చేశారు. అయితే కొన్ని సాంకేతి కారణాల వల్ల సోమవారం నుంచి 2 వారాల వరకు చేతిరాతతో బిల్లులు జారీ చేస్తారు. ఆ తర్వాత నుంచి వాటిని కూడా ఆన్‌లైన్‌లోనే జారీ చేసేలా సాఫ్ట్‌వేర్ సిద్ధం చేస్తామని అధికారులు అంటున్నారు.
120 స్టాక్ పాయింట్స్ ద్వారా ఉచిత ఇసుక పంపిణీ.. మంత్రి కొల్లు రవీంద్ర
ఈరోజు నుంచి ఏపీలో ఉచిత ఇసుక విధానం అమలులోకి వచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా 120 స్టాక్ పాయింట్స్ ద్వారా ఉచిత ఇసుక అందిస్తారు. నిర్వహణ ఖర్చుల కోసం నామినల్ ధరలు మాత్రమే తీసుకుంటారు. రవాణా, లోడింగ్ ఛార్జీలు మాత్రమే వసూలు చేస్తారు. ప్రస్తుతం వివిధ స్టాక్‌పాయింట్ల దగ్గర 45 లక్షల టన్నుల ఇసుక ఉంది. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడా నిర్మాణాలకు ఇబ్బంది లేకుండా.. రీచ్‌ల నుంచి కావాల్సిన ఇసుక తీసుకుని వెళ్లొచ్చని మంత్రి కొల్లు రవీంద్ర చెప్తున్నారు. ఐదేళ్లుగా భావన నిర్మాణ కార్మికులు చాలా ఇబ్బంది పడ్డారని, ఆ ఇబ్బందులు తొలగించేలా ఇప్పుడు కొత్త పాలసీ తీసుకొచ్చామన్నారు. వచ్చే 3 నెలల్లో కోటి టన్నుల ఇసుక కావాల్సి ఉంటుందని.. దాన్ని అందుబాటులో ఉంచేలా తమ ప్రభుత్వం చర్యలు చేపట్టిందని అన్నారు. అదే సమయంలో నదుల్లో ఇష్టారాజ్యంగా ఇసుక తవ్వకాలు చేపట్టకుండా కూడా చర్యలు చేపడతామని మంత్రి తెలిపారు. దీనికోసం స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ టీమ్‌ను కూడా ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు.