మత్స్యకారులకు గుడ్ న్యూస్.. నాలుగు ఫిషింగ్ హార్బర్లకు శంకుస్థాపన చేయనున్న సీఎం జగన్..
ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తున్నారు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈ నేపథ్యంలోనే మత్స్యకారుల కోసం...

Fishing Harbors: ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తున్నారు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈ నేపథ్యంలోనే మత్స్యకారుల కోసం బృహత్తర ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టనున్నారు. ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా ఈ రోజు నాలుగు ఫిషింగ్ హార్బర్లకు సీఎం జగన్ శంకుస్థాపన చేయనున్నారు.
తొలిదశలో భాగంగా నెల్లూరు జిల్లాలోని జువ్వలదిన్నె, తూర్పుగోదావరి జిల్లాలోని ఉప్పాడ, గుంటూరు జిల్లా నిజాంపట్నం, కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఫిషింగ్ హార్బర్లను రాష్ట్ర ప్రభుత్వం నిర్మించనుంది. వీటికి వర్చువల్ విధానంలో సీఎం జగన్ శంకుస్థాపన చేయనున్నారు. ఈ హార్బర్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ. 1,510 కోట్లు ఖర్చు చేయనుంది.
కాగా, ఈ నాలుగు ఫిషింగ్ హార్బర్లకు సంబంధించిన టెండర్లను డిసెంబర్ రెండో వారంలో ఖరారు చేసి.. రెండేళ్లలోగా అందుబాటులో తెచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇక రెండో దశలో భాగంగా శ్రీకాకుళం జిల్లాలోని బుడగట్లపాలెం, విశాఖ జిల్లా పూడిమడక, పశ్చిమ గోదావరి జిల్లా బియ్యపుతిప్ప, ప్రకాశం జిల్లా కొత్తపట్నంలో మరో నాలుగు ఫిషింగ్ హార్బర్లు ఏర్పాటు కానున్నాయి. మొత్తం ఈ 8 ఫిషింగ్ హార్బర్లకు సుమారు రూ. 3 వేల కోట్లను రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించనుంది.