Anandaiah Medicine: ఎన్నో వివాదాలు.. ఎన్నో అనుమానాలు.. నేటి నుంచి ఆనందయ్య మందు పంపిణీ
ఆనందయ్య మందు పంపిణీకి ఏర్పాట్లు పూర్తి అవుతూనే ఉన్నాయి. అయితే, ముందు చెప్పినట్టు కాకుండా తొలి రోజు కేవలం 2 వేల మందికే మందు పంపిణీ చేసేందుకు ఆనందయ్య సిద్ధమయ్యారు.
Anandaiah Medicine Distribution from today: వివాదాలు, అనుమానాలు ఎలా ఉన్నా….మందు పంపిణీకి ఏర్పాట్లు పూర్తి చేశారు. అయితే కండిషన్స్ మస్ట్ అంటున్నారు. అయినా ఆనందయ్య మందు పంపిణీకి ఏర్పాట్లు పూర్తి అవుతూనే ఉన్నాయి. అయితే, ముందు చెప్పినట్టు కాకుండా తొలి రోజు కేవలం 2 వేల మందికే మందు పంపిణీ చేసేందుకు ఆనందయ్య సిద్ధమయ్యారు. మరోవైపు చుక్కల మందు పంపిణీపై ఇవాళ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది..
కృష్ణపట్నం…టు…సర్వేపల్లి…వయా చంద్రగిరి. ఇది ఆనందయ్య మందు తయారు చేసే రూటు. యస్…కృష్ణపట్నంలో ఆనందయ్య తమ్ముడు నాగరాజు మందు తయారు చేసి పంపిణీ చేస్తున్నారు. సర్వేపల్లిలో స్వయంగా ఆనందయ్య…చంద్రగిరిలో కొడుకు శ్రీధర్ మందు తయారు చేసి పంపిణీకి సిద్ధమయ్యారు. అటు అమెరికాలో ఉన్న కుమారుడు కూడా మందు విస్తరణపై దృష్టిపెట్టినట్లు సమాచారం. మొత్తానికి ఆనందయ్య పసరు మందు లోకల్ టు గ్లోబల్ స్థాయికి విస్తరించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు అదే స్థాయిలో వివాదాలు చుట్టుముట్టాయి. ఇన్ని వివాదాలు మధ్య నాటు మందు పంపిణీ అయ్యేనా..? అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి.
ఎప్పుడా ఎప్పుడా అని తెలుగు రాష్ట్రాల ప్రజలతో పాటు దేశ వ్యాప్తంగా కొన్ని లక్షల మంది ఆనందయ్య మందు పంపిణీ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆ ఘడియలు రానే వచ్చాయి. అయితే అందరూ ఊహించినట్టు కాకుండా.. తొలి రోజు కేవలం పరిమిత సంఖ్యలోనే మందును పంపిణీ చేయనున్నారు. కనీసం 5 వేల మందికి పంపిణీ చేస్తారని ప్రచారం జరిగినా.. ఆ సంఖ్యను మరింత కుదించారు. తొలి రోజు కేవలం 2 వేల మందికి మాత్రమే మందు పంపిణీ చేయనున్నారు. ముందుగా సర్వేపల్లి నియోజకవర్గంలో ఉన్నవారికి మొదట మందు వేయాలని ఆనందయ్య కుటుంబసభ్యులు నిర్ణయించారు. ఇతర ప్రాంతాల వారు ఎవరినీ రానీయడం లేదు. ప్రస్తుతం మందు కావాలి అంటే సర్వేపల్లి నియోజకవర్గానికి చెందిన వారై ఉండాలి.ప్రస్తుతం కృష్ణపట్నంలో 144 సెక్షన్ కొనసాగుతోంది. ఆధార్ కార్డు పరిశీలించి తరువాత గ్రామంలోకి అనుమతిస్తున్నారు పోలీసులు. వాలంటీర్ల ద్వారా నియోజకవర్గంలోని ప్రతి ఇంటికీ.. మెడిసిన్ డోర్ డెలివరీ చేసేలా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.
ఇంతకీ ఆనందయ్యకు…ఆయన అనుచరులకు మధ్య చెడినట్లు కనిపిస్తోంది..? మందు పంపిణీకి బ్రేక్ పడిందని…ఎవ్వరూ కృష్ణపట్నం, సర్వేపల్లి రావొద్దని ఆయన అనుచరుడు సంపత్ ఖరాఖండిగా చెప్పేశారు. ప్రభుత్వ సహకారం లేనిదే మందు పంపిణీ చేయలేమంటున్నారు. మరోవైపు మందు పంపిణీకి బ్రేక్ పడలేదని…ఇవాళ్టి నుంచి పంపిణీ జరుగుతుందని ఆనందయ్య చెప్పారు. ముందుగా సర్వేపల్లిలో మందు పంపిణీ జరుగుతుందన్నారు. ఇతర జిల్లాల వారు కృష్ణపట్నం రావొద్దని సూచించారు. త్వరలో ఇతర జిల్లాలకు పంపిణీ చేస్తామని ఆనందయ్య తెలిపారు.
మరోవైపు తిరుపతిలో కూడా ఆనందయ్య పంపిణీకి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే మందు తయారీ ప్రక్రియ ప్రారంభమయింది. చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో తిరుపతిలోని నారాయణ గార్డెన్స్‌లో కరోనా ఆయుర్వేద మందును తయారు చేస్తున్నారు. మరో రెండు రోజుల్లో చంద్రగిరి నియోజకవర్గ ప్రజలందరికీ మందును పంపిణీ చేస్తామని ఎమ్మెల్యే చెవిరెడ్డి తెలిపారు. ఆనందయ్య కుమారుడు శ్రీధర్ మందు తయారీని పర్యవేక్షిస్తున్నారు. ఇవాళ సాయంత్రానికల్లా మందు తయారీ పూర్తవుతుందని చెబుతున్నారు. వనమూలికలు సేకరించేందుకు ఎమ్మెల్యే చెవిరెడ్డి తీవ్రంగా శ్రమించినట్టు తెలిపారు.
అటు…ఆనందయ్య మందుపై వివాదం ముదురుతోంది. సేశ్రిత టెక్నాలజీపై సోమిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆ సంస్థ ఎండీ నర్మదా రెడ్డి కృష్ణపట్నం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ కింద సోమిరెడ్డిపై చీటింగ్, ఫోర్జరీ, దొంగతనం కేసు నమోదు చేశారు పోలీసులు. తమ ప్రాజెక్ట్‌పై సోమిరెడ్డి చేసినవి తప్పుడు ఆరోపణలన్నారు నర్మదారెడ్డి. వెబ్‌సైట్ పూర్తి కాకుండానే సాఫ్ట్‌వేర్ చోరీ చేశారని ఆరోపించారు. కాకాణికి, తమ సంస్థకు ఎలాంటి సంబంధం లేదన్నారు నర్మదారెడ్డి.
మొత్తానికి సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్‌రెడ్డి, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి కేవలం తమ తమ నియోజకవర్గ ప్రజల కోసమే మందును తయారు చేయిస్తుండడంపైనా విమర్శలు వస్తున్నాయి. మందుకోసం ఎదురుచూస్తున్న మిగతా వారంతా ఏమైపోవాలని జనం ప్రశ్నిస్తున్నారు.
ఆనందయ్య మందు పంపిణీ ప్రారంభమవుతోందనే సమాచారంతో కొన్ని రోజుల ముందు నుంచి ఇతర జిల్లాల నుంచి భారీగా అక్కడికి చేరుకుంటున్నారు. ఇతరులను అక్కడకు రానివ్వడం లేదు. ఆధార్ కార్డులు ఉన్న వారిని మాత్రమే అనుమతిస్తున్నారు.. మరోవైపు భారీగా జనం గుమిగూడే అవకాశం ఉండడంతో 144 సెక్షన్ ను కొనసాగిస్తున్నారు పోలీసు అధికారులు.
ఇదిలావుంటే, ఆనందయ్య మందు కరోనా నుంచి కాపాడుతుందని అధికారికంగా ఎవరూ నిర్ధారించలేదు. కేవలం ఆనందయ్య మందు వల్ల ఎలాంటి హాని జరగదు అని మాత్రమే నివేదిక ఉంది. అయినా చాలామంది కరోనా రాకుండా ఉండేందుకు ఆనందయ్య మందు ఉపయోగపడుతుందని నమ్ముతున్నారు. ఇవాళ హైకోర్టులో ఆనందయ్య చుక్కల మందుపై విచారణ జరగనుంది. తన మందుకు ఇవాళ అనుమతి వస్తుందని ఆనందయ్య ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. Read Also…. Covid-19 Vaccine: నేటినుంచి ఢిల్లీ ఎయిమ్స్‌లో పిల్లలపై కోవ్యాక్సిన్ ట్రయల్స్..