AP News: డైలీ ఆ రూట్లో కాపు కాస్తున్న పోలీసులు.. అదే మార్గంలో వచ్చిన ఇంటెలిజెన్స్ పోలీసులు.. కట్ చేస్తే..
ఖతర్నాక్ స్కెచ్ వేశారు. ఏళ్లుగా అదే దందా షురూ చేస్తున్నారు. పోలీసులమని చెప్తూ కోట్ల సొమ్ము దోచేశారు. కానీ అనూహ్య రీతిలో టాస్క్ ఫోర్స్ పోలీసులకు చిక్కారు.
వివిధ జిల్లాల్లో దాదాపు 89 కేసులు ఉన్న వాంటెండ్ స్మగ్లర్లను అరెస్టు చేసినట్లు తిరుపతి టాస్క్ ఫోర్సు ఎస్పీ కే.చక్రవర్తి తెలిపారు. వీరి నుంచి 31ఎర్రచందనం దుంగలు, ఆరు సెల్ ఫోన్లు, కారు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఆయన గురువారం విలేకరులతో మాట్లాడుతూ.. నిందితులు ఇద్దరూ కడప జల్లా చాపాడు మండలానికి చెందిన షేక్ చెంపతిలాల్ బాషా (36), షేక్ చంపతి జాకీయర్ (27)లుగా గుర్తించినట్లు తెలిపారు. వీరిద్దరూ సోదరులని, వీరు గత కొన్ని సంవత్సరాలుగా ఎర్రచందనం స్మగ్లింగ్ కు పాల్పడుతున్నట్లు వెల్లడించారు. వీరి కోసం చాలాకాలంగా గాలిస్తున్న పోలీసులు.. వ్యూహం పన్ని అరెస్టు చేసినట్లు తెలిపారు.
డీఐజీ సెంథిల్ కుమార్ ఆదేశాల మేరకు ఎస్పీ చక్రవర్తి ఆధ్వర్యంలో సీఐ రామకృష్ణ, ఆర్ఐ చిరంజీవులు టీమ్ ఏర్పేడు సమీపంలోని కృష్ణాపురం, మల్లెమడుగు, కరకంబాడి ప్రాంతాల్లో కూంబింగ్ చేపట్టారు. కరకంబాడి ఫారెస్ట్ సమీపంలో కారుతో ఈ ఇద్దరు నిందితులు కనిపించారు. అనుమానంతో వీరిని సమీపించడంతో పారిపోవడానికి ప్రయత్నించారు. ఆర్ఎస్ఐ రాఘవేంద్ర మరికొంతమంది పోలీసులు చుట్టుముట్టి పట్టుకోగలిగారు. వీరిని అంతర్రాష్ట్ర స్మగ్లర్లుగా గుర్తించారు. వీరి నుంచి 31ఎర్రచందనం దుంగలు, కారు స్వాధీనం చేసుకున్నారు. కారులో పోలీసు యూనిఫాంను కూడ కనుగొన్నారు. వీరు పోలీసు యూనిఫాం వేసుకుని స్మగ్లింగ్ కు పాల్పడుతున్నట్లు ఎస్పీ తెలిపారు.
వీరి తెలివి ఏంటంటే… ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తున్న వాహనాలను ఆపుతారు. తాము పోలీసులమని బెదిరించి.. ఆ వాహనాలను హైజాగ్ చేస్తారు. ఆపై ఇతర రాష్ట్రాలకు సరుకు తీసుకువెళ్లి అమ్మేవారు. ప్రయాస లేదు. బాగా ఏపుగా పెరిగిన, చావ ఉన్న దుంగలు.. ఏకంగా వాహనాల్లో తమ వద్దేకి వచ్చేవి. జస్ట్ పోలీసులం అని బెదిరించి.. సరుకు తీసుకెళ్లి.. హ్యాపీగా సొమ్ము చేసుకునేవారు. తాజాగా వారి వద్ద దొరికిన 31 ఎర్రచందనం దుంగల విలువ రూ.20 లక్షలు ఉంటుందని ఎస్పీ తెలిపారు. సమావేశంలో ఆర్ఐ సురేష్ కుమార్ రెడ్డి, సీఐలు చంద్రశేఖర్, బాలకృష్ణ, రామకృష్ణ, ఎఫ్ఆర్వోలు, ఎస్ఐ పాల్గొన్నారు. ఆపరేషన్‌లో పాల్గొన్న వారికి ఎస్పీ రివార్డులు ప్రకటించారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం..