ఆ డబ్బులను తిరిగి తల్లులకు చెల్లించండి.. ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాలకు జగన్ లేఖ

ఆ డబ్బులను తిరిగి తల్లులకు చెల్లించండి.. ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాలకు జగన్ లేఖ

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రైవేట్ కాలేజీ యాజమాన్యలకు లేఖ రాశారు. పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ప్రభుత్వమే చెల్లించినందున తల్లిదండ్రుల నుంచి వసూలు చేసిన ట్యూషన్‌ ఫీజును తిరిగి తల్లుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని ఆయన ఆ లేఖలో సూచించారు. కరోనాతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తీవ్రంగా దెబ్బతిన్నప్పటికీ, పేద వర్గాల విద్యార్థుల మంచి చదువుల కోసం నవరత్న హామీల్లో భాగంగా పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అమలు చేస్తున్నామని ఆయన అన్నారు. “ప్రియమైన […]

TV9 Telugu Digital Desk

| Edited By:

May 07, 2020 | 7:05 AM

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రైవేట్ కాలేజీ యాజమాన్యలకు లేఖ రాశారు. పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ప్రభుత్వమే చెల్లించినందున తల్లిదండ్రుల నుంచి వసూలు చేసిన ట్యూషన్‌ ఫీజును తిరిగి తల్లుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని ఆయన ఆ లేఖలో సూచించారు. కరోనాతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తీవ్రంగా దెబ్బతిన్నప్పటికీ, పేద వర్గాల విద్యార్థుల మంచి చదువుల కోసం నవరత్న హామీల్లో భాగంగా పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అమలు చేస్తున్నామని ఆయన అన్నారు.

“ప్రియమైన మిత్రులారా.. నేను అధికారం చేపట్టిన సమయానికే రాష్ట్ర ఖజానా దాదాపు ఖాళీగా ఉంది. అదే సమయంలో వేల కోట్ల రూపాయల బిల్లుల బకాయిలు చెల్లించాల్సి వచ్చింది. తాజాగా కరోనాతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తీవ్రంగా దెబ్బతిన్నది మీరందరూ చూస్తూనే ఉన్నారు. అయినా ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ‘నవరత్నాల’ హామీల మేరకు మా ప్రభుత్వం విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు కట్టుబడి ఉంది. 2019–20 విద్యా సంవత్సరం నుంచి పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను ఆ సంవత్సరపు విద్యార్థులతో పాటు అంతకు ముందు నుంచి ఉన్న సీనియర్‌ విద్యార్థులకు కూడా అమలు చేస్తున్నాం.

వీరి కోసం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కింద రూ.4 వేల కోట్లు చెల్లించాం. అలాగే గత ప్రభుత్వం విడుదల చేయకుండా వదిలేసిన రూ.1,880 కోట్లు కూడా ఇప్పుడు విడుదల చేశాం. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కింద గత ప్రభుత్వం ప్రతి విద్యార్థికి కేవలం రూ.35 వేలకు మాత్రమే ఇచ్చేది. మిగిలిన ట్యూషన్‌ ఫీజు మొత్తాన్ని కాలేజీలు, విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి వసూలు చేసుకొనేవి. ఇప్పుడు మా ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ మొత్తాన్ని చెల్లిస్తోంది. అందుకే ఆయా తల్లిదండ్రుల నుంచి వసూలు చేసిన ట్యూషన్‌ ఫీజు మొత్తాన్ని తల్లుల బ్యాంకు అకౌంట్లలో జమ చేయాలని కాలేజీ యాజమాన్యాలను కోరుతున్నా.

ఉన్నత విద్యా సంస్థల్లో అత్యున్నత నాణ్యతా ప్రమాణాలను నెలకొల్పడానికి, అందుకు అనుగుణంగా విద్యా సంస్థలకు సహకారం అందించడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. అలాగే అనైతిక కార్యక్రమాలకు పాల్పడి, నిబంధనలు పాటించని కొన్ని విద్యా సంస్థలను ఏ మాత్రం ఉపేక్షించం. నిరుపేద వర్గాలకు నాణ్యమైన విద్యను అందించడమే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకం ప్రధాన లక్ష్యం. 2020–21 విద్యా సంవత్సరం మొదటి త్రైమాసికం నుంచి విద్యార్థుల బయోమెట్రిక్‌ హాజరు ఆధారంగా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను తల్లుల బ్యాంకు అకౌంట్లలోకి జమ చేస్తాం.

ప్రభుత్వం అందించిన ఆ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధులను తల్లిదండ్రులు కాలేజీలకు వచ్చి చెల్లిస్తారు. దీనివల్ల వారు తమ పిల్లలు చదువుతున్న కాలేజీలను ఏడాదిలో నాలుగుసార్లు సందర్శించనున్నారు. దాని వల్ల పిల్లల చదువుల పురోగతి ఎలా ఉందో పర్యవేక్షించే అవకాశం కలుగుతుంది. ఈ సందర్భంగా కాలేజీ యాజమాన్యాలన్నిటికీ ఓ విన్నపం చేస్తున్నా. మా ప్రభుత్వం ప్రతి క్వార్టర్‌కు సంబంధించిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధుల విడుదలకు కట్టుబడి ఉన్నందున.. ఇకపై విద్యార్థుల నుంచి ఎలాంటి ఫీజులు వసూలు చేయకుండా ప్రవేశాలు కల్పించాలని కోరుతున్నాను. నాలెడ్జ్‌ సొసైటీ నెలకొల్పే దిశగా నిబద్ధతతో మనమందరం కలిసి పని చేద్దాం” అని వైఎస్ జగన్ లేఖలో పేర్కొన్నారు.

Read This Story Also: విశాఖలో లీకైన వాయువు.. పలువురికి అస్వస్థత..!

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu