AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra: విన్నారా ఇది.. బీర్ అమ్మకాల్లో దక్షిణ భారతదేశంలోనే ఏపీ టాప్

దక్షిణ భారతదేశంలో మద్యం అమ్మకాల్లో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానానికి చేరింది. కొత్త ఎక్సైజ్ విధానాలు, అంతర్జాతీయ బ్రాండ్‌ల ప్రవేశం, నాణ్యమైన మద్యం అందుబాటు ధరకు లభించడం వల్ల విక్రయాల్లో గణనీయమైన వృద్ధి నమోదైంది. అయితే ఆదాయమే లక్ష్యంగా కాకుండా, అక్రమాల నియంత్రణ, పారదర్శకత, ఆరోగ్యకరమైన వృద్ధిపై దృష్టి పెట్టాలని సీఎం చంద్రబాబు అధికారులకు స్పష్టం చేశారు.

Andhra: విన్నారా ఇది..  బీర్ అమ్మకాల్లో దక్షిణ భారతదేశంలోనే ఏపీ టాప్
Beer
Eswar Chennupalli
| Edited By: |

Updated on: Dec 22, 2025 | 5:53 PM

Share

దక్షిణ భారతదేశంలో మద్యం అమ్మకాల్లో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానానికి చేరింది. అంతర్జాతీయ బ్రాండ్‌ల ప్రవేశం, నాణ్యమైన మద్యం అందుబాటు ధరకు లభించడం, కొత్త ఎక్సైజ్ విధానాల అమలు చేయడంతో.. రాష్ట్రంలో మద్యం విక్రయాలు భారీ పెరిగాయి. అదే సమయంలో ఆదాయమే లక్ష్యంగా కాకుండా, ఆరోగ్యకరమైన వృద్ధి, పారదర్శకత, అక్రమాల నియంత్రణపై ప్రభుత్వం స్పష్టమైన దిశానిర్దేశం చేయడం ఈ రంగానికి కొత్త రూపు తీసుకొస్తోంది. అక్టోబర్ 2024 నుంచి అక్టోబర్ 2025 వరకు రాష్ట్రం ఎక్సైజ్ ఆదాయంగా రూ.8,000 కోట్ల లక్ష్యాన్ని నిర్దేశించుకోగా, ఇప్పటివరకు రూ.7,041 కోట్ల ఆదాయం వచ్చినట్టు అధికారులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు వివరించారు.

ఏపీలో మద్యం అమ్మకాల్లో వృద్ధి

2025–26 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1 నుంచి డిసెంబర్ 17 వరకు మద్యం విక్రయాల్లో 4.52 శాతం వృద్ధి నమోదైంది. ఇందులో ఐఎంఎఫ్ఎల్ విక్రయాలు 19.08 శాతం, బీర్ విక్రయాలు 94.93 శాతం పెరగడం విశేషం. డిసెంబర్ 18 నుంచి వచ్చే ఏడాది మార్చి వరకు రూ.8,422 కోట్ల ఆదాయం వచ్చే అవకాశముందని అంచనా వేస్తున్నారు. మొత్తంగా ఈ ఆర్థిక సంవత్సరంలో 3 శాతం వృద్ధి సాధిస్తామని అధికారులు చెబుతున్నారు. దక్షిణ భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ అత్యధిక వృద్ధిని నమోదు చేయడం వెనుక విధానపరమైన మార్పులే ప్రధాన కారణమని అధికారులు విశ్లేషిస్తున్నారు. అంతర్జాతీయ బ్రాండ్‌లను తీసుకురావడం ద్వారా వినియోగదారులకు ఎంపిక పెరిగింది. నాణ్యతపై నమ్మకం పెరగడంతో అక్రమ మద్యం వైపు వెళ్లేవారి సంఖ్య తగ్గింది. బీర్ విక్రయాల్లో దాదాపు రెట్టింపు గ్రోత్ నమోదవడం రాష్ట్ర మార్కెట్ స్వభావం మారుతున్నదనడానికి సంకేతంగా కనిపిస్తోంది. అయితే అమ్మకాలు పెరిగినా, తలసరి వినియోగంలో ఆంధ్రప్రదేశ్ ఇంకా నియంత్రిత స్థాయిలోనే ఉందని ప్రభుత్వం స్పష్టం చేసింది.

తెలంగాణతో పోలిస్తే…

తెలంగాణలో తలసరి మద్యం వినియోగం 4.74 లీటర్లు ఉండగా, ఆంధ్రప్రదేశ్‌లో అది 2.77 లీటర్లుగానే ఉందని అధికారులు తెలిపారు. అంటే అమ్మకాల వృద్ధి మొత్తం వినియోగదారుల సంఖ్య పెరగడం, మార్కెట్ విస్తరణ వల్లే తప్ప, ఒక్కొక్కరి వినియోగం అధికంగా పెరగలేదన్నది ప్రభుత్వ వాదన. ఈ పరిణామాలపై సచివాలయంలో ప్రొహిబిషన్–ఎక్సైజ్ శాఖపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో మద్యం విధానాన్ని వ్యాపారంలా చూడకుండా, సమతుల్యమైన వృద్ధి సాధించేలా చూడాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఆదాయమే లక్ష్యంగా విధానాలు రూపొందించకూడదని, మద్యాన్ని కూడా ఒక ఉత్పత్తిగానే పరిగణించి నాణ్యత, భద్రత, పారదర్శకతకు ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం పేర్కొన్నారు. ప్రస్తుతం అమలులో ఉన్న లాటరీ విధానం ద్వారా షాపుల కేటాయింపు, అప్లికేషన్ ఫీజు, లిక్కర్ ఐడెంటిఫికేషన్ నెంబర్ (లిన్), రిటైలర్ మార్జిన్ పెంపు వంటి అంశాలపై మరింత కసరత్తు చేయాలని సూచించారు. బార్లపై విధిస్తున్న అడిషనల్ రిటెయిల్ ఎక్సైజ్ టాక్స్ మినహాయింపుపై కూడా పరిశీలించాలని ఆదేశించారు.

బెల్ట్ షాప్‌ల నియంత్రణ

అక్రమ మద్యం పూర్తిగా అరికట్టడం, బెల్టు షాపుల నియంత్రణ, డిజిటలైజేషన్, పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన సంస్కరణలను వేగంగా అమలు చేయాలని సీఎం తేల్చిచెప్పారు. డిజిటల్ చెల్లింపుల విషయంలోనూ రాష్ట్రం ముందంజలో ఉంది. మద్యం విక్రయాల్లో డిజిటల్ లావాదేవీలు 34.9 శాతం పెరిగాయని అధికారులు తెలిపారు. కొన్ని జిల్లాల్లో ఇది 40 నుంచి 47 శాతం వరకు చేరిందని వివరించారు. నగదు వినియోగాన్ని మరింత తగ్గించి డిజిటల్ చెల్లింపులు పెంచేందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సీఎం సూచించారు. ప్రతి మద్యం బాటిల్‌కు ప్రత్యేక లిన్ అమలు చేయడం ద్వారా నకిలీ మద్యం, అవకతవకలకు తావు లేకుండా చేయాలని చెప్పారు. బ్రాండ్, బ్యాచ్, తయారీ తేదీతో పాటు గంటలు, నిమిషాలు, సెకన్ల వరకు వివరాలు లిన్‌లో ఉండేలా రూపొందించాలని ఆదేశించారు. ప్రస్తుతం ఉపయోగిస్తున్న హోలోగ్రామ్ లేబుల్స్‌లో ఉన్న లోపాలను లిన్ ద్వారా సరిచేయవచ్చని సీఎం అభిప్రాయపడ్డారు.

బెల్టు షాపులపై కఠిన చర్యలకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. అనధికార విక్రయ కేంద్రాలుగా మారిన బెల్టు షాపులను పూర్తిస్థాయిలో కట్టడి చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఈ సమస్యను ఎదుర్కొనేందుకు హర్యానాలో అమలు చేస్తున్న సబ్ లీజు విధానాన్ని అధ్యయనం చేయాలని సూచించారు. గ్రామీణ, దూర ప్రాంతాల్లో అధికారిక షాపులు లేకపోవడమే బెల్టు షాపుల పెరుగుదలకు కారణమని అధికారులు సీఎంకు వివరించారు.

పర్యావరణ పరిరక్షణలో భాగంగా డిపాజిట్ రిటర్న్ స్కీమ్‌ను కూడా పరిశీలిస్తున్నారు. మద్యం వినియోగం అనంతరం బాటిల్ తిరిగి ఇస్తే నగదు ఇచ్చే విధానాన్ని అమలు చేస్తే, ప్లాస్టిక్, గ్లాస్ వ్యర్థాలు తగ్గడంతో పాటు పర్యావరణానికి మేలు జరుగుతుందని అధికారులు అభిప్రాయపడ్డారు. మొత్తానికి, అమ్మకాల పరంగా దక్షిణ భారతదేశంలో అగ్రస్థానానికి చేరిన ఆంధ్రప్రదేశ్, అదే సమయంలో నియంత్రణ, పారదర్శకత, ఆరోగ్యకరమైన వృద్ధి అనే లక్ష్యాలను ముందుకు తీసుకెళ్తోంది. ఆదాయం పెరగడం ఒక వైపు అయితే, అక్రమాల నియంత్రణ, వినియోగదారుల భద్రత, పర్యావరణ పరిరక్షణపై దృష్టి పెట్టడం మరో వైపు. ఈ సమతుల్య విధానమే రాష్ట్ర ఎక్సైజ్ రంగానికి కొత్త దిశను చూపుతోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.