Andhra Pradesh: టీడీపీ నేత చింతమనేని హౌస్ అరెస్టు.. అక్కడ గొడవలు జరగొచ్చు.. మీరు వెళ్లొద్దంటూ నోటీసులు..

ఏలూరు జిల్లాలో హైడ్రామా చోటుచేసుకుంది. తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. గుడివాడలో జరుగుతున్న అమరావతి రైతుల పాదయాత్రకి..

Andhra Pradesh: టీడీపీ నేత చింతమనేని హౌస్ అరెస్టు.. అక్కడ గొడవలు జరగొచ్చు.. మీరు వెళ్లొద్దంటూ నోటీసులు..
Chintamaneni Prabhakar
Follow us

|

Updated on: Sep 24, 2022 | 3:04 PM

Andhra Pradesh: ఏలూరు జిల్లాలో హైడ్రామా చోటుచేసుకుంది. తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. గుడివాడలో జరుగుతున్న అమరావతి రైతుల పాదయాత్రకి చింతమనేని ప్రభాకర్ వెళ్తారనే సమాచారంతో.. ఆసమావేశానికి వెళ్లొద్దంటూ పోలీసులు ముందస్తు నోటీసులు జారీచేశారు. తాను నోటీసులు స్వీకరించడంలేదంటూ చింతమనేని ప్రభాకర్ తిరస్కరించారు. దీంతో అక్కడ పొలిటికల్ వాతావరణం హీటెక్కింది. దీంతో చింతమనేని ప్రభాకర్ నివాసం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. సెప్టెంబర్ 24వ తేదీ శనివారం భీమవరంలో జరిగే ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ సమీక్షా సమావేశంలో పాల్గొనేందుకు సిద్ధమవుతుండగా పోలీసులు చింతమనేని ప్రభాకర్ ఇంటికి చేరుకుని నోటీసులు అందజేశారు. గుడివాడ లో జరుగుతున్న అమరావతి రైతుల పాదయాత్ర కి వెళ్తారనన్న సమాచారంతో అక్కడ గొడవలు జరిగే అవకాశం ఉందని, ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా చింతమనేని ప్రభాకర్ గుడివాడ వెళ్లొదంటూ పోలీసులు నోటీసులో పేర్కొన్నారు. పోలీసుల నోటీసులను రిజక్ట్ చేసి, తాను పార్టీ సమావేశానికి వెళ్లాల్సిందేనని భీష్మించుకు కూర్చుకున్నారు చింతమనేని ప్రభాకర్. దీంతో పోలీసులు ఆయనను గృహా నిర్భందం చేశారు. చింతమనేని ప్రభాకర్ ఇంటి వద్ద భారీగా మోహరించారు పోలీసులు.

మరోవైపు అమరావతి రైతులు చేపట్టిన మహాపాదయాత్ర 13వ రోజుకు చేరింది. కృష్ణా జిల్లా కౌతవరం నుంచి రైతులు ఇవాళ పాదయాత్ర ప్రారంభించారు. గుడ్లవల్లేరు, అంగలూరు మీదుగా సాగుతోన్న పాదయాత్రకు పోలీసులు అడుగడుగునా ఆంక్షలు విధిస్తుండడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలో కంకిపాడు మండలం దావులూరు టోల్‌గేట్‌ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. పాదయాత్రలో పాల్గొనేందుకు భారీగా తరలివెళ్తున్న రైతులు, తెలుగుదేశం పార్టీ అభిమానులు, కార్యకర్తలను టోల్‌గేట్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. గుడివాడ నియోజకవర్గానికి వచ్చే అన్ని రూట్లలో పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. ఇటు విజయవాడ నుంచి పామర్రు, గుడ్లవల్లేరు వరకు, మచిలీపట్నం నుంచి గుడివాడ రోడ్డు, విజయవాడ-గుడివాడ, గుడివాడ-ఏలూరు రహదారుల్లో భారీగా పోలీసులు మోహరించారు. దొండపాడు నుంచి వస్తున్న రైతులను గుడివాడ రోడ్డులో అడ్డుకున్న కంకిపాడు పోలీసులు.. కంకిపాడు పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

శాంతి భద్రతల దృష్ట్యా.. పాదయాత్రకు వెళ్తున్నామని చెప్పే వారిని వెళ్లవద్దంటూ అక్కడే నిలిపివేస్తున్నారు. మీడియా ప్రతినిధులను సైతం గుర్తింపు కార్డులుంటేనే పాదయాత్రకు వెళ్లడానికి అనుమతిస్తున్నారు. మరోవైపు గుడివాడ పట్టణంలో 30 పోలీస్ యాక్ట్ అమలు చేస్తున్నట్లు గుడివాడ వన్ టౌన్ పోలీసులు ప్రకటించారు. పాదయాత్రలో హైకోర్టు ఉత్తర్వులకు వ్యతిరేకంగా నడుచుకుంటే చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. అమరావతి పాదయాత్ర పేరుతో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు తప్పవంటూ పోలీసులు హెచ్చరిస్తున్నారు. కోర్టు ఆదేశాల ప్రకారం నిబంధనలు పాటిస్తూ పాదయాత్ర చేసుకోవాలని, ఎక్కడైనా నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరంగా చర్యలు తప్పవంటున్నారు. పోలీసులు తీరును తప్పుబడుతున్నారు రైతులు. తాము న్యాయస్థానం విధించిన నిబంధనలు పాటిస్తూనే పాదయాత్ర చేస్తున్నామని.. రూల్స్ ఉల్లంఘించడం లేదని, అయినా తమను పోలీసులు అనేక విధాలుగా వేధిస్తున్నారంటూ రైతులు ఆరోపిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

అమరావతి రైతులు చేపట్టిన మహాపాదయాత్రకు మాజీ మంత్రులు దేవినేని ఉమా మహేశ్వరరావు, కొల్లురవీంద్ర, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణరావు, తెదేపా నేత వర్ల కుమార్‌రాజా సంఘీభావం ప్రకటించారు. అంగలూరు వద్ద వారు రైతులతో కలిసి పాదయాత్రలో పాల్గొన్నారు. రైతులకు మద్దతు ఇచ్చేందుకు గుడివాడ వస్తున్న వారిని పోలీసులు అడ్డుకోవడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు టీడీపీ నాయకులు. అమరావతి రాజధానిని నాశనం చేయాలనుకోవడం ఎవరి తరం కాదని తెదేపా నేతలు తేల్చి చెప్పారు. పాదయాత్రలో పాల్గొనేందుకు జిల్లా నలుమూలల నుంచి రైతులు, తెదేపా నాయకులు వస్తుండడంతో ఏ క్షణాన ఏం జరుగుతుందోనని ఆందోళన నెలకొంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం చూడండి..