Andhra Pradesh: కలికాలం అంటే ఇదే.. జల్సాలు వద్దన్నందుకు తల్లినే చంపిన 13ఏళ్ల బాలిక.. స్నేహితులతో కలిసి..
చెడు వ్యసనాలకు బానిసైన ఓ మైనర్ బాలిక స్నేహితులతో కలిసి తన పెంపుడు తల్లిని హతమార్చిన సంఘటన ఆంధ్రప్రదేశ్‌లో కలకలం రేపింది. సంచలనంగా మారిన ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి కంబాలపేటలో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన షాకింగ్ విషయాలను డీఎస్పీ విజయ పాల్ మీడియాకు వెల్లడించారు.

రాజమండ్రి, అక్టోబర్ 22: చెడు వ్యసనాలకు బానిసైన ఓ మైనర్ బాలిక స్నేహితులతో కలిసి తన పెంపుడు తల్లిని హతమార్చిన సంఘటన ఆంధ్రప్రదేశ్‌లో కలకలం రేపింది. సంచలనంగా మారిన ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి కంబాలపేటలో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన షాకింగ్ విషయాలను డీఎస్పీ విజయ పాల్ మీడియాకు వెల్లడించారు. కంబాల పేటలో విశ్రాంత ఉపాధ్యాయురాలు సిద్ధాబత్తుల మార్గరేట్ జాలియాన నివాసముంటోంది. తన భర్త నాగేశ్వరరావు అనారోగ్యంతో ఇటీవలే మృతి చెందగా.. 13 ఏళ్ల తన పెంపుడు కుమార్తెతో కలిసి నివాసం ఉంటుంది. తన పెంపుడు కుమార్తెను అతి గారాబంగా పెంచడంతో ఆ బాలిక చెడు వ్యసనాలకు బానిసైంది. తన పుట్టినరోజు వేడుకలకు లక్షల్లో ఖర్చు చేసేది. అంతేకాకుండా 19 ఏళ్ల యువకుడితో ప్రేమాయణం, ప్రియుడి స్నేహితులతో కలిసి మద్యం సేవించడం వంటి చెడు వ్యసనాలకు బానిస అయ్యింది. ఈ క్రమంలో తన స్నేహితులు ఇచ్చిన సలహాతో తన పెంపుడు తల్లిని తొలగించుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుని.. ఆమెను చంపిందని పోలీసుల విచారణలో వెల్లడైనట్లు తెలిపారు.
ఈనెల 17వ తేదీన ఆమె తల్లి మార్గరేట్ కింద పడిపోయిందని.. విశ్రాంతి తీసుకుంటున్న క్రమంలో ఆమె 18వ తేదీ తెల్లవారుజామున అపస్మారక స్థితిలో ఉందంటూ జాలియాన మరిది అంజియాకు బాలిక ఫోన్ ద్వారా తెలిపింది. ఆయన హుటాహుటిన వచ్చి ఆసుపత్రికి తరలించాడు. అయితే, అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారని, ఈ వ్యవహారంపై అంజియనాకు అనుమానం వచ్చి మూడవ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
రంగంలోకి దిగిన పోలీసులు.. పలు కోణాల్లో దర్యాప్తును ప్రారంభించారు. ఈ సమయంలో బాలికను ప్రశ్నించారు. అయితే, బాలిక చెప్పిన మాటలకు, పంచనామాకు పొంతన లేకపోవడంతో ఆ బాలిక కదలికలపై నిఘా పెట్టారు. ఈ సమయంలో బాలిక అదే ప్రాంతానికి చెందిన గారా ఆకాష్ తో ప్రేమాయణం సాగిస్తుందని.. జాలియాన మృతి చెందినప్పటి నుండి ఆకాష్ తన ఇద్దరు స్నేహితులు కనిపించకపోవడంతో.. పోలీసులు అలర్ట్ అయ్యారు.
ప్రత్యేక బృందాలతో సీఐ ప్రసన్న వీరయ్య గౌడ్ దర్యాప్తు చేపట్టగా, ఈనెల 18వ తేదీన ప్రియుడు ఆకాశ్‌తో పాటు అయ్యప్పనగర్ కు చెందిన విపి అక్షయ్ కుమార్, ఆర్యాపురానికి చెందిన ధ్యాసం దినేష్ రాయ్ తో కలిసి జాలియానను ఊపిరాడకుండా చేసి హత్య చేసినట్లు నిర్ధారణ అయిందని డీఎస్పి తెలిపారు. అయితే, ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
తల్లి చనిపోతే ఆస్తులన్నీ తనకే చెందుతాయని ఆ బాలిక భావించిందని.. తనకు అడ్డు కూడా తొలగిపోతుందని తన ప్రియుడు ఆకాష్ తో కలిసి ఈ ఘోరానీకి పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలిందని తెలిపారు. తన తిరుగుళ్లకు అడ్డుపడుతుందన్న ఒక్క కారణంతోనే అల్లారు ముద్దుగా పెంచిన తల్లిని హత్య చేసిన విధానాన్ని వివరించిన ఆ బాలిక.. ఎటువంటి పశ్చాతాపం లేకుండా జరిగిన విషయం పోలీసులకు చెబుతుండడం సమాజ పోకడికి అర్థం పడుతుందని.. పలువురు చర్చించుకుంటున్నారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
