AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra: ఏపీలో కారుణ్య నియామకాలపై హైకోర్టు కీలక ఆదేశాలు

కారుణ్య నియామకాలకు కొత్త మార్గదర్శకాలు రూపొందించాలని ప్రభుత్వాన్ని ఏపీ హైకోర్టు ఆదేశించింది. రాష్ట్రంలో కారుణ్య నియామకాలు పెరిగిపోతుండటంపై కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. సరాసరి ఏడాదికి 2వేల చొప్పున కారుణ్య నియామకాలు చేస్తున్నారనీ ప్రభుత్వం ఏటా జరిపే రెగ్యులర్ నియామకాల కంటే.. కారుణ్య నియామకాలే ఎక్కువగా ఉన్నట్లు పేర్కొంది.

Andhra: ఏపీలో కారుణ్య నియామకాలపై హైకోర్టు కీలక ఆదేశాలు
High Court Of Andhra
Ram Naramaneni
|

Updated on: Apr 21, 2026 | 7:32 AM

Share

కారుణ్య నియామకాల విషయంలో AP హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. రాష్ట్ర విభజన జరిగాక వివిధ ప్రభుత్వ శాఖలు, కార్పొరేషన్లలో 20 వేల 801 కారుణ్య నియామకాలు జరగడంపై హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. వీరిలో కొంతమంది ఒకే కుటుంబం నుంచి మూడో తరానికి చెందినవారు ఉన్నారని స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఏటా జరిపే నియామకాలతో సమానంగా లేదా అంతకంటే ఎక్కువగా కారుణ్య నియామకాలే ఉన్నాయని.. ఎందరో యువత ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్నారని చెప్పింది.

కారుణ్య నియామకం విషయంలో మరణించిన ఉద్యోగి కుటుంబం ఆర్థికంగా బలంగా ఉందా లేదా అనే విషయాన్ని ప్రధానంగా చూడాలని సూచించింది. ఆ కుటుంబం ఆర్థిక వనరులు ప్రభుత్వం నిర్ణయించిన ప్రమాణాలకన్నా తక్కువగా ఉంటే వారికి ఉద్యోగానికి బదులు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని స్పష్టం చేసింది.

ఉద్యోగి మరణించడానికి ముందు ఎవరైతే ఆయన సంపాదనపై ఆధారపడి జీవిస్తారో వారే కారుణ్య నియామకానికి అర్హులు అని క్లారిటీ ఇచ్చింది. భార్య, కుమారుడు, కుమార్తె, తల్లిదండ్రులు మాత్రమే ఈ పరిధిలోకి వస్తారు. ఉద్యోగం పొందే ఉద్దేశంతో సోదరులు, అక్కాచెల్లెళ్లు, మేనల్లుళ్లు, మేనకోడళ్లు కూడా ఆధారపడి జీవించే వారిగా క్లెయిమ్‌ చేస్తున్నారని హైకోర్టు స్పష్టం చేసింది.

మరణించిన ఉద్యోగి చివరి జీతం, మిగిలి ఉన్న సర్వీసు కాలాన్ని పరిగణనలోకి తీసుకొని ఎక్స్‌గ్రేసియా లెక్కించాలి. ఒకవేళ కుటుంబంలోని అర్హులకు ఉద్యోగం ఇవ్వడం తప్పనిసరైతే శాశ్వత ఉద్యోగానికి బదులు ఔట్‌సోర్సింగ్‌ పద్ధతిలో తాత్కాలికంగా ఉపాధి కల్పించవచ్చని హైకోర్టు సూచించింది. కారుణ్య ప్రాతిపదికన రెగ్యులర్‌ ఉద్యోగం ఇవ్వడమనేది అత్యంత అరుదైన కేసుల్లో మాత్రమే జరగాలని.. ఇది పూర్తిగా ప్రభుత్వ విచక్షణకే వదిలేస్తున్నామని హైకోర్టు స్పష్టం చేసింది.

సుప్రీంకోర్టు తీర్పులకు అనుగుణంగా కారుణ్య నియామకాలకు సంబంధించి నూతన మార్గదర్శకాలు మూడు నెలల్లో రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

Follow Us