Andhra Pradesh: అయ్యో భగవంతుడా.. సకాలంలో వైద్యం అందక చిన్నారి మృతి.. మన్యంలో మరో విషాద గాధ
పేరు స్పందన.. చూసేందుకు ముద్దుగా ఉంది.. ఇప్పుడిప్పుడే బుడిబుడి అడుగులు వేస్తోంది.. ఆమె చిలక లాంటి పలుకులతో ఆ పేద కుటుంబం ఎంతో ఆనందంతో మురిసిపోయింది.. రోజూ కళ్ళముందు ఆ చిట్టితల్లి ఆడుకుంటుంటే ఎంతో సంబరపడిపోయేవారు.. కానీ ఒక్కసారిగా ఆ చిట్టి తల్లి అస్వస్థతకు గురైంది.
పేరు స్పందన.. చూసేందుకు ముద్దుగా ఉంది.. ఇప్పుడిప్పుడే బుడిబుడి అడుగులు వేస్తోంది.. ఆమె చిలక లాంటి పలుకులతో ఆ పేద కుటుంబం ఎంతో ఆనందంతో మురిసిపోయింది.. రోజూ కళ్ళముందు ఆ చిట్టితల్లి ఆడుకుంటుంటే ఎంతో సంబరపడిపోయేవారు.. కానీ ఒక్కసారిగా ఆ చిట్టి తల్లి అస్వస్థతకు గురైంది. డయేరియాతో విలవిల్లాడిపోయింది.. ఆసుపత్రికి తీసుకెళ్దామంటే బోరున వర్షం.. ఏజెన్సీలో ఆ రాత్రి చిమ్మ చీకటి..! రాత్రంతా మేలుకొని జాగారం చేసింది ఆ కుటుంబం. తెల్లవారుజామునే బయలుదేరింది.. కానీ.. ఆ చిన్నారి గుండె.. మార్గ మధ్యలోనే ఆగింది.. ఈ విషాద ఘటన అల్లూరి సీతారామరాజు జిల్లా జీకే వీధి మండలం కమ్మరి తోటలో చోటుచేసుకుంది. కమ్మరి తోట గ్రామంలో వాంతులు విరోచనాలతో అస్వస్థతకు గురైన మూడు సంవత్సరాల పాప మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు.
కమ్మరి తోట గ్రామానికి చెందిన రెడ్డి బాబురావు, నీలమ్మ దంపతులకు మూడు సంవత్సరాల కుమార్తె స్పందన ఉంది. స్పందన ఒక్కసారిగా అస్వస్థతతకు గురైంది.. రాత్రి స్పందనకు వాంతులు, విరోచనాలు అయ్యాయి.. డయేరియా అని అర్థమైంది.. కానీ ఆసుపత్రికి తీసుకెళదామంటే జోరు వాన కురుస్తుంది. కిలోమీటర్ల మేర ఆసుపత్రికి వెళ్లాల్సి ఉందని.. తెల్లవారుజామున తీసుకువెళ్దామని దంపతులు నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న దారకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి బయలుదేరారు..
అప్పుడు బాగానే ఉన్న స్పందన.. మార్గమధ్యలోకి వెళ్లేసరికి ఆరోగ్యం పూర్తిగా క్షీణించి మృతి చెందింది. మరికాసేపట్లో ఆసుపత్రికి వెళ్తామనగా.. ఆ చిన్నారి ఊపిరి ఆగింది. దీంతో చేసేదేం లేక తల్లిదండ్రులు గుండెలవిసేలా బోరున విలపించారు. స్పందనను తలుచుకుంటూ కుటుంబ సభ్యులు, గ్రామస్థులు కన్నీరుమున్నీరవుతున్నారు.
సకాలంలో వైద్యం అందినట్లయితే ప్రాణాలు కోల్పోయేది కాదంటూ గ్రామస్థులు పేర్కొంటున్నారు. ఏదీఏమైనా.. ఇలాంటి సందర్భాల్లో నిర్లక్ష్యం తగదు.. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే ఆసుపత్రికి వెళ్లండి..
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..