Andhra Pradesh: భ్రూణ హత్యలకు ఇక చెక్.. ఆ కీలక సమాచారమిస్తే భారీ నగదు బహుమతి.. ఏపీ సర్కారు కీలక ప్రకటన
గర్భస్థ శిశు లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించడం చట్ట వ్యతిరేకమైనా.. తెలుగు రాష్ట్రాల్లో పలు స్కానింగ్ కేంద్రాలు కాసుల కక్కుర్తితో దీన్ని కొనసాగిస్తూనే ఉన్నాయి. దీనికి చెక్ పెట్టేందుకు ఏపీ ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుంది.
గర్భస్థ శిశు లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించడం చట్ట వ్యతిరేకమైనా.. తెలుగు రాష్ట్రాల్లో పలు స్కానింగ్ కేంద్రాలు కాసుల కక్కుర్తితో దీన్ని కొనసాగిస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో భ్రూణ హత్యల నివారణ దిశగా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లింగ నిర్ధారణ పరీక్షలను నివారిస్తూ 1994లో తీసుకొచ్చిన చట్టాన్ని కఠినంగా అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటోంది. చట్టవ్యతిరేకంగా గర్భస్థ శిశు లింగ నిర్ధారణ పరీక్షలు చేసే స్కానింగ్ కేంద్రాల సమాచారాన్నందించిన వారికి భారీ నగదు పురస్కారం ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఆ మేరకు ఏపీ ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ కాటంనేని భాస్కర్ ఓ ప్రకటన విడుదల చేశారు. లింగ నిర్ధారణ పరీక్షలు చేసే స్కానింగ్ కేంద్రం నిర్వాహకులపై కేసు నమోదైతే రూ.25 వేలు నగదు బహుమతి ఇవ్వనున్నట్లు తెలిపారు. అలాగే నిందితులకు కోర్టులో శిక్ష ఖరారైతే సమాచారమిచ్చిన వారికి రూ.లక్ష పురస్కారం అందజేస్తామని తెలిపారు.
లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్న స్కానింగ్ కేంద్రాలకు సంబంధించిన సమాచారాన్ని 104 నెంబరుకు లేదా సంబంధిత జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారికి ఫోన్ ద్వారా తెలియజేయొచ్చని సూచించారు. అలాగే pcpndt.ap.gov.in వెబ్సైట్ గ్రీవెన్స్ ద్వారా కూడా తెలియజేయొచ్చని కోరారు. ఈ సమాచారమిచ్చిన వారి వివరాల్ని గోప్యంగా ఉంచుతమని ఏపీ ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ కాటంనేని భాస్కర్ తెలిపారు.
Also Read..
వామ్మో.. నలుగురు కూర్చునే కారులో 20 మంది అమ్మాయిలు..! గిన్నీస్ బుక్ రికార్డ్ సృష్టించారుగా..
Banana Benefits: రోజూ అరటిపండు తింటే ఆ వ్యాధులను తగ్గించవచ్చు…. ప్రయోజనాలు తెలుసుకోండి..