ఏపీ వార్డు, గ్రామ వాలంటీర్లకు ఉగాది కానుక… పనితీరును బట్టి సేవా పురస్కారాలు.. అవార్డుతో పాటు నగదు బహుమతి
ఆంధ్రప్రదేశ్ వార్డు, గ్రామ వాలంటీర్లకు శుభవార్త.. వాలంటీర్ల సేవలకు గుర్తింపుగా వారిని సత్కరించాలని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయించారు.
AP village volunteers : ఆంధ్రప్రదేశ్ వార్డు, గ్రామ వాలంటీర్లకు శుభవార్త.. వాలంటీర్ల సేవలకు గుర్తింపుగా వారిని సత్కరించాలని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయించారు. విధి నిర్వహణలో అత్యుత్తమ సేవలు అందించిన వాలంటీర్లకు రాష్ట్ర ప్రభుత్వ విశిష్ట సేవా పురస్కారాలు అందించనున్నట్లు ప్రకటించారు. ఇందులో భాగంగా మూడు విభాగాలుగా విభజించి అవార్డులు ప్రదానం చేయనున్నారు. సేవా మిత్ర, సేవా రత్న, సేవా వజ్ర పేరుతో అవార్డులిచ్చి గౌరవించాలని సీఎం వైఎస్ జగన్ సూచించారు. ఈ సందర్భంగా వాలంటీర్లకు ప్రశంసా పత్రం, మెడల్ తో పాటు బ్యాడ్జి, శాలువాలను ఇవ్వాలని నిర్ణయించారు. ఈ మేరకు అధికారులు ఎంపిక చేసిన ఓ జాబితాను సీఎం జగన్ పరిశీలించారు. రాష్ట్ర వ్యాప్తంగా మూడు కేటగిరీల్లో మొత్తం 2లక్షల 22వేల 900 మంది గ్రామ, వార్డు వాలంటీర్లకు అవార్డులు ప్రదానం చేయనున్నారు. ఈ ఏడాది ఉగాది నుంచి జిల్లాల్లో ప్రతిరోజూ ఒక నియోజకవర్గంలో వాలంటీర్ల అవార్డుల ప్రదానోత్సవాన్ని నిర్వహించనున్నారు.
ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2,22,900 మంది వాలంటీర్లను సత్కరించాలని నిర్ణయించిన ప్రభుత్వం.. 2,18,115 మందికి సేవా మిత్ర అవార్డుతో పాటు రూ.10వేల నగదు ప్రోత్సాహం అందిచనున్నారు. విధి నిర్వహణలో ఒక్క ఫిర్యాదు కూడా లేకుండా పనిచేసిన వారికి ఈ అవార్డు దక్కనుంది. పదమూడు జిల్లాలోని నియోజకవర్గాల సంఖ్య ఆధారంగా ప్రతి రోజూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఈ ఈవెంట్లలో మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొనాలని సీఎం జగన్ ఆదేశించారు. ఉగాది రోజున సీఎం వైఎస్ జగన్ ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో మూడు ప్రాంతాల్లో నిర్వహించే కార్యక్రమాలకు జగన్ హాజరయ్యే అవకాశముందని అధికార వర్గాలు పేర్కొన్నాయి.
ఇదిలావుంటే, 4 వేల మంది వాలంటీర్లకు రెండో కేటగిరీ అయిన సేవారత్న అవార్డుతో సత్కరిస్తారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ఇంటింటి సర్వే, రేషన్ డోర్ డెలివరీ, రైస్ కార్డులు, ఆరోగ్య శ్రీ కార్డులు మంజూరులో సమర్ధవంతంగా పనిచేసిన వారిని ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు సమాచారం. వీరి ఎంపికను ప్రభుత్వం ప్రాంతాల వారిగా చేపట్టింది. గ్రామీణ ప్రాంతాల్లో అయితే మండలానికి ఐదుగురు, మున్సిపాలిటీల్లో ఐదుగురు చొప్పున సేవా రత్న అవార్డుకు ఎంపిక చేశారు. ఈ అవార్డుకు ఎంపికైన వారికి మెడల్, శాలువ, బ్యాడ్జి, ప్రశంసా పత్రంతో పాటు రూ.20వేల నగదు బహుమతి అందించనున్నారు. ఇక మూడో కేటగిరీకి సంబంధించి సేవా వజ్ర అవార్డుకు 875 మందిని ఎంపిక చేశారు. వీరికి శాలువా, సర్టిఫికెట్, బ్యాడ్జి, మెడల్ తో పాటు రూ.30వేల నగదు బహుమతి ప్రదానం చేయనున్నారు. కాగా, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్ణయం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. సీఎంకు వాలంటీర్లు ప్రత్యేక ధన్యవాదాలు చెబుతున్నారు. ఉద్యోగం ఇచ్చి అదరించడంతో పాటు ప్రభుత్వం తరుపున ప్రత్యేక గుర్తింపు లభించడం సంతోషంగా ఉందని వాలంటీర్లు తెలిపారు.