Sunil Deodhar: ఏపీలో ఎక్కడ చూసినా గంజాయి మాఫియా.. ప్రభుత్వంపై విరుచుకుపడ్డ సునీల్ దేవ్‌ధర్
Sunil Deodhar: రావాలి జగన్, కావాలి జగన్ అని నినదిస్తే ఇప్పుడు రాష్ట్రంలో గంజాయి మాఫియా, ఎర్రచందనం మాఫియా వచ్చిందని బీజేపీ జాతీయ కార్యదర్శి సునీల్..
Sunil Deodhar: రావాలి జగన్.. కావాలి జగన్ అని నినదిస్తే ఇప్పుడు రాష్ట్రంలో గంజాయి మాఫియా, ఎర్రచందనం మాఫియా వచ్చిందని ఆంధ్రప్రదేశ్ బీజేపీ కో-ఇన్‌చార్జ్ సునీల్ దేవ్‌ధర్ ఆరోపించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో బీజేపీ నిర్వహించిన ప్రజాపోరు యాత్రలో సునీల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. దేశంలో ఎక్కడ గంజాయి దొరికినా దాని మూలాలు ఏపీలో ఉంటున్నాయని విమర్శించారు. సత్యసాయి జిల్లాలో ఏ మాత్రం మౌలికసదుపాయలు కల్పించకుండా సత్యసాయి ట్రస్ట్ ఆస్తులను వాడుకుంటున్నారని విమర్శించారు. అంతర్జాతీయ ఖ్యాతిగాంచిన పుట్టపర్తిలో ఇప్పుడు జిందాబాద్, ముర్దాబాద్ నినాదాలు వినిపిస్తున్నాయని ఆరోపించారు. ఏపీ ప్రభుత్వం హిందులకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు.
ప్రజలు జగన్ రావాలి అని నినదించారని, ఆయన వచ్చాక రాష్ట్రం మొత్తం మాఫియాగా తయారైందని మండిపడ్డారు. రాష్ట్రంలో ఎక్కడ చూసిన గంజాయి ఏరులై పారుతోందని, దీనిని నిర్మూలించడంలో జగన్ ప్రభుత్వం విఫలమైందని వ్యాఖ్యానించారు. అలాగే రాష్ట్రంలో ఎర్ర చందనం అక్రమ రవాణా పెరిగిపోయిందని, ఇలాంటి మాఫియాలను అరికట్టడంలో ప్రభుత్వం విఫలమవుతోందని ఆరోపించారు. రాష్ట్రానికి కేంద్ర సర్కార్ ఎన్నో నిధులు ఇచ్చిందని గుర్తు చేశారు. ఏపీలో ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్నామని గొప్పలు చెప్పుకొంటున్న ఏపీ సర్కార్.. చేసిందేమి లేదని దుయ్యబట్టారు.
అలాగే హిందూ సంఘాలపై దాడులు పెరిగిపోతున్నాయని, దాడుల సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైతే తీవ్ర పరిణామాలుంటాయన్నారు. రాష్ట్రంలో రోడ్లు ఆధ్వాన్నంగా మారాయని, రాయలసీమలో గత మూడేళ్లలో ఒక్క పెద్ద పరిశ్రమ కూడా ఏర్పాటు చేయలేదన్నారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి