Joel Wilson: పిట్ట కొంచెం కూత ఘనం… పన్నెండేళ్లకే గిన్నిస్ బుక్‌లోకెక్కిన బుడ్డోడు!
Andhra News: పిట్ట కొంచెం కూత ఘనం అనే సామెత మీకు గుర్తుంది కదా..ఇదే తరహాలో బాపట్లకు చెందిన జోయెల్ విల్సన్ అనే కుర్రాడు..పన్నెండేళ్లకే గిన్నీస్ బుక్‌లోకి ఎక్కాడు. కీబోర్డులో ఒకే నిమిషంలో మూడు స్వరాలను ప్లే చేసిన గిన్నీస్ బుక్‌లో తన పేరు నమోదయ్యేలా చేశాడు.

కీ బోర్డుపై సరిగమలు నేర్చుకోవడం, అందులో ప్రావీణ్యం సాధించడానికి ఎన్నో ఏళ్ల సమయం పడుతుంది. కానీ 12 ఏళ్ల వయస్సులోనే కీ బోర్డు నేర్చుకోవడం, సరళ స్వరాలను ప్లే చేసి గిన్నిస్ బుక్ లోకి ఎక్కడం అంటే చిన్న విషయమేమీ కాదు. కానీ బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం బిడారుదిబ్బెకు చెందిన జోయెల్ విల్సన్ ఈ ఘనత సాధించాడు. విజయవాడలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్న జోయెల్… హలెల్ మ్యూజిక్ అకాడమీలో సంగీతం నేర్చుకుంటున్నాడు. గత ఏడాది డిసెంబరులో ఈ మ్యూజికల్ పాఠశాల ఆధ్వర్యంలో అంతర్జాతీయ స్థాయిలో ఆన్‌లైన్ సంగీత పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో18 దేశాలకు చెందిన సంగీత విద్వాంసులు పాల్గొనగా..జోయెల్ విల్సన్ నిమిషం వ్యవధిలో మూడు సరళి స్వరాలను కీబోర్డుపై ప్లే చేసి గిన్నీస్ రికార్డు నెలకొల్పాడు. ఈ పోటీల్లో మొత్తం 1090 మంది పాల్గొనగా 1046 మంది గిన్నిస్ బుక్ రికార్డుల్లోకి ఎక్కారు. సరళి స్వరాలను ప్లే చేసి రికార్డు సాధించిన వారికి లండన్ స్కూల్ ఆఫ్ మ్యూజిక్ లో శిక్షణ ఇస్తారు. జోయెల్ కూడా ఈ శిక్షణకు ఎంపికైనట్లు బాలుడి తల్లిదండ్రులు విల్సన్ బాబు, ప్రత్యూష చెప్పారు. బాలుడికి గత నెలలో గిన్నిస్ ప్రశంసా పత్రాన్ని అందించారు.
చిన్న వయస్సులోనే తమ ఊరి పేరును గిన్నిస్ బుక్‌లో ఎక్కించిన బాలుడిపై స్థానికులు ప్రశంసల జల్లు కురింపించారు. రానున్న రోజుల్లో ప్రపంచ సంగీతంలో జోయెల్ తనదైన ముద్ర వేయాలని కోరుకుంటున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…
