AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chandrababu: మధ్యంతర బెయిల్‌పై చంద్రబాబు విడుదల.. అధికార, విపక్షాల మాటల తూటాలు

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు కొంత ఊరట లభించింది. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ స్కామ్‌లో అరెస్టై 52 రోజులుగా రాజమండ్రి జైల్లో ఉన్న చంద్రబాబుకు నాలుగు వారాల పాటు హైకోర్టు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది. ఆరోగ్య కారణాలు, కంటి ఆపరేషన్‌ను పరిగణనలోకి తీసుకుంటూ ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ఆయనకు మధ్యంతర బెయిలు మంజూరు చేసింది.

Chandrababu: మధ్యంతర బెయిల్‌పై చంద్రబాబు విడుదల.. అధికార, విపక్షాల మాటల తూటాలు
Chandrababu Naidu
Follow us
Balaraju Goud

|

Updated on: Oct 31, 2023 | 6:46 PM

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు కొంత ఊరట లభించింది. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ స్కామ్‌లో అరెస్టై 52 రోజులుగా రాజమండ్రి జైల్లో ఉన్న చంద్రబాబుకు నాలుగు వారాల పాటు హైకోర్టు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది. ఆరోగ్య కారణాలు, కంటి ఆపరేషన్‌ను పరిగణనలోకి తీసుకుంటూ ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ఆయనకు మధ్యంతర బెయిలు మంజూరు చేసింది. అక్టోబర్ 31 నుంచి నాలుగు వారాల పాటు ఆయనకు బెయిల్‌ మంజూరైంది.

దీంతో టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‍ వద్ద ఆ పార్టీ శ్రేణుల సంబరాలు జరుపుకున్నారు. ఈ సంబరాల్లో టీడీపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు జైలు నుంచి అడుగు బయటపెట్టిన క్షణం నుంచే జగన్ పతనం ప్రారంభమవుతుందని మండిపడ్డారు టీడీపీ నేతలు. చంద్రబాబు మీద వ్యక్తిగత కక్ష పెట్టుకుని, తప్పు లేకపోయినా కేసులు పెట్టారనే విషయం తెలుగు ప్రజలందరికీ తెలిసి పోయిందన్నారు. అక్రమ కేసులు పెట్టి, జైల్లో ఉంచి లబ్ధి పొందాలని జగన్ చూశారు. 45 ఏళ్ల రాజకీయ చరిత్రలో చంద్రబాబు చిన్న తప్పు కూడా చేయలేదన్నారు అచ్చెన్నాయుడు.

హైకోర్టు తీర్పుపై పలువురు నేతలు స్పందిస్తున్నారు. ఇదే క్రమంలో ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి కూడా మాట్లాడారు. కోర్టు తీర్పును స్వాగతిస్తున్నట్లు తెలిపారు. చంద్రబాబును అరెస్ట్ చేసిన విధానాన్ని తాము ముందే తప్పు పట్టామన్నారు పురందేశ్వరి. నోటీసులివ్వకుండా.. విచారణ జరపకుండా అరెస్ట్ చేసిన విధానం సమర్ధనీయం కాదన్నారు. ఎఫ్ఐఆరులో పేరు లేకుండానే అరెస్ట్ చేసిన విధానం కూడా కరెక్ట్ కాదన్నారు. చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ రావడం మంచిదేనని పురందేశ్వరి తెలిపారు…

హైకోర్టు మధ్యంతర బెయిల్‌ లభించడం సంతోషకరం అన్నారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో..మళ్ళీ ప్రజా సేవకు పునరంకితం కావాలని ఆకాంక్షిస్తున్నానని అన్నారు. ఆయన అనుభవం ఈ రాష్ట్రానికి ఎంతో అవసరమన్న పవన్ కళ్యాణ్.. చంద్రబాబు విడుదల కోసం కోట్లాది మంది ఎదురు చూస్తున్నారన్నారు.

అయితే బాబుకు బెయిల్ లభించడంపై అధికార పార్టీ వైసీపీ నేతలు స్పందించారు. చంద్రబాబు బెయిల్‌పై విడుదలైతే.. టీడీపీ నిజం గెలిచిందంటూ హడావుడి చేస్తుందని మండిపడ్డారు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. విజయోత్సవాలతో ప్రజలకు ఏం మెసేజ్‌ ఇస్తున్నారని ప్రశ్నించారు. ప్రజల్లోకి రాంగ్‌మెసేజ్ వెళ్లకుండా రాజకీయంగా తమ పోరాటం ఉంటుందని స్పష్టం చేశారు.

రాష్ట్ర మంత్రి అంబటి రాంబాబు ఇదే రీతిలో స్పందించారు. గెలిచింది న్యాయం, ధర్మం, సత్యం కాదు.. మరో కంటికి ఆపరేషన్.. కోసం మాత్రమే అన్నారు. చంద్రబాబుకు ఉన్న ఆరోగ్య సమస్యల నేపథ్యంలో, మరో కంటికి క్యాటరాక్ట్ ఆపరేషన్ చేయించుకోవాలనే విన్నపంతో, మానవతా దృక్పథంతో మాత్రమే.. హైకోర్టు చంద్రబాబుకు నాలుగు వారాలపాటు మధ్యంతర బెయిల్ ఇవ్వటం జరిగిందన్నారు. దీనికి, టీడీపీ నేతలు నానా హంగామా చేస్తున్నారని విమర్శించారు. నిజం గెలిచి చంద్రబాబు బయటకు రాలేదని టీడీపీ శ్రేణులు తెలుసుకోవాలన్నారు. స్కిల్ స్కాం కేసులో జ్యుడీషియరీ రిమాండ్ లో ఉన్న చంద్రబాబు బయటకు వెళితే.. సాక్ష్యులను తారుమారు చేయరు అనే ఉద్దేశంతో కూడా ఆయనకు బెయిల్ మంజూరు చేయలేదన్నారు అంబటి. ఇది ఒక తాత్కాలిక రిలీఫ్ మాత్రమే అన్నారు అంబటి.

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మధ్యంతర బెయిల్‌పై ఆంక్షలు విధించాలంటూ సీఐడీ ఏపీ హైకోర్టులో పిటీషిన్ దాఖలు చేసింది. ఇద్దరు సీఐడీ డీఎస్‌పీలను నిరంతరం టీడీపీ అధినేతను అనుసరించే విధంగా చూడాలని పిటిషన్‌లో పేర్కొంది. చంద్రబాబు రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనకూడదని ఆంక్షలు విధించాలన్నారు. మీడియాతో మాట్లాడటం, ఇంటర్వ్యూలు ఇవ్వడం చేయకూడదని కూడా పిటీషన్‌‌లో సీఐడీ పేర్కొంది. ఎటువంటి రాజకీయ కార్యకలాపాల్లో ఆయన పాల్గొనకూడదని ఆదేశాలు ఇవ్వాలని కోరింది. మధ్యంతర బెయిల్ అనారోగ్య కారణాల రీత్య ఇచ్చారని పేర్కొంటూ పిటీషన్ దాఖలు చేసింది. కేవలం చికిత్సకు మాత్రమే ఆయన పరిమితం కావాలని ఆదేశాలు ఇవ్వాలని ఏపీ హైకోర్టులో సీఐడీ పిటీషన్ వేసింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…