Tirumala News: బీ కేర్ ఫుల్.. తిరుమలలో రెచ్చిపోతున్న దళారులు.. 2 నెలల్లో 45 మంది అరెస్ట్
TTD News: తిరుమలలో దళారులు రెచ్చిపోతున్నారు. భక్తుల దగ్గర అందినకాడికి దోచుకుంటున్నారు. దళారుల దగ్గర మోసిపోయినట్లు నిత్యం ఒకరిద్దరు భక్తులు ఫిర్యాదు చేస్తున్నారు.
TTD News: తిరుమలలో దళారులు రెచ్చిపోతున్నారు. భక్తుల దగ్గర అందినకాడికి దోచుకుంటున్నారు. దళారుల దగ్గర మోసిపోయినట్లు నిత్యం ఒకరిద్దరు భక్తులు ఫిర్యాదు చేస్తున్నారు. తిరుమలలో దళారుల బెడద పెరగడంతో తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) అధికారులు అప్రమత్తమయ్యింది. వారి ఆటకట్టించేందుకు విజిలెన్స్ సిబ్బంది, పోలీసులను రంగంలోకి దించింది. గత రెండు నెలల్లో దళారుల పై 25 కేసులు నమోదు చేయించినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. అలాగే భక్తులను మోసగిస్తున్న 45 మంది దళారులను అరెస్టు చేసారని టీటీడీ ఓ ప్రకటన విడుదల చేసింది.
కొందరు ప్రజాప్రతినిధుల నకిలీ సిఫార్సు లేఖలు, నకిలీ వెబ్ సైట్లు, ట్రావెల్ ఏజెన్సీల పేరుతో దళారులు భక్తులను మోసగిస్తున్నట్లు గుర్తించారు. అలా భక్తులను మోసగిస్తున్న దళారులపై టీటీడీ అధికారులు కేసులు నమోదు చేయించారు. అధికారిక వెబ్ సైట్ లో మాత్రమే స్వామివారి దర్శనం టిక్కెట్లు బుక్ చేసుకోవాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. దళారుల వలలో పడి మోసపోకుండా భక్తులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. స్వామివారి దర్శనాలు, ఆర్జిత సేవలు, గదుల బుకింగ్, లడ్డూల కోసం ఎట్టిపరిస్థితిలోనూ దళారులను ఆశ్రయించవద్దని సూచిస్తున్నారు. సరైన పద్ధతిలో ఈ సేవలను బుకింగ్ చేసుకోవాలని.. ఆన్‌లైన్‌లో లభిస్తున్న సేవలను వినియోగించుకోవాలని సూచిస్తున్నారు.
తిరుమలకు సంబంధించిన మరిన్ని వార్తావిశేషాలు..
తిరుమల హుండీ ఆదాయం రూ.1.86 కోట్లు..
తిరుమలలో నిన్న (శనివారం) స్వామివారిని 23,239 మంది భక్తులు దర్శించుకున్నారు. 10,708 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించుకున్నారు. నిన్న స్వామివారికి రూ.1.86 కోట్ల హుండీ ఆదాయం వచ్చినట్లు టీటీడీ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.
తిరుమల శ్రీవారి సేవలో ప్రముఖులు
ఇవాళ ఆదివారం పలువురు ప్రముఖులు వీఐపీ బ్రేక్ సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. స్వామివారిని దర్శించుకున్న వారిలో ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి, మంత్రి శంకర్ నారాయణ, డీఆర్డీవో చైర్మన్ సతీష్ రెడ్డి, శివసేన పార్టీ ప్రధాన కార్యదర్శి మిలింద్ నర్వేకర్, ఎంపీలు రామ్మోహన్ నాయుడు, మాగుంట శ్రీనివాసులు తదితరులు ఉన్నారు. స్వామివారి దర్శనం తర్వాత మంత్రి శంకర్ నారాయణ మాట్లాడుతూ.. సుపరిపాలన అందిస్తున్న ఏపీ సీఎం జగన్ కు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని శ్రీవారిని ప్రార్థించినట్లు చెప్పారు. రాష్ట్రంలో పది కాలాల పాటు సంక్షేమ, అభివృద్ధి రాజ్యం కోసం కృషి చేస్తున్న సీఎం జగన్‌ను ఆశీర్వదించాలని వేడుకున్నట్లు తెలిపారు.
తిరుమలలో బయో డిగ్రేడబుల్ కవర్లు
శ్రీవారిని దర్శించుకున్న డీఆర్డీఓ ఛైర్మన్ సతీష్ రెడ్డి..హైదరాబాద్ లోని మిస్సైల్స్ ప్రయోగశాలలో ఉపయోగించే టెక్నాలజీని ప్లాస్టిక్ కు ప్రత్యామ్నాయంగా తీసుకొచ్చామని తెలిపారు. ఈ టెక్నాలజీ ద్వారా తయారు చేసిన సంచులు మూడు నెలల తర్వాత వాతావరణంలో కలిసిపోతాయన్నారు. మొట్ట మొదటిసారిగా ఈ బయో డిగ్రేడబుల్ కవర్లను తిరుమలలో అందుబాటులోకి తీసుకొస్తున్నామని వెల్లడించారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి ఈ సంచులు ఎంతో దోహాదపడతాయన్నారు. ప్లాస్టిక్ సేవించే జంతువులకు హాని లేకుండా కాలుష్యం తగ్గిపోతుందన్నారు. రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా ఈ సంచులను వినియోగించేలా కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని డీఆర్డీఓ చైర్మన్ సతీష్ రెడ్డి వెల్లడించారు.
Also Read..
రక్షాబంధన్ రోజున మీ సోదరుల రాశి ప్రకారం ఈ రంగు రాఖీ కట్టండి.. పూర్తి వివరాలు మీకోసం..
హైదరాబాద్‌లో స్పోర్ట్స్ కార్ రేసింగ్.. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం.. పూర్తి వివరాలు మీకోసం..