ఆర్థికంగా చితికిపోయినా రాష్ట్రాన్ని ఆదుకోండి.. ఆర్థిక సంఘానికి ఏపీ సీఎం విజ్ఞప్తి
ఆంధ్రప్రదేశ్‌కు అండగా.. అభివృద్ధికి ఊతమిచ్చేలా సాయం చేయాలని ఆర్థిక సంఘానికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేశారు. 10 నెలలుగా తీసుకున్న చర్యలు.. అమలు చేసిన విధానాలను వివరించారు. అలాగే రాజధాని విషయంలో ప్రభుత్వ ఆలోచనలను వివరిస్తూ వీడియో ప్రదర్శించారు.

ఆంధ్రప్రదేశ్‌కు అండగా.. అభివృద్ధికి ఊతమిచ్చేలా సాయం చేయాలని ఆర్థిక సంఘానికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేశారు. 10 నెలలుగా తీసుకున్న చర్యలు.. అమలు చేసిన విధానాలను వివరించారు. అలాగే రాజధాని విషయంలో ప్రభుత్వ ఆలోచనలను వివరిస్తూ వీడియో ప్రదర్శించారు.
ఆర్థికంగా చితికిపోయినా రాష్ట్రాన్ని ఆదుకోండి.. ఆంధ్రప్రదేశ్ పునర్‌నిర్మాణానికి అండగా నిలవాలని 16వ ఆర్థిక సంఘం సభ్యులను కోరారు ఏపీ సీఎం చంద్రబాబు. ఏపీని ప్రత్యేకంగా చూసి ఆర్థికంగా సాయం చేయాలన్నారు. స్వర్ణాంధ్ర 2047ప్రణాళికకు భరోసానివ్వాలని కోరారు. రాష్ట్ర ఆర్థికస్థితి, రెవెన్యూలోటు, కొత్త పాలసీలు.. అభివృద్ధిపై ఆర్థిక సంఘం సభ్యులకు చంద్రబాబు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. రాజధాని విషయంలో రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనలను వీడియో ద్వారా ప్రదర్శించి ఆర్థిక సంఘం బృందానికి వివరించారు సీఎం. రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాలు, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, పెట్టుబడులకు ఉన్న అనుకూలతలు, రాష్ట్ర ప్రభుత్వ పాలసీలు వివరించారు. అలాగే అమరావతి నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు, పోలవరం – బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టు లాంటి అంశాలపై ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు.
వేర్వేరు అంశాలపై ఆర్థిక సంఘం తమ అభిప్రాయాలు వివరించింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వాట్సప్ గవర్నెన్స్‌పై చైర్మన్‌తో పాటు కమిషన్ సభ్యులు ప్రశంసలు కురిపించారు. వాట్సప్ గవర్నెన్స్ విధానాన్ని ప్రధాని మోదీ దృష్టి తీసుకెళ్లారా అని సీఎంను అడిగారు ఆర్థిక సంఘం చైర్మన్ పనగరియా. ఇంకా లేదని.. వచ్చే నెలలో ప్రధానితో భేటీ సందర్భంగా ప్రాజెక్ట్‌పై వివరిస్తామన్నారు చంద్రబాబు. ప్రభుత్వ సేవలకు కార్యాలయాలకు వెళ్లే అవసరం లేకుండా ప్రతీ ఒక్కరూ వాట్సాప్ ద్వారా సేవలు పొందే పరిస్థితి తీసుకొస్తున్నామన్నారు చంద్రబాబు. రానున్న రోజుల్లో వెయ్యిరకాల సేవలు అందిస్తామన్నారు. ముఖ్యమంత్రి స్వయంగా ఆర్థిక అంశాలపై ప్రజెంటేషన్ ఇవ్వడం తమను ఆశ్చర్యపరిచిందన్నారు పనగారియా.
అంతకుముందు సీఎం చంద్రబాబుతో అరవింద్ పనగరియా నేతృత్వంలో 16వ ఆర్థిక సంఘం సభ్యులు భేటీ అయ్యారు. సచివాలయం మొదటి బ్లాక్ దగ్గర ఆర్థిక సంఘం సభ్యులకు సీఎం, మంత్రులు స్వాగతం పలికారు. దాదాపు 3 గంటలపాటు సాగిన సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, పలువురు మంత్రులు, సీఎస్ విజయానంద్ పాల్గొన్నారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా గురువారం తిరుపతిలో స్థానిక ప్రజాప్రతినిధులు, వ్యాపారులతో భేటీ అవుతారు 16వ ఆర్థికసంఘం సభ్యులు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..