Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SALT : రాష్ట్రంలో పాఠ‌శాల విద్య బ‌లోపేత‌మే ‘సాల్ట్‌’ ల‌క్ష్యం : మంత్రి ఆదిమూలపు సురేష్

రాష్ట్రంలో పాఠశాల విద్యను బలోపేతం చేసేందుకు 'ఆంధ్రప్రదేశ్ అభ్యసన పరివర్తన సహాయక పథకం' (SALT) అనే సరికొత్త పథకానికి ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని రాష్ట్ర..

SALT : రాష్ట్రంలో పాఠ‌శాల విద్య బ‌లోపేత‌మే  'సాల్ట్‌' ల‌క్ష్యం : మంత్రి ఆదిమూలపు సురేష్
Adimulapu Suresh
Follow us
Venkata Narayana

|

Updated on: Jun 26, 2021 | 8:09 PM

Adimulapu Suresh : రాష్ట్రంలో పాఠశాల విద్యను బలోపేతం చేసేందుకు ‘ఆంధ్రప్రదేశ్ అభ్యసన పరివర్తన సహాయక పథకం’ (SALT) అనే సరికొత్త పథకానికి ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. ప్రపంచ బ్యాంకు ఆర్థిక సహాయంతో ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు. శనివారం విద్యాశాఖ ఉన్నతాధికారులతో మంత్రి దీనికి సంబంధించి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఐదేళ్లు (2021-22 సంవత్సరం నుండి 2026-27 వరకు) కాల పరిమితి కలిగిన ఈ SALT పథకానికి అంతర్జాతీయ పునర్నిర్మాణ అభివృద్ధి బ్యాంకు (IBRD) 250 మిలియన్ అమెరికన్ డాలర్ల (1,860 కోట్ల రూపాయలు) ఆర్థిక సహాయం అందిస్తుందని మంత్రి అన్నారు. దీంతో రాబోయే ఐదేళ్లలో విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు జరుగుతాయన్నారు.

ఈ పథకం ద్వారా పునాది అభ్యసనాన్ని బలోపేతం చేయడం, ఉపాధ్యాయ-విద్యార్థుల పరస్పర సంబంధాలను, బోధనా నాణ్యతను మెరుగుపరచడం, సంస్థాగత సామర్థ్యాలను, సామాజిక సంస్థల ప్రమేయాన్ని బలోపేతం చేయడం ద్వారా నాణ్యమైన సేవలను అందించడం వంటి ముఖ్యమైన మూడు కీలక అంశాలపై దృష్టి సారించి, రాష్ట్రంలో అభ్యసనాభివృద్ధికి కృషి చేయనున్నట్లు తెలిపారు.

ఇది ప్రపంచ బ్యాంకు ప్రత్యేక ప్రాజెక్టు అని, మన రాష్ట్రంలో గత పదేళ్లలో ఇలాంటి ప్రాజెక్టు అమలు జరగలేదని పేర్కొన్నారు. ఫలితాలే లక్ష్యంగా అమలయ్యే ఈ ప్రాజెక్టును నిర్వహణ సామర్థ్యం కలిగిన రాష్ట్రాలకు మాత్రమే ప్రపంచ బ్యాంకు ఇస్తుందని మంత్రి చెప్పారు.

ఇలాంటి ప్రాజెక్టు మన రాష్ట్రానికి రావడం గర్వకారణమన్న మంత్రి.. సమగ్ర శిక్షా ఆధ్వర్యంలో ఈ పథకం అమలు జరుగుతుందన్నారు. ఇందుకోసం అంతర్జాతీయ ఖ్యాతి గాంచిన సలహా సంస్థల నుంచి కన్సల్టెంట్లను ఎంపిక చేయనున్నామన్నారు. రాష్ట్రంలో ఈ పథకం పర్యవేక్షణ కోసం ఒక ఐఏఎస్ అధికారి, జాయింట్ డైరెక్టర్ స్థాయి అధికారిని నియమిస్తామని మంత్రి తెలిపారు.

Read also : Bhatti : ‘ఒక దళిత ఎమ్మెల్యేగా నేను మౌనంగా ఉండలేనురా దుర్మార్గుడా..! శవాల మీద పేలాలు ఎరుకునే దౌర్భాగ్యుడా.!’