Andhra Pradesh: చిరకాల స్వప్నం నెరవేరబోతోంది.. సీఎం జగన్ కీలక కామెంట్స్..

బందరు పోర్టు చిరకాల స్వప్నం అని, అన్ని అనుమతులు తీసుకుని పోర్టు నిర్మాణ పనులు ప్రారంభించామని తెలిపారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. సోమవారం నాడు బందర్ పోర్టు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగించారు. బందరు పోర్టుకు.. రైల్వే లైన్లు, జాతీయ రహదారులను..

Andhra Pradesh: చిరకాల స్వప్నం నెరవేరబోతోంది.. సీఎం జగన్ కీలక కామెంట్స్..
Cm Ys Jagan
Follow us

|

Updated on: May 22, 2023 | 1:04 PM

బందరుతో సముద్ర వర్తకానికి వందల ఏళ్ల చరిత్ర ఉందన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. ముంబై, చెన్నై మాదిరిగా బందరు మహానగరంగా ఎదిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఏళ్లుగా నెరవేరని ఈ కల ఇప్పుడు నెరవేరుతోందన్నారు. ఆ పరిస్థితులన్నీ పూర్తిగా మారుస్తున్నామన్నారు. అన్ని కోర్టు కేసులను అధిగమించి, భూసేకరణ పూర్తిచేశామని, అన్ని అనుమతులు తీసుకొచ్చామని, ఫైనాన్షియల్‌ క్లోజర్‌ పూర్తిచేశామని తెలిపారు సీఎం.

రూ. 5156 కోట్లతో నాలుగు బెర్తులు రాబోతున్నాయని వెల్లడించారు సీఎం జగన్. 35 మిలియన్‌ టన్నుల కెపాసిటీతో పోర్టు స్టార్ట్‌ అవుతుందని చెప్పారు. ట్రాఫిక్‌ పెరిగే కొద్దీ.. 116 మిలియన్‌ టన్నుల కెపాసిటీ వరకూ విస్తరించుకునే అవకాశం ఉందన్నారు. పోర్టుకు కనెక్టివిటీ ఇన్‌ఫ్రాను కూడా నిర్మిస్తున్నామని చెప్పారు. 6.5 కిలోమీటర్ల దూరంలోని జాతీయ రహదారిని నిర్మిస్తున్నామని, 7.5 కిలోమీటర్ల గుడివాడ- మచిలీపట్నం రైలు మార్గాన్ని కనెక్టివిటీ చేస్తున్నామని వివరించారు. బందరు కాల్వనీటిని పైపులైను ద్వారా తీసుకు వచ్చి.. అనుసంధానం చేస్తున్నామని తెలిపారు సీఎం జగన్. అత్యంత మెరుగైన రవాణా వ్యవస్థకు పోర్టు మంచి ఆధారంగా ఉంటుందన్నారు.

కృష్ణా జిల్లా చరిత్రే మారనుంది..

బందర్ పోర్టు కారణంగా కృష్ణా జిల్లా చరిత్రే మారబోతోందన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. ఈ పోర్టు ఏపీ అభివృద్ధి చెందటమే కాకుండా.. ఇతర రాష్ట్రాలు కూడా లబ్ధిపొందుతాయన్నారు. మచిలీపట్నం పోర్టు వల్ల పొరుగు రాష్ట్రాలైన ఛత్తీస్‌గఢ్‌, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలకూ ఉపయోగం ఉంటుందన్నారు. పోర్టు ఆధారిత పరిశ్రమల వల్ల ఉద్యోగాలు, ఉపాధి లభిస్తాయని చెప్పారు.

ఇవి కూడా చదవండి

చంద్రబాబుపై విమర్శలు..

పోర్టు నిర్మాణానికి గతంలో అనేక అడ్డంకులు వచ్చాయని గుర్తు చేశారు సీఎం జగన్. పోర్టు ఇక్కడ రాకూడదని చంద్రబాబు విశ్వ ప్రయత్నాలు చేశారని ఆరోపించారు. 22 గ్రామాలు తీసుకోవాలని, 33వేల ఎకరాలు తీసుకోవాలని నోటిఫై చేసి.. రైతులు భూములను అమ్ముకునే స్వేచ్ఛలేకుండా చంద్రబాబు చేశారని ధ్వజమెత్తారు సీఎం. ఇలా చేస్తే పోర్టు అడగరని చంద్రబాబు ప్లాన్ వేశారని, కానీ, చివరకు ప్రజలే విజయం సాధించారని చెప్పుకొచ్చారు. ఇక్కడ పోర్టు ఏర్పాటు కాకుంటే.. అమరావతిలో తన బినామీగా పెట్టుకున్న భూములను విపరీతమైన ధరలకు అమ్ముకోవచ్చని తీరని ధ్రోహానికి పాల్పడ్డారంటూ చంద్రబాబుపై నిప్పులు చెరిగారు సీఎం జగన్.

పోర్టుకు సంబంధించిన రోడ్డు, రైలు మార్గాలకు కేవలం 250 ఎకరాలకు మాత్రమే తీసుకున్నామని, ప్రతి రైతు ముఖంలో చిరునవ్వులు చూడాలంటూ నానికి చెప్పానని సీఎం జగన్ తెలిపారు. రైతులందరి సమ్మతి, సంతోషంతో భూములు తీసుకుని మంచి పోర్టు నిర్మాణాన్ని ప్రారంభించామన్నారు సీఎం. ప్రభుత్వ భూముల్లో 4వేల ఎకరాల్లో ఆధారిత పరిశ్రమలు వచ్చేట్టుగా కార్యాచరణ చేస్తున్నామన్నారు. 24 నెలల్లోనే ఈ ప్రాంత రూపురేఖలు మారుతాయన్నారు. మచిలీపట్నంలో పెద్ద పెద్ద ఓడలు కనిపిస్తాయన్నారు.

మహా యజ్ఞానికి రాక్షసుల అడ్డు..

అమరావతి ప్రాంతంలో 50వేల మంది నిరుపేదలకు ఇళ్లపట్టాలు ఇచ్చి, ఇళ్లు నిర్మించి ఇచ్చే కార్యక్రమం చేపట్టామని, అయితే, ఆ మహా యజ్ఞానికి రాక్షసులు అడ్డు పడ్డారని విపక్ష నేతలనుద్దేశించి తీవ్ర విమర్శలు చేశారు సీఎం జగన్. టీడీపీకి తోడు గజదొంగల ముఠా అడ్డుపడుతోందన్నారు. దోచుకోవడం.. పంచుకోవడమే వీరి పని అని సీఎం విమర్శించారు. టీడీపీ, గజదొంగల ముఠాకు తోడు కొన్ని మీడియా సంస్థలు, దత్తపుత్రుడు కలిశాడంటూ పవన్‌ను ఉద్దేశించి విమర్శలు చేశారు జగన్. అమరావతిలో ప్రభుత్వ డబ్బుతో గేటెట్‌ కమ్యూనిటీ కట్టుకోవాలనుకున్నారని, బినామీల పేరుతో భూములు గడించి లక్షల కోట్లు దోచుకోవాలని ప్రయత్నించారని ఆరోపించారు. ఇందులో పేదల వర్గాలు కేవలం పాచి పనులు మాత్రమే చేయాలని వారి ఉద్దేశం అని వ్యాఖ్యానించారు. రోజువారీ పనులు చేసే కార్మికులు.. కార్మికులుగానే ఉండాలట అని విమర్శించారు. ఇంతకన్నా సామాజిక అన్యాయం ఎక్కడైనా జరుగుతుందా? అని ప్రశ్నించారు. పేదలకు వ్యతిరేకమైన రాక్షసులతో యుద్ధం చేస్తున్నామని, వారి వికృత ఆలోచనలకు మద్ధతు ఇద్దామా? అని ప్రజలను ప్రశ్నించారు సీఎం జగన్. పేదల జీవితాలు మారే విధంగా అండగా నిలబడాలన్నారు. ఈ నెల 26న అమరావతిలో ఇళ్ల పట్టాలు పంపిణీ తానే స్వయంగా చేస్తున్నానని ప్రకటించారు సీఎం జగన్.

పేదలంటే చంద్రబాబుకు చులకన..

పేద వారంటే చంద్రబాబుకు చులకన భావం ఉందని సీఎం జగన్ ఆరోపించారు. ఎస్సీల కులాల్లో పుట్టాలని ఎవరైనా అనుకుంటారా అంటూ చంద్రబాబు గతంలో చేసిన వ్యాఖ్యలను ఉటంకించారు సీఎం. అలాగే, బీసీల తోకలు కత్తిరించాలని అన్న కామెంట్స్ కూడా గుర్తు చేశారు. మూడు రాజధానులు వద్దు అంటూ అన్ని ప్రాంతాల అభివృద్ధిని చంద్రబాబు అడ్డగిస్తున్నారని విమర్శించారు జగన్. ఈ క్రమంలో ఆ మూడు ప్రాంతాలపై దాడి చేశారన్నారు. కనీసం ఒక్క సెంటైనా పేదలకు భూములు ఇవ్వని చంద్రబాబు.. ఇప్పుడు ఇస్తుంటే అడ్డు పడుతున్నారని ఆరోపించారు. అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తే.. సామాజిక సమతుల్యత దెబ్బ తింటుందని, సాక్షాత్తూ కోర్టులోనే కేసులు వేయించిన ఘనుడు చంద్రబాబు అంటూ ఆరోపించారు.

రూపం మార్చుకున్న అంటరాని తనానికి, నయా పెత్తందార్ల భావజాలానికి ప్రతీక ఈ చంద్రబాబు అంటూ ఘాటైన కామెంట్స్ చేశారు సీఎం జగన్. అమరావతి పరిధిలో ప్రతి పేదవాడికి 1.1 సెంటు భూమి ఇచ్చి, ఇల్లుకూడా ఉచితంగా కట్టించి ఇస్తుంటే.. ఈ పవిత్ర స్థలాన్ని చంద్రబాబు స్మశానంతో పోలుస్తాడంటూ తీవ్రంగా ఫఐర్ అయ్యారు. ఆయన అధికారంలో ఉన్నప్పుడు పేదలకకు ఒక్క సెంటు స్థలం కూడా ఇవ్వలేదని, ఇప్పుడు తాము ఇస్తుంటే వాటిని స్మశానంతో పోలుస్తున్నారంటూ ధ్వజమెత్తారు సీఎం జగన్.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..