Breakfast: ఉదయం పూట పూరీ, వడ తింటున్నారా…? ఈ విషయాలు తెలిస్తే మీ మైండ్ బ్లాంకే..
ఉదయం పూట మనం తీసుకునే ఆహారమే రోజంతటికీ కావలసిన ఎనర్జీని ఇస్తుంది. అయితే మనం హెల్తీ అనుకుని చేసే కొన్ని పనులు.. ఉదాహరణకు ఫ్రూట్ జ్యూస్ తాగడం, బ్రెడ్ జామ్ తినడం వంటివి శరీరంలోని కీలక అవయవాలపై తీవ్రమైన అంతర్గత ప్రభావాలను చూపుతాయట. అలాగే ఒక ప్లేట్ పూరీ లేదా వడ తినడం వల్ల శరీరానికి ఎంతటి అదనపు కేలరీల భారం పడుతుందో తెలిస్తే మీరు షాక్ అవుతారు.

ఈ రోజుల్లో మారుతున్న జీవనశైలి, ఉదయాన్నే ఆఫీసుల హడావిడి, ఇంటి పనుల భారం వల్ల చాలా మంది అల్పాహారం తీసుకోకుండానే ఇల్లు దాటుతున్నారు. మరికొందరు నాలుకకు రుచినిచ్చే పూరీ, వడ, బ్రెడ్ జామ్ వంటి వాటితో కడుపు నింపేసుకుంటున్నారు. అయితే ఉదయం పూట సరైన బ్రేక్‌ఫాస్ట్ తీసుకోకపోవడం లేదా అనారోగ్యకరమైన ఆహారం తినడం వల్ల భవిష్యత్తులో తీవ్రమైన హెల్త్ ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాల్సి వస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మిమ్మల్ని అస్సలు డాక్టర్ దగ్గరకు వెళ్లాల్సిన అవసరం రానివ్వకుండా ఇంట్లోనే సంపూర్ణ ఆరోగ్యంగా ఉంచే కొన్ని ముఖ్యమైన బ్రేక్‌ఫాస్ట్ రూల్స్, కొన్ని షాకింగ్ నిజాలు ఇప్పుడు తెలుసుకుందాం.
పూరీ, వడ తింటున్నారా?
చాలా మంది ఉదయాన్నే టిఫిన్ సెంటర్లలో ఎగబడి తినే పూరీ, వడలలో కేలరీలు, శ్యాచురేటెడ్ ఫ్యాట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. సాధారణంగా ఒక ప్లేట్ పూరీ లేదా వడ తినడం వల్ల శరీరానికి దాదాపు 500 నుండి 600 అదనపు కేలరీలు చేరుతాయి. ఇవి నాలుకకు అద్భుతమైన రుచిని, మనసుకు తాత్కాలిక సంతృప్తిని ఇస్తాయి కానీ.. దీర్ఘకాలంలో విపరీతంగా బరువు పెరగడానికి, కొలెస్ట్రాల్ చేరడానికి, కడుపు సంబంధిత సమస్యలకు దారితీస్తాయి. అందుకే ఇలాంటి డీప్ ఫ్రైడ్ ఫుడ్స్‌కు ఉదయం పూట ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.
సంపూర్ణ ఆరోగ్యానికి సమతుల్య అల్పాహారం
ఆరోగ్యకరమైన జీవితానికి మనం తినే అల్పాహారం ఎప్పుడూ సమతుల్యంగా ఉండాలి. బ్రేక్‌ఫాస్ట్‌లో కేవలం కార్బోహైడ్రేట్లు మాత్రమే కాకుండా శరీరానికి అవసరమైన ప్రోటీన్, ఫైబర్, మంచి కొవ్వులు ఉండేలా ప్లాన్ చేసుకోవాలి. ఉదాహరణకు.. ఉదయం పూట ఆవిరిపై ఉడికే ఇడ్లీ లేదా తక్కువ నూనెతో వేసిన దోసతో పాటు.. రకరకాల కూరగాయలు, పప్పులతో చేసిన సాంబార్ తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన సంపూర్ణ పోషకాలు అందుతాయి.
బ్రెడ్-జామ్ తింటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ ప్రమాదం..
సమయం లేదని చాలా మంది ఇంట్లో బ్రెడ్ ముక్కలపై జామ్ రాసుకుని తినేస్తుంటారు. కానీ సరైన పోషకాలు లేని, కేవలం మైదా, చక్కెర వంటి అనవసరమైన కేలరీలతో నిండిన బ్రెడ్ జామ్ లేదా పిండి పదార్థాలు తినడం వల్ల శరీరంలో ఇన్సులిన్ నిరోధకత పెరుగుతుంది. ఇది బయటకు కేవలం బరువు పెరగడం లేదా పొట్ట రావడం లాగే కనిపించినప్పటికీ.. లోపల శరీరంలోని కీలక అవయవాలపై, హార్మోన్ల సమతుల్యతపై తీవ్రమైన అంతర్గత ప్రభావాలను చూపుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇది భవిష్యత్తులో మధుమేహం బారిన పడేలా చేస్తుంది.
జీర్ణక్రియకు అమృతం.. మజ్జిగ
మన జీర్ణక్రియను మెరుగుపరచడానికి, పేగు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రోబయోటిక్స్ చాలా అవసరం. అందుకే అల్పాహారం తిన్న ఒక గంట తర్వాత గానీ లేదా మధ్యాహ్న సమయంలో గానీ ఒక గ్లాసు స్వచ్ఛమైన మజ్జిగ తాగడం అలవాటు చేసుకోవాలి. దీనివల్ల శరీరానికి అవసరమైన ల్యాక్టోబాసిల్లస్ వంటి మంచి బ్యాక్టీరియా లభిస్తుంది. ఇది గ్యాస్, ఎసిడిటీ సమస్యలను తగ్గించడమే కాకుండా శరీర వేడిని అదుపులో ఉంచి రోజంతా మంచి ఎనర్జీని ఇస్తుంది.
ఫ్రూట్ జ్యూస్ తాగుతున్నారా?
చాలా మంది హెల్తీ అలవాటు అనుకుని ఉదయం పూట పండ్ల రసాలు తాగుతుంటారు. కానీ న్యూట్రిషన్ నిపుణుల ప్రకారం ఇది సరైన పద్ధతి కాదు. పండ్లను రసంగా మిక్సీ పట్టినప్పుడు, వాటిలో ఉండే అత్యంత కీలకమైన పీచుపదార్థం పూర్తిగా తొలగిపోతుంది. చివరకు అందులో కేవలం ఫ్రక్టోజ్ అనే సహజ చక్కెర మాత్రమే మిగులుతుంది. ఈ జ్యూస్ తాగినప్పుడు రక్తంలో షుగర్ లెవల్స్ ఒక్కసారిగా పెరుగుతాయి. అందువల్ల పండ్లను రసం రూపంలో కాకుండా ముక్కలుగా నమిలి తినడమే ఎల్లప్పుడూ శ్రేయస్కరం. అయితే మీ శరీర తత్వానికి అనుగుణంగా డైట్‌లో ఎలాంటి కొత్త మార్పులు చేయాలన్నా ఒకసారి ఫ్యామిలీ డాక్టర్‌ను సంప్రదించడం మంచిది.
