గోల్డ్ లోన్ తీసుకునేటప్పుడు ఎలాంటి మోసాలు జరిగే ఛాన్సుంది? మీరు ఏ ఏ జాగ్రత్తలు తీసుకోవాలి?

బంగారంపై రుణాలిచ్చే వ్యాపారంలో ఈ మధ్య కాలంలో చాలా అక్రమాలు, అవకతవకలు పెరుగుతూ ఉండటంతో అటు కేంద్ర ఆర్థిక శాఖ, అలాగే రిజర్వ్ బ్యాంకు కూడా అలెర్ట్ అయ్యాయి. కొన్ని కంపెనీలు నిబంధనలను కాలరాస్తున్నాయన్న విషయాన్ని ఆర్థిక శాఖ గుర్తించింది. అలాగే ప్రభుత్వ రంగ బ్యాంకులు తమ గోల్డ్‌లోన్ విధానాలను సమీక్షించుకోవాలని ఆర్థిక శాఖ కోరింది.

గోల్డ్ లోన్ తీసుకునేటప్పుడు ఎలాంటి మోసాలు జరిగే ఛాన్సుంది? మీరు ఏ ఏ జాగ్రత్తలు తీసుకోవాలి?
Gold Loan Market
Follow us

|

Updated on: Jul 09, 2024 | 8:51 AM

కుమార్.. ఓ చిరు వ్యాపారి. డబ్బులు అవసరం వచ్చినప్పుడల్లా.. ఉన్న కాస్త బంగారాన్ని తన దుకాణానికి సమీపంలో ఉన్న ఓ ప్రైవేటు కంపెనీలో తాకట్టు పెట్టి రుణం తెచ్చుకుంటూ ఉంటారు. ప్రతి నెలా… సమయానికి వడ్డీ చెల్లిస్తుండటం..డబ్బులు కుదిరిన వెంటనే వాటిని తాకట్టు నుంచి విడిపించుకుంటూ ఉండటంతో కొద్ది నెలల క్రితం వరకు  పెద్దగా సమస్యలు ఎదురు కాలేదు.  కానీ ఇటీవల మళ్లీ అవసరం వచ్చి అదే ప్రైవేటు కంపెనీకి వెళ్లాడు.  గతంతో పోల్చుకుంటే ఈ సారి తనకు మరి కాస్త ఎక్కువ డబ్బు అవసరం పడింది. అయితే అప్పటికే బంగారం ధర పెరగడం తన దగ్గర బంగారాన్ని లెక్క చూసుకొని అంత డబ్బు వస్తుందన్న నమ్మకంతో సదరు ప్రైవేటు కంపెనీకి వెళ్లాడు. ఎప్పటిలాగే బంగారాన్ని ఇచ్చి తనకు కావాల్సిన డబ్బెంతో కూడా చెప్పాడు. కానీ.. విచిత్రమేంటంటే.. ఆ కంపెనీ ఉద్యోగులు అంత రాదని చెప్పారు. అదేంటని ప్రశ్నిస్తే.. తాము అనుకున్నంతే ఇస్తాని.. కావాలంటే తీసుకెళ్లండి లేకపోతే లేదని తేల్చి చెప్పారు. దీంతో ఊసురుమంటూ వాళ్లిచ్చినంతే తీసుకొని మిగిలిన డబ్బులు ఎలా సర్దుకోవాలని అని ఆలోచిస్తూ వెళ్లిపోయాడు”

ఇలాంటి అనుభవం కాకపోయినా.. సమస్య మాత్రం దాదాపు అలాంటిదే ఎదురయ్యింది  విజయనగరానికి చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తికి. అలాంటి ఓ ప్రైవేటు కంపెనీలోనే బంగారాన్ని తాకట్టు పెట్టి రుణం తీసుకున్నారు. తీసుకునే సమయంలో వడ్డీ రేటు కూడా చెక్ చేసుకున్నారు. అనుకున్న ప్రకారం నెల నెలా వడ్డీ చెల్లిస్తూ వచ్చారు. కానీ ఓ నెల సమయానికి చెల్లించలేకపోయారు. గడువుదాటిన తర్వాత వెళ్తే వడ్డీ రేటు అమాంతం పెరిగిపోయింది. ఎందుకని ప్రశ్నిస్తే… మా కంపెనీ రూల్స్ ప్రకారం పెరిగిందని, ఇవన్నీ మీరు ముందే చదివి ఒప్పుకున్నట్టు సంతకం కూడా చేశారని ఆయన గతంలో సంతకం చేసిన పత్రాలు చూపించారు. మరో మాట మాట్లాడలేకపోయాడు శ్రీనివాస్

నిజానికి ఎన్ని వందల ఎకరాల భూములు, ఇళ్లు వంటి స్థిరాస్థులున్నా.. సమయానికి డబ్బులు చేతికి రాకపోవచ్చేమో కానీ.. ఇంట్లో బంగారం ఉంటే మాత్రం డబ్బులకు వెతుక్కోవాల్సిన పని లేదు. ఎవ్వరినీ అప్పు అడగాల్సిన పని కూడా ఉండదు. అందుకే అవసరానికి తక్షణం ఆదుకునే సంజీవని బంగారం. ఇలా వెళ్లామా.. అలా డబ్బులు తెచ్చుకున్నామా అన్నట్టే ఉంటుంది.

కుమార్, శ్రీనివాస్‌లకు ఎదురైన సమస్యలు ఈ కథనం చదివే వారిలో చాలా మందికి ఎదురయ్యే ఉంటాయి. అసలు మనం ఇచ్చిన బంగారానికి తగిన విలువ కడుతున్నారా..? వడ్డీ రేట్లు కరెక్ట్‌గానే ఉన్నాయా..? మన బంగారానికి తక్కువ విలువకట్టి రుణంగా ఇచ్చే మొత్తాన్ని తగ్గించేస్తున్నారా..? అసలు ప్రైవేటు కంపెనీలకు, వ్యక్తులకు, బ్యాంకులకు ఈ గోల్డ్ లోన్లు ఇచ్చే విషయంలో తేడా ఏంటి..? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం చూద్దాం.

మరిన్ని ప్రీమియం కథనాల కోసం…TV9 News యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Gold Loan

Gold Loan

బంగారంపై రుణాలిచ్చే వ్యాపారంలో ఈ మధ్య కాలంలో చాలా అక్రమాలు, అవకతవకలు పెరుగుతూ ఉండటంతో అటు కేంద్ర ఆర్థిక శాఖ, అలాగే రిజర్వ్ బ్యాంకు కూడా అలెర్ట్ అయ్యాయి.  కొన్ని కంపెనీలు నిబంధనలను కాలరాస్తున్నాయన్న విషయాన్ని ఆర్థిక శాఖ గుర్తించింది. అలాగే  ప్రభుత్వ రంగ బ్యాంకులు తమ గోల్డ్‌లోన్ విధానాలను సమీక్షించుకోవాలని ఆర్థిక శాఖ కోరింది.

LTV అంటే ఏంటి?

ఈ విషయంలో ప్రధానంగా నష్టపోయింది బంగారంపై రుణం తీసుకునే ఖాతాదారులే.  ముఖ్యంగా గోల్డ్‌కు విలువ కట్టే  విషయంలో ప్రైవేటు కంపెనీలు నిబంధనలు ఉల్లంఘిస్తున్నాయి. LTV లోన్ టు వాల్యూ రేషియో విషయంలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి.

మీ బంగారంపై ఎంత లోన్ రావాలన్న విషయం తెలిసేది ఈ LTV ద్వారానే. ప్రస్తుతం  రిజర్వ్ బ్యాంక్ ఈ ఎల్టీవీని గరిష్టంగా 75 శాతంగా నిర్ధారించింది. అయితే కోవిడ్ సమయంలో దీన్ని కాస్త సడలించి వ్యవసాయేతర అవసరాలకు 90 శాతం వరకు ఇవ్వవచ్చని ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ అది 2021 మార్చి 31 వరకు మాత్రమేనంటూ 2020 ఆగస్టు 6న ఓ సర్కిక్యులర్ జారీ చేసింది. దీంతో దాదాపు రెండేళ్ల క్రితం వరకు 90 శాతం వరకు రుణాలు ఇచ్చినప్పటికీ ప్రస్తుతం మాత్రం రిజర్వ్ బ్యాంకు నిబంధనల ప్రకారం ఎల్టీవీ కేవలం 75శాతం మాత్రమే.  అంటే మీరు లక్ష రూపాయల బంగారాన్ని తాకట్టు పెడితే గరిష్టంగా 75 వేలు వరకు రుణం వస్తుందని అర్థం. అయితే కొద్ది నెలల క్రితం బంగారు రుణాలిచ్చే IIFL సంస్థ నిబంధనలు ఉల్లంఘిస్తున్నట్టు ఆర్బీఐ దృష్టికి రావడంతో బంగారు రుణాలిచ్చే ప్రైవేటు సంస్థల కార్యకలాపాలపై మరింత దృష్టి కేంద్రీకరించింది.

మరిన్ని ప్రీమియం కథనాల కోసం…TV9 News యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

మోసాలు జరిగేదెక్కడ?

Gold Loan

సాధారణంగా తప్పులు ఎక్కడ జరుగుతాయి?

  1. తెచ్చిన బంగారాన్ని తక్కువ విలువ కట్టడం
  2. ఖాతాదారులు లోన్ తీర్చలేకపోవడం, ఆపై దాన్ని తమకు అనుకూలంగా కంపెనీలు మార్చుకుంటూ వారి బంగారాన్ని వేలం వెయ్యడం
  3. బంగారం నాణ్యతను తగ్గించి చూపిస్తూ తక్కువ మొత్తంలో రుణాలివ్వడం.

అంటే మీరు తీసుకెళ్లే బంగారం 22 క్యారెట్ల బంగారం అయినప్పటికీ ఆ బంగారాన్ని విలువ కట్టే వ్యక్తి దాన్ని 18 క్యారెట్లుగానే, లేదా 20 క్యారెట్లుగానే చూపించి మీకు రావాల్సిన గరిష్ట రుణం కన్నా తక్కువ మొత్తాన్ని మాత్రమే రుణంగా ఇస్తుంటారు. ఈ విషయంలో ఈ కంపెనీ, ఆ కంపెనీ అని లేదు.. అన్ని కంపెనీలు దాదాపు అదే దారిలో పని చేస్తున్నాయి. ఇక హోమ్ లోన్, పర్సనల్ లోన్, వెహికల్ లోన్‌లా ఈ లోన్లకు ఓ ప్రామాణికత లేకపోవడంతో కంపెనీలు ఇష్టానుసారం వడ్డీ రేట్లను నిర్ణయిస్తున్నాయి. ప్రకటనల్లో ఆకర్షణీయంగా ఉండేందుకు అతి తక్కువ వడ్డీ రేట్లంటూ అత్యంత ప్రభావవంతమైన వ్యక్తులతో ప్రముఖంగా ప్రకటనలు ఇస్తున్నప్పటికీ… కింద చుక్కలు పెట్టి షరతులు వర్తిస్తాయంటూ కనీ కనిపించనట్టు అచ్చేసి.. ఆపై రుణం తీసుకున్నాక.. సమయానికి కట్టలేదని, ఆ పెనాల్టీ.. ఈ పెనాల్టీ అంటూ ఎక్కువ వడ్డీలను రుణం తీసుకున్న వారి నుంచి గుంజేస్తున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి.

వడ్డీరేట్లు, ప్రాసెస్ ఫీజు ఎలా లెక్కిస్తారు?

సాధారణంగా బంగారు రుణాలు ఇచ్చే సమయంలో .. ఆ సమయంలో మార్కెట్లో బంగారం ధర ఎంత ఉంది..? అలాగే ఎంత రుణం తీసుకోవాలనుకుంటున్నారు..? మీరు తాకట్టు పెట్టే బంగారం విలువ ఎంత..? ఎంత కాలంలో తిరిగి తీర్చాలనుకుంటున్నారు..? మీ బంగారం ఎంత నాణ్యమైనది..? ఇలాంటి వివరాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని రుణాలు మంజూరు చేస్తుంటాయి ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు అలాగే ప్రైవేటు కంపెనీలు. అయితే ఈ వడ్డీ రేట్ల విషయానికి వచ్చేసరికే ప్రైవేటు సంస్థలకు, ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులకు మధ్య చాలా తేడా ఉంటుంది. ప్రైవేటు సంస్థలు ఒక్కోసారి కస్టమర్ తీరు, అలాగే కస్టమర్‌తో అక్కడ సిబ్బందికి ఉన్న పరిచయాలు, అలాగే ఆ కస్టమర్ సిబిల్ స్కోరు వంటివి పరిగణనలోకి తీసుకొని కొన్ని సార్లు సాధారణ విలువ కన్నా ఎక్కువ ఎక్కువ మొత్తాన్నే రుణంగా ఇస్తుంటాయి. అయితే వాటి వడ్డీ రేట్ల విషయంలో కూడా తేడా ఉంటుంది. నిర్ణీత సమయం దాటితే వేసే వడ్డీ రేట్లు అధికంగా ఉంటాయి. ప్రైవేటు ఆర్థిక సంస్థలు గోల్డ్ లోన్స్‌పై అత్యధికంగా 28 నుంచి 36 శాతం వరకు వడ్డీ వసులూ చేస్తున్నాయి.

అదే ప్రభుత్వ రంగ బ్యాంకుల విషయానికి వస్తే మాత్రం 9 నుంచి 11 శాతం వరకు వడ్డీని వసూలు చేస్తున్నాయి.  ప్రాసెసింగ్ ఫీజు విషయంలోనూ  ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల మధ్య తేడాలు ఉన్నాయి. SBI లాంటి ప్రభుత్వ రంగ బ్యాంకులైతే 0.5 శాతం నుంచి గరిష్ఠంగా 10వేల రూపాయలవరకు వసూలు చేస్తున్నాయి. అదే ప్రైవేటు బ్యాకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు మాత్రం ఒక శాతం లేదా అంత కన్నా ఎక్కువగానే ప్రాసెసింగ్ ఫీజును తీసుకుంటున్నాయి.

మరిన్ని ప్రీమియం కథనాల కోసం…TV9 News యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Gold Loan

Gold Loan

బంగారం రుణం తీసుకునేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

  1. రుణం కోసం బ్యాంకు లేదా నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థల వద్దకు వెళ్లే ముందే మీ దగ్గర ఉన్న బంగారం బరువు, అలాగే నాణ్యతను చెక్ చేసుకోవడం మంచిది. చాలా బంగారం షాపుల్లో నాణ్యతను చెక్ చేయించుకునే సౌకర్యం ఉంటుంది.
  2. అలాగే మీది హాల్ మార్క్ బంగారమైతే అందుకు సంబంధించిన సర్టిఫికేట్ కూడా తీసుకుంటే.. రుణం తీసుకునే సమయంలో ఆ సర్టిఫికేట్ చూపించడం వల్ల ధైర్యంగా వారితో రుణం విషయంలో బేరం ఆడొచ్చు. గోల్డ్ కారెట్స్ ను కెరటోమీటర్ ద్వారా నిర్ణయిస్తారు. ఈ టెస్ట్ చేయించి, సర్టిఫికెట్ తీసుకుంటే బ్యాంకుల వద్ద అప్పు తీసుకునేటప్పుడు ఉపయోగపడుతుంది. మీరిచ్చేది నాణ్యమైన బంగారమన్న సర్టిఫికేట్ మీ చేతులో ఉంటే వడ్డీ రేట్లు తగ్గించమని అడిగే అవకాశం కూడా ఉంటుంది.
  3. మరో ముఖ్యమైన విషయాన్ని మార్కెట్ నిపుణులు పదే పదే గుర్తు చేస్తుంటారు. మీరు తీసుకునే గోల్డ్ లోన్ స్వల్పకాలానికి మాత్రమే. అంటే అత్యవసర సమయాల్లో మాత్రమే ఈ బంగారాన్ని తాకట్టు పెట్టాలి. లేదంటే వడ్డీ రేట్లు పెరిగే ప్రమాదం ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఇవి హోమ్ లోన్స్ కన్నా ఎక్కువ వడ్డీ చెల్లించాల్సిన రుణాలు. కనుక డబ్బులు చేతులో ఉన్నప్పుడు ఎప్పటికప్పుడు తీర్చేయడం చాలా చాలా మంచిది.

పెరిగిపోతున్న బంగారు రుణాలు.. ఆర్బీఐ ఆందోళన

సరిగ్గా ఏడాది క్రితం దేశ వ్యాప్తంగా బంగారు రుణాల విలువ సుమారు 90,036 కోట్ల రూపాయలు ఉండేది. అదే ఈ ఏడాది మార్చి నాటికి  లక్ష కోట్లకు చేరింది. 2024 మే నెలాఖరు నాటికి ఏకంగా ఒక లక్ష 20 వేల కోట్లకు చేరింది. అటు క్రెడిట్ కార్డు రుణాల మొత్తం కూడా సుమారు 2.7 లక్షల కోట్లకు చేరింది. ఒక్కసారిగా రుణాల మొత్తం పెరగడంపై ఆర్బీఐ ఆందోళన చెందుతంటూ ఇటీవల వార్తలు వచ్చాయి.

ఇండియాలో గోల్డ్ లోన్ మార్కెట్

ప్రపంచంలోనే బంగారాన్ని అత్యధికంగా వినియోగించే దేశాల్లో ఇండియా ఒకటి. రిజర్వ్ బ్యాంకు లెక్కల ప్రకారం ఇండియాలో సుమారు 27వేల టన్నుల బంగారం ఉంది. ఇది ప్రపంచంలో ఉన్న మొత్తం బంగారంలో 14 శాతం. అదే గోల్డ్ లోన్ మార్కెట్ విషయానికొస్తే 2022 నాటికి దేశంలో సుమారు 4.64 లక్షల కోట్ల రూపాయలు. ఇది ఏటా సుమారు 12.22 శాతం పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఆ ప్రకారం 2029 నాటికి సుమారు 9.5 లక్షల కోట్లకు పెరిగే అవకాశం ఉందన్నది ఒక అంచనా. ముఖ్యంగా వ్యక్తిగత రుణాలు, చిన్న, మధ్యతరహా వ్యాపారులు, పరిశ్రమలు ఈ తరహా రుణాలు ఎక్కువగా తీసుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. బంగారం ధరలు గణనీయంగా పెరగడంతో వ్యాపారం, విద్య, వైద్య, వ్యక్తిగత అవసరాల కోసం ఇటీవల ఉన్న బంగారాన్ని తాకట్టుపెట్టి రుణాలు తీసుకోవడం ఎక్కువయ్యిందని కూడా నిపుణులు చెబుతున్నారు.

మరిన్ని ప్రీమియం కథనాల కోసం…TV9 News యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Gold Loan Market

Gold Loan Market

అయితే ఇప్పటికీ బంగారు రుణాలు కావాలంటే ఎక్కువగా వడ్డీ వ్యాపారుల్నే ఆశ్రయిస్తున్నారు జనం. ఆ తర్వాత ప్రైవేటు సంస్థలు, ప్రభుత్వ బ్యాంకుల దగ్గరకు వెళ్తున్నారు. ప్రస్తుతం మార్కెట్లో  వడ్డీ వ్యాపారులు, బంగారు కుదువ వ్యాపారుల 61 శాతం  ఉండగా… మిగిలిన 39 శాతం బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీల వద్ద ఉంది. అయితే కొన్నేళ్లుగా ప్రభుత్వ రంగ బ్యాంకులు కూడా బంగారు రుణాలను విరివిగా ఇవ్వడం మొదలు పెట్టాయి. ఇప్పుడు దాదాపు అన్ని బ్యాంకులు రుణాలిస్తున్నాయి.

నియంత్రణ ఎందుకు అవసరం?

గోల్డ్ లోన్ మొత్తాలను పెంచుకోవాలన్న లక్ష్యాలతో కొన్ని సంస్థలు నిబంధనల్ని గాలికొదిలేస్తున్నాయి. కొద్ది నెలల క్రితం ప్రముఖ సంస్థ IIFL విషయంలో అలాంటి అవకతవకల్నే ఆర్బీఐ గుర్తించింది. వెంటనే ఆ సంస్థ గోల్డ్ లోన్ వ్యాపారంపై నిషేధం విధించింది కూడా.

మరిన్ని ప్రీమియం కథనాల కోసం…TV9 News యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.