5

Andhra Pradesh: ఏపీలో భూములకు రెక్కలు.. హైవేలు, పరిశ్రమలు ఉన్న చోట పెరిగిన ధరలు..

మే నెల ముగిసింది. జూన్‌ మొదలైంది. చట్టం మారింది. ఇవాల్టి నుంచి భూముల ధరలు పెరుగుతాయి..అర్బన్‌ ఏరియాలు, కొన్ని రూరల్‌ సెంటర్లలో కూడా ధరలు పెంచేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కనీసం 29 నుంచి 31 శాతం ధర పెరగనుంది. కొత్త రేట్ల ప్రకారం రిజిస్ట్రేషన్లు జరపాలని ప్రభుత్వం ఆదేశించింది.

Andhra Pradesh: ఏపీలో భూములకు రెక్కలు.. హైవేలు, పరిశ్రమలు ఉన్న చోట పెరిగిన ధరలు..
Land Rates
Follow us

|

Updated on: May 31, 2023 | 10:15 PM

ఏపీలో భూములకు రెక్కలొచ్చాయి. ల్యాండ్ రేట్స్‌లో నిన్నటికి..నేటికీ చాలా తేడాలున్నాయి. ఒక్కరోజులోనే భారీ మార్పులొచ్చాయి. జూన్ ఒక‌టి నుంచి ఏపీలో ప‌లు ప్రాంతాల్లో భూముల ధరలు పెరుగుతున్నాయి. దీనికి సంబంధించి అన్ని జిల్లాల రిజిస్ట్రార్‌ల‌కు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేష‌న్స్ శాఖ ఆదేశాలు జారీ చేసింది. వాస్తవంగా ప్రతిఏటా అర్బన్‌ ప్రాంతాల్లో, రెండేళ్లకోసారి గ్రామీణ ప్రాంతాల్లో భూముల ధ‌ర‌లు పెంచాల్సి ఉంది. చివ‌రి సారిగా 2020 లో ప్రభుత్వం భూముల ధరలను పెంచింది.

ఆ తర్వాత..జిల్లాల పునర్వ్యవ‌స్థీక‌ర‌ణ జరగడంతో..గ‌తేడాది అర్బన్ ప్రాంతాల్లో రిజిస్ట్రేష‌న్ చార్జీలు పెంచారు. తాజాగా రిజిస్ట్రేష‌న్లు ఎక్కువ‌గా జ‌రుగుతున్న కొన్ని నగరాలు, గ్రామీణ ప్రాంతాల్లో ధ‌ర‌లు స‌వ‌రించారు. అయితే..ఎక్కడెక్కడ ఎంతెంత ధ‌ర‌లు పెంచాలన్న దానిపై ఆయా జిల్లాల జాయింట్ క‌లెక్టర్లు, రేట్లను ఫైనలైజ్‌ చేశారు. ఈ ధరల ప్రకారమే.. ఇవాల్టి నుంచీ రిజిస్ట్రేషన్లు జరుగుతాయి.

20 శాతం గ్రామీణ ప్రాంతాల్లో ధరల సవరణ

అయితే అన్ని రూరల్‌ ఏరియాల్లో కాకుండా.. రాష్ట్రంలోని కేవలం 20 శాతం గ్రామీణ ప్రాంతాల్లో మాత్రమే భూముల ధరలను మార్కెట్‌ విలువకు అనుగుణంగా సవరించినట్లు తెలుస్తోంది. ఒక్కో జిల్లాలోని కొన్ని మండలాల్లో మాత్రమే ధరలు పెరగనున్నాయి. ఎన్టీఆర్‌ జిల్లాలో కేవలం 7 మండలాల్లో మాత్రమే రేట్లు పెరుగుతున్నట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ సంపత్‌ కుమార్ చెప్పారు.

2318 ప్రాంతాల్లో మాత్రమే భూముల ధరల సవరణ

రాష్ట్రంలోని 298 రిజిస్ట్రార్ కార్యాల‌యాల ప‌రిధిలో ఉన్న 12 వేల 256 గ్రామాలు, అర్బన్‌ ఏరియాలు ఉండ‌గా వాటిలో 2318 ప్రాంతాల్లో మాత్రమే భూముల ధ‌ర‌ల‌ను స‌వ‌రించింది.

హైవేలు, పరిశ్రమలు ఉన్న చోట పెరిగిన ధరలు

ఈ మధ్యే నంద్యాల‌, క‌ర్నూలు, బాప‌ట్ల, అనంత‌పురం, కోనసీమ‌, న‌ర్సరావు పేట‌, మ‌న్యం జిల్లాల్లో రిజిస్ట్రేష‌న్లు బాగా పెరిగాయి. వీటితో పాటు కొత్తగా హైవేలు, ప‌రిశ్రమ‌లు ఏర్పడిన చోట..అభివృద్ధి ఎక్కువగా ఉన్న చోట్ల రేట్లు బాగా పెరిగాయి. ఇలాంటి ప్రాంతాల్లో మార్కెట్ విలువ‌ను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇవాల్టి నుంచీ జరిగే రిజిస్ట్రేషన్లు..పెంచిన ధరలతో జరుగుతాయి. అందువలే..మే నెలాఖరు వరకు రిజిస్ట్రర్‌ కార్యాలయాలు కిటకిటలాడాయి.. పాత రేట్లతో రిజిస్ట్రేషన్లు చేయించేందుకు జనం క్యూ కట్టారు. దీంతో సర్వర్లు కూడా లోడ్‌ తట్టుకోలేక మొరాయించాయి. ఇక మే నెల ముగిసింది. జూన్‌ మొదలైంది. కొత్త ధరలతో భూములకు రెక్కలొచ్చేసినట్లే..

స్పెషల్ రివిజన్ పేరిట విలువలు పెంచనున్నారు. గతేడాది కొత్త జిల్లాల ఏర్పాటు జరక్కముందే ఉమ్మడి జిల్లాలోని బాపట్ల, పల్నాడు, గుంటూరులో మార్కెట్ విలువలు పెంచారు. 2022 ఏప్రిల్ లో కొత్త జిల్లా కేంద్రాలు, వాటి చుట్టుపక్కల ప్రాంతాల్లో మార్కెట్ విలువలు పెంచారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం