Lakshmi Parvathi: తెలుగు అకాడమీ పేరు మార్పుపై నందమూరి లక్ష్మీపార్వతి స్ట్రాంగ్ రియాక్షన్
తెలుగు అకాడమీ పేరును ఎలా మారుస్తారంటూ జగన్ సర్కారుపై వస్తోన్న విమర్శలను 'తెలుగు-సంస్కృత అకాడమీ' చైర్ పర్సన్ లక్ష్మీపార్వతి..
Telugu Academy: తెలుగు అకాడమీ పేరును ఎలా మారుస్తారంటూ జగన్ సర్కారుపై వస్తోన్న విమర్శలను ‘తెలుగు-సంస్కృత అకాడమీ’ చైర్ పర్సన్ లక్ష్మీపార్వతి ఖండించారు. ‘తెలుగు-సంస్కృత అకాడమీ’ ఏర్పాటులో తప్పేంటని ఆమె ఏపీలోని విపక్షాల్ని నిలదీశారు. తెలుగు అకాడమీ పేరును తెలుగు – సంస్కృత అకాడమీగా.. విస్తరించడం వల్ల నష్టం ఏంటో విమర్శకులు వివరించాలి అని ఆమె డిమాండ్ చేశారు. తెలుగు భాషాభివృద్ధికి, దానితో పాటు సంస్కృత భాషాభివృద్ధికి కూడా సీఎం జగన్ ప్రభుత్వం చేస్తున్న కృషిని అభినందించాలని లక్ష్మీపార్వతి పేర్కొన్నారు.
అకారణమైన, నిర్హేతుకమైన విమర్శలను చేయవద్దని సవినియంగా మనవి చేస్తున్నానన్నారు లక్ష్మీపార్వతి. ఇలా ఉండగా, తెలుగు అకాడమీ పేరును తెలుగు-సంస్కృత అకాడమీగా మారుస్తూ ఉన్నత విద్యాశాఖ ఉత్తర్వులిచ్చిన సంగతి తెలిసిందే. అకాడమి పాలకవర్గంలో పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిని ఎక్స్ అఫీషియో సభ్యుడిగా నియమించింది.
ఉన్నత స్థాయిలో విద్యాబోధన వాహికగానూ, పాలనా భాషగా తెలుగును సుసంపన్నం చేయడానికిగాను 1968, ఆగస్టు 6న అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలుగు అకాడమిని స్థాపించింది. స్వతంత్ర ప్రతిపత్తి గల ఈ సంస్థ ప్రభుత్వ, పాలనా వ్యవహరాల్లో తెలుగు అమలయ్యేలా చూస్తుంది. ఉన్నత విద్య, తెలుగు సాహిత్యానికి సంబంధించిన పుస్తకాలను ప్రచురిస్తూ ఉంటుంది.