AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Train Accident: కంటకాపల్లి రైలు ప్రమాదానికి అసలు కారణం ఇదే.. ఆ రోజున ఏం జరిగిందంటే..

Andhra Pradesh Train Accident: ఆటోమేటిక్ సిగ్నల్ కావడంతో ముందు వెళ్తున్న పలాస ప్యాసింజర్ నెమ్మదిగా వెళ్తుండగా అదే ట్రాక్ పై వెనుక నుండి రాయగడ ప్యాసింజర్ కూడా సిగ్నల్స్ క్లియరెన్స్ ప్రకారం ముందుకు వస్తుంది. అలా కొంతసేపు ముందు పలాస ప్యాసింజర్, దాని వెనుక రెండు కిలో మీటర్ల దూరంలో రాయగడ ప్యాసింజర్ ఒకదాని వెనుక మరొకటి వెళ్తున్నాయి. రైళ్లు రెండు ప్రయాణిస్తున్న సమయంలో రెండు రైళ్ల మధ్య దూరం కేవలం రెండు కిలోమీటర్లు మాత్రమే ఉంది. అలా రెండు రైళ్లు ప్రయాణిస్తుండగా వెనుక ఉన్న రాయగడ ప్యాసింజర్ ఒక్కసారిగా..

AP Train Accident: కంటకాపల్లి రైలు ప్రమాదానికి అసలు కారణం ఇదే.. ఆ రోజున ఏం జరిగిందంటే..
Train Accident
Gamidi Koteswara Rao
| Edited By: Sanjay Kasula|

Updated on: Nov 01, 2023 | 10:02 AM

Share

విజయనగరం జిల్లా కంటకాపల్లిలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో 13 మంది మృతి చెందగా, సుమారు యాభై మంది వరకు తీవ్ర గాయాలు పాలయ్యారు. మృతుల మృతదేహాలను కుటుంబసభ్యులకు అప్పగించగా, ఇంకా ఇరవై మందికి పైగా క్షతగాత్రులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే జరిగిన రైలు ప్రమాద దుర్ఘటన పై కేంద్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ఘటనకు గల కారణాల పై పూర్తిస్థాయి దర్యాప్తుకు ఆదేశించింది కేంద్రం.

విశాఖ నుండి పలాస బయలుదేరిన పలాస ప్యాసింజర్ 6:39 నిమిషాల ప్రాంతంలో కంటకాపల్లి రైల్వే స్టేషన్ దాటి నెమ్మదిగా ముందుకు వెళ్తుంది. అలా ముందుకు వెళ్తున్న పలాస ప్యాసింజర్ కు ఆటోమేటిక్ రైల్వే సిగ్నల్ వ్యవస్థ క్లియరెన్స్ ఇస్తుంది. తనకు వచ్చిన క్లియరెన్స్ ప్రకారం పలాస ప్యాసింజర్ లోకో పైలట్ రైలును ముందుకు నడుపుతున్నాడు. అదే క్రమంలో సుమారు 12 నిమిషాల తరువాత విశాఖపట్నం నుండి రాయగడ వెళ్తున్న రాయగడ ప్యాసింజర్ కూడా కంటకాపల్లి నుండి అదే ట్రాక్ పై వస్తుంది.

ఆటోమేటిక్ సిగ్నల్ కావడంతో ముందు వెళ్తున్న పలాస ప్యాసింజర్ నెమ్మదిగా వెళ్తుండగా అదే ట్రాక్ పై వెనుక నుండి రాయగడ ప్యాసింజర్ కూడా సిగ్నల్స్ క్లియరెన్స్ ప్రకారం ముందుకు వస్తుంది. అలా కొంతసేపు ముందు పలాస ప్యాసింజర్, దాని వెనుక రెండు కిలో మీటర్ల దూరంలో రాయగడ ప్యాసింజర్ ఒకదాని వెనుక మరొకటి వెళ్తున్నాయి. రైళ్లు రెండు ప్రయాణిస్తున్న సమయంలో రెండు రైళ్ల మధ్య దూరం కేవలం రెండు కిలోమీటర్లు మాత్రమే ఉంది. అలా రెండు రైళ్లు ప్రయాణిస్తుండగా వెనుక ఉన్న రాయగడ ప్యాసింజర్ ఒక్కసారిగా వేగం పెంచి నెమ్మదిగా వెళ్తున్న పలాస ప్యాసింజర్ ను వెనుక నుండి బలంగా ఢీకొట్టింది.

దీంతో పలాస ప్యాసింజర్ లోనే జనరల్ బోగి, దాని వెనుక ఉన్న దివ్యాంగుల భోగి, దానికి అనుసంధానంగా ఉన్న గార్డ్ బోగి అక్కడికక్కడే బోల్తా పడి భారీ ప్రమాదానికి గురయ్యాయి. అదే నేపథ్యంలో పలాస ప్యాసింజర్ ను వెనుక నుండి ఢీకొన్న రాయగడ ప్యాసింజర్ ఇంజన్ తో పాటు డి4 భోగి కూడా పూర్తిగా ధ్వంసం అయ్యి ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో రాయగడ ప్యాసింజర్ లోకో పైలెట్ మధుసూదన్ రావు అక్కడికక్కడే మృతి చెందాడు. లోకో ఫైలెట్ మధుసూధనరావు మృతి చెందటంతో ప్రమాదానికి గల కారణాలు తెలియటం అధికారులకు కష్టంగా మారింది. అయితే ప్రధానంగా ప్రమాదానికి ఆటోమేటిక్ సిగ్నల్ వ్యవస్థే కారణమని అంటున్నారు నిపుణులు.

గతంలో ప్రస్తుతం అమలులో ఉన్న ఆటోమేటిక్ సిగ్నల్ వ్యవస్థ ఉండేది కాదు. ఒక ట్రాక్ పై రైలు ప్రయాణిస్తుండగా అందుబాటులో ఉన్న రైల్వే స్టేషన్ దాటే వరకు మరొక రైలును అదే ట్రాక్ పై ప్రయాణించేలా సిగ్నల్ క్లియరెన్స్ ఇచ్చేవారు కాదు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదని అంటున్నారు రైల్వే రిటైర్డ్ ఇంజనీర్స్. ఇప్పుడు ఆ పద్ధతి మార్చి ఒకే ట్రాక్ పై కేవలం రెండు కిలోమీటర్లు దూరంలో మరో రైలు ప్రయాణించేలా ఆటోమేటిక్ సిగ్నల్ సిస్టం ఏర్పాటు చేశారని, ప్రమాదవశాత్తు సాంకేతిక లోపం తలెత్తినా, ఫైలెట్ నిర్లక్ష్యం వ్యవహరించినా ఇలాంటి ప్రమాదాలు తప్పవని చెబుతున్నారు.

ప్రస్తుతం అమలులో ఉన్న ఆటోమేటిక్ సిగ్నల్ వ్యవస్థ వల్ల తరుచు ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని అంటున్నారు. ఇప్పుడు జరిగిన ఈ ఘటన కూడా ఈ రెండింటిలో ఏదో ఒక అంశం వల్ల జరిగిందేనని, ప్రమాదానికి కారణమైన రాయగడ ప్యాసింజర్ యొక్క లోకో ఫైలెట్ మృతి వల్ల అసలు కారణం తెలియడం లేదని, సమగ్ర దర్యాప్తు చేపట్టిన తరువాత వాస్తవాలు తెలిసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి