Rats in New York: ఎలుకలు బాబోయ్ ఎలుకలు.. అమెరికాలో ప్రజలకు కొత్త ఇక్కట్లు..
పై ఫోటోలో కుక్కలతో రాత్రి సమయంలో వీరంతా దొంగల కోసం తిరుగుతున్నారని అనుకుంటున్నారా? అయితే, మీరు తప్పులో కాలేసినట్టే.

Rats in New York: పై ఫోటోలో కుక్కలతో రాత్రి సమయంలో వీరంతా దొంగల కోసం తిరుగుతున్నారని అనుకుంటున్నారా? అయితే, మీరు తప్పులో కాలేసినట్టే. ఎందుకంటే.. వారు స్వచ్చందంగా తమ కుక్కల్ని తీసుకుని ఎలుకల వేటకు వెళుతున్నారు. షాక్ అయ్యారా? నిజమేనండీ.. ఇంతకీ ఇది ఎక్కడో చెప్పలేదు కదూ.. అమెరికాలోని న్యూయార్క్ సిటీలో.
ప్రస్తుతం అమెరికాలోని న్యూయార్క్‌లోని ప్రజలు ఎలుకలతో ఎక్కడలేని ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. రెండు మిలియన్లకు పైగా ఎలుకలను పట్టుకునేందుకు నగరంలో భారీ ప్రచారం ప్రారంభించారు. ఇక్కడ వీధులు, డ్రెయిన్లు, భవనాలు, పార్కులు, రెస్టారెంట్లు, మెట్రో స్టేషన్లు, షాపుల్లో ఎక్కడ ఎటుపక్క చూసినా ఎలుకలే దర్శనమిస్తున్నాయి. ఇక్కడి ప్రజలు ఎలుకల బాధతో ఏమి చేయాలో అర్ధం కాక తలలు పట్టుకుంటున్నారు.2019తో పోలిస్తే 2021లో ఎలుకలకు సంబంధించిన సమస్య 40 శాతం పెరిగింది.
పరిశుభ్రత లోపించడం, సకాలంలో చెత్త పార వేయకపోవడమే ఎలుకల వృద్ధికి కారణమని అక్కడి అధికారులు అంటున్నారు. కరోనా మహమ్మారి సమయంలో రెస్టారెంట్లు మూసివేయడం వల్ల, ఎలుకలకు సాధారణ ఆహారం లభించలేదు. దీని కారణంగా అవి ఇప్పుడు బహిరంగంగా ఆహారం కోసం వెతుకుతున్నాయి. ఎలుకలను పట్టుకోవడం కోసం ప్రజలు, అధికారులు చేసిన ప్రయత్నాలు ఏవీ విజయవంతం కాలేదు. ఇప్పుడు వీటిని పట్టుకోవడం కోసం వేట కుక్కలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇక్కడ 1995 నుంచి ఎలుకల వేటకోసం బోనులతో కొందరు ప్రయత్నాలు చేసేవారు. ఇళ్ళ వద్ద సమస్యలు ఉన్నవారు వారితో ఎలుకలను పట్టించేవారు. అయితే, ఈ బృందం రాత్రిపూట 15-20 ఎలుకలను మాత్రమే పట్టుకోగలదు. ఇప్పుడున్న ఎలుకల సంతతికి ఇలా పట్టుకుంటే సరిపోయే పరిస్థితి లేదు.
మేయర్ ఆడమ్స్ ఆందోళన..
న్యూయార్క్ మేయర్ ఎరిక్ ఆడమ్స్ కూడా ఎలుకల సమస్య పై తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. ప్రతిరోజూ చాలా కంపెనీలు ఎలుకలను నియంత్రించడానికి తమ కొత్త పరికరాలను.. పద్ధతులను సూచిస్తున్నాయి. ఇటీవల వారికి ఇటలీలో తయారు చేసిన బ్యాటరీతో పనిచేసే పరికరాన్ని చూపించారు. దీని సహాయంతో ఎలుకలను పట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది ఎలుకలకు కనిపించదు. అదేవిధంగా వాటిని సులభంగా పట్టుకోవచ్చు అని అధికారులు చెబుతున్నారు.
మొత్తమ్మీద ఇప్పుడు న్యూయార్క్ లో ప్రజలకు కరోనా కంటే అతి పెద్ద సమస్యే వచ్చిపడింది.