Palnadu: మిర్చి పంట విరగకాసింది.. ఫుల్లు డబ్బులు అనుకునేరు.. లోనికి వెళ్తే కళ్లు తేలేస్తారు
గంజాయ్ బ్యాచ్‌లు చెలరేగిపోతున్నాయ్. పోలీసులు ఎన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నా గంజాయి సాగు, విక్రయాలు విచ్చలవిడిగా సాగిపోతున్నాయ్. ఇప్పటివరకు నగరాలు, పట్టణాలకే పరిమితమైన గంజాయి దందా ఇప్పుడు గ్రామాలకు కూడా విస్తరించింది.
ఏపీలో గంజాయి దందా రూటు మారుతోంది. నగరాలు, పట్టణాలను దాటుకుని ఇప్పుడు గ్రామాల్లోకి విస్తరిస్తోంది. ఏకంగా పంట పొలాల్లో గంజాయి సాగు చర్చనీయాంశంగా మారింది. తాజాగా పల్నాడు జిల్లాలో ఈ మాయదారి మత్తు పంట కలకలం రేపింది. గురజాల మండలం దైద గ్రామంలో గంజాయి సాగు చేస్తూ దొరికిపోయారు బాణావత్ అమరానాయక్, లావూరి శ్రీను నాయక్. కొంతకాలంగా వీరు మిరప చేలో గంజాయి పెంచుతున్నారని గ్రామంలో గుసగుసలు వినిపిస్తున్నాయి. తాజాగా సమాచారం పోలీసులు వద్దకు వెళ్లింది.
శనివారం పిడుగురాళ్ల స్పెషల్ ఎన్‌ఫోర్సుమెంట్ బ్యూరో సీఐ కొండారెడ్డి, గురజాల సెబ్ ఎస్సై జయరాం ఇతర స్టాఫ్‌తో కలిసి వారి పొలాల్లో ఆకస్మిక తనిఖీలు చేశారు. నిందితుల పొలాల్లో సుమారు 10 కేజీల గంజాయి మొక్కలు, 2 డ్రమ్ముల్లో నిల్వ ఉంచిన సుమారు 30 కేజీల డ్రై గంజాయిని సీజ్ చేశారు. వాటి విలువ రూ.3 లక్షల వరకు ఉంటుందని అధికారులు చెబుతున్నారు. నిందితులను సెబ్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అక్కడే సమీప ప్రాంతంలో మరో వ్యక్తి గంజాయి సేవిస్తుండగా.. అతడిని కూడా పట్టుకున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..