Corona Virus: కోవిడ్ వ్యాక్సిన్ పట్ల అజాగ్రత్త, నిర్లక్ష్యంతో ప్రాణాలమీదకు తెచ్చుకోకండి.. కీలక సూచనలు చేసిన ఏపీ స్టేట్ నోడల్ ఆఫీసర్..

Corona Virus: కొంత నిర్లక్ష్యం, మరికొంత అవగాహనా లోపం.. కొవిడ్‌ రోగుల్లో తీవ్రతకు కారణమవుతోందని వైద్యనిపుణులు చెబుతున్నారు.

  • Shiva Prajapati
  • Publish Date - 8:01 am, Wed, 5 May 21
Corona Virus: కోవిడ్ వ్యాక్సిన్ పట్ల అజాగ్రత్త, నిర్లక్ష్యంతో ప్రాణాలమీదకు తెచ్చుకోకండి.. కీలక సూచనలు చేసిన ఏపీ స్టేట్ నోడల్ ఆఫీసర్..
Corona Spread

Corona Virus: కొంత నిర్లక్ష్యం, మరికొంత అవగాహనా లోపం.. కొవిడ్‌ రోగుల్లో తీవ్రతకు కారణమవుతోందని వైద్యనిపుణులు చెబుతున్నారు. అశాస్త్రీయ విధానాలు పాటిస్తూ ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్నేహితులు, సహచరులకు కొవిడ్‌ సోకినట్టు నిర్ధారణ కాగానే కొందరు టీకా కోసం పరుగులు తీస్తున్నారని, అయితే అప్పటికే వారిలో కొంతమంది వైరస్‌ బారిన పడినా లక్షణాలు కనిపించకపోవడంతో ఇలాంటి ఉపద్రవాలు ముంచుకొస్తున్నాయని వైద్యులు విశ్లేషిస్తున్నారు. అంతేకాదు.. టీకా వేసుకున్నాక లక్షణాలు కనిపించినా.. టీకా ప్రభావమనే భ్రమలో ఉంటూ గడిపేస్తున్నారని, అదికాస్తా తీవ్రమవడంతో ప్రాణాలకు మీదకు తెచ్చుకుంటున్నారని కోవిడ్-19 స్టేట్ నోడల్ ఆఫీసర్ డాక్టర్ అర్జా శ్రీకాంత్ ఆందోళన వ్యక్తం చేశారు.

వాస్తవానికి టీకా తీసుకున్నాక కొద్దిమందిలో జ్వరం, ఒళ్లునొప్పులు ఒకటి రెండ్రోజులు మాత్రమే ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. అయితే ప్రజలు మాత్రం టీకా తీసుకున్నాక వస్తున్న లక్షణాలు, కొవిడ్‌ లక్షణాలు ఒకటేనని భాస్తున్నారు. వ్యాక్సిన్ తీసుకోవడానికి ముందు ఏం చేయాలి? తీసుకున్న తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేదానిపై అవగాహన లేకపోవడంతో కొన్నిసార్లు పరిస్థితులు చేయిదాటిపోయి మరణాలకు దారితీసే అవకాశం ఉందని అంటున్నారు. ఈ పరిస్థితుల్లో ఇంటి వైద్యంతో కాలయాపన చేయకుండా వైద్యులను సంప్రదించాలని డాక్టర్ శ్రీకాంత్ సూచించారు. ఒకవేళ పూర్తిగా కోలుకున్నా.. నిర్దేశిత నిబంధనలకు అనుగుణంగా టీకా వేయించుకోవాలని సూచించారు.

పరీక్షా కేంద్రాల దగ్గర జాగ్రత్త చాలా అవసరం అని ప్రజలకు డాక్టర్ శ్రీకాంత్ సూచించారు. కోవిడ్ సోకిందనే అనుమానంతో పరీక్షా కేంద్రాలకు వస్తున్న వారు కొందరు వైరస్‌ బారినపడుతున్నారని వైద్యులు చెబుతున్నారు. టీకా కోసం వచ్చినపుడు గుంపులుగా చేరడం, మాస్క్‌ ధరించినా వాటిని కేవలం మూతి వరకే ఉంచుకోవడం, ఊపిరి ఆడటం లేదని ముక్కును మాస్క్‌తో కవర్ చేయకపోవడం, చిరిగిన మాస్క్‌లు ధరించడం వంటి తప్పిదాలతో.. మహమ్మారిని చేతులారా ఆహ్వానిస్తు్న్నారని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

ఇదిలాఉంటే.. కోవిడ్ నుంచి వ్యాక్సినేషన్ కేంద్రాల దగ్గర జాగ్రత్తగా ఉండాలని ప్రజలను అధికారులు హెచ్చరిస్తున్నారు. అప్పటి వరకు ఎలాంటి కోవిడ్ లక్షణాలు లేకపోయినా.. వ్యాక్సినేషన్ కేంద్రానికి వెళ్లినపుడు అక్కడ కూడా కోవిడ్ సోకే ప్రమాదం ఉందని, కావట్టి వ్యాక్సిన్ కోసం లైన్లో నిలుచున్నపుడు భౌతిక దూరం పాటించాలని సూచిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మాస్కును తీయకూడదని వార్నింగ్ ఇస్తున్నారు. వ్యాక్సిన్ కేంద్రంలో ఉన్నప్పుడు, మీ చుట్టూ ఉన్న వస్తువులను లేదా ఇతర వ్యక్తులను తాకవద్దని హెచ్చరిస్తున్నారు.

ఇక వ్యాక్సిన్ వేయించుకున్నాం కదా.. జ్వరం సాధారణమే అని, ఒకటి,రెండు రోజుల్లో తగ్గిపోతుందని భావించడం సరికాదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. వ్యాక్సిన్ మొదటి డోసు తీసుకున్న తర్వాత నిర్దేశిత సమయానికి రెండో డోసు తీసుకోవాలని స్పష్టం చేస్తున్నారు. ఆ తర్వాత 14 రోజులకు శరీరంలో యాంటీబాడీలు వృద్ధి చెందుతాయని, ఈ లోపు కరోనా లక్షణాలు కనిపిస్తే పరీక్షలు చేయించుకోవాల్సిందేనని స్పష్టం చేస్తున్నారు. కొందరిలో మొదటి డోసు వేసుకున్నాక స్వల్ప జ్వరం, ఒళ్లు నొప్పులు లాంటి లక్షణాలు కనిపిస్తాయన్నారు. అలాంటి లక్షణాలు ఉంటే.. పారాసిటమాల్ వేసుకుంటే తగ్గిపోతుందని చెప్పారు. ఒకవేళ జ్వరం తగ్గకుండా దగ్గు, ఆయాసం కూడా అనిపిస్తే వెంటనే అప్రమత్తం అవ్వాలని సూచించారు. అశ్రద్ధ చేస్తే ప్రాణాలకే ప్రమాదమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Also read:

Sonu Sood : కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలకు రియల్ హీరో సోనూసూద్ విజ్ఞప్తి… మద్దతు తెలిపిన గ్లోబల్ బ్యూటీ..

Petrol-Diesel Price Today: వాహనదారులకు షాక్.. మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. ఇవాళ ఇంధన ధరలు పెరిగాయంటే..