AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: మోటార్లకు మీటర్లతో రైతులకు నష్టం లేదు.. ప్రతిపక్షాలది అవగాహనా రాహిత్యం.. ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కీలక వ్యాఖ్యలు

తెలంగాణ రాజకీయం అంతా మోటార్లకు మీటర్ల చుట్టూ తిరుగుతున్న వేళ.. ఏపీలో మాత్రం వ్యవసాయ మోటార్లకు మీటర్లతో ప్రభుత్వ ఆదాయం ఆదా అవుతుందని రాష్ట్ర విద్యుత్తు శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆసక్తికర..

Andhra Pradesh: మోటార్లకు మీటర్లతో రైతులకు నష్టం లేదు.. ప్రతిపక్షాలది అవగాహనా రాహిత్యం.. ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కీలక వ్యాఖ్యలు
Ap Minister Peddireddy Ramachandra Reddy
Amarnadh Daneti
|

Updated on: Sep 29, 2022 | 4:17 PM

Share

తెలంగాణ రాజకీయం అంతా మోటార్లకు మీటర్ల చుట్టూ తిరుగుతున్న వేళ.. ఏపీలో మాత్రం వ్యవసాయ మోటార్లకు మీటర్లతో ప్రభుత్వ ఆదాయం ఆదా అవుతుందని రాష్ట్ర విద్యుత్తు శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేంద్రప్రభుత్వం వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెట్టమంటుందని, దీని ద్వారా రైతులు తీవ్రంగా నష్టపోతారని తెలంగాణ సీఏం కేసీఆర్ ప్రతి సమావేశంలో చెబుతూ వస్తున్నారు. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కేంద్రప్రభుత్వ ఆదేశాలను పాటిస్తోందంటూ విమర్శిస్తూ వస్తున్నారు. అయితే తాజాగా ఏపీ విద్యుత్తు శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. వ్యవసాయ మోటార్లకు మీటర్లపై కీలక వ్యాఖ్యలు చేశారు. వ్యవసాయానికి నాణ్యమైన ఉచిత విద్యుత్ అందించటమే తమ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకూ 41 వేల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఇచ్చామని, త్వరలో మరో 77వేల కనెక్షన్ లను ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.

2023 మార్చి నాటికి వందశాతం వ్యవసాయ విద్యుత్తు మోటర్లకు స్మార్ట్ మీటర్లు బిగిస్తామని రాష్ట్ర విద్యుత్తు శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. విద్యుత్ సబ్సిడీ మొత్తాన్ని నేరుగా రైతుల ఖాతాకే ప్రభుత్వం జమ చేస్తుందన్నారు. ఇప్పటికే 70 శాతం మంది రైతులు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (డిబిటి) కోసం ఖాతాలను తెరిచారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. స్మార్ట్ మీటర్ల వల్ల రైతులు నష్టపోయేది ఏమీ లేదని చెప్పారు. స్మార్ట్ మీటర్ల వల్ల 30 శాతం మేర సబ్సిడీ చెల్లింపులో ప్రభుత్వానికి ఆదా అవుతోందన్నారు. వ్యవసాయ మోటర్లకు మీటర్ల ఏర్పాటుకు సంబంధించి పైలట్ ప్రాజెక్టుగా అమలు చేసిన శ్రీకాకుళం జిల్లాలో ఈ విషయం నిరూపితం అయ్యిందన్నారు.

స్మార్ట్ మీటర్లపై మాట్లాడే ప్రతిపక్షాలు ఒకసారి శ్రీకాకుళం జిల్లాలో పర్యటించాలని మంత్రి కోరారు. చంద్రబాబుకు వంతపాడుతున్న జనసేన, కమ్యూనిస్టు నాయకులు రైతుల్లో లేనిపోని అపోహలు సృష్టిస్తున్నారన్నారు. స్మార్ట్ మీటర్లు పెట్టే వారి చేతులు నరకాలని అనడం దారుణమన్నారు. రాజకీయ స్వార్థం కోసం ప్రతిపక్ష పార్టీలు రైతులను అడ్డం పెట్టుకుంటున్నాయని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం చూడండి..